భారీగా తగ్గిన చెరకు విస్తీర్ణం

ABN , First Publish Date - 2020-08-13T09:49:14+05:30 IST

రాష్ట్రంలో చెరకు విస్తీర్ణం గణనీయంగా పడిపోయిందని చక్కెర శాఖ కమిషనర్‌ ఎల్‌.మురళీకుమార్‌ తెలిపారు. గతంలో రెండు లక్షల హెక్టార్లలో సాగయ్యేదని...ప్రస్తుతం 60వేల హెక్టార్లకు తగ్గిపోయిం

భారీగా తగ్గిన చెరకు విస్తీర్ణం

భీమసింగికి త్వరలో మంత్రుల కమిటీ

ఈ ఏడాది క్రషింగ్‌పై ఇప్పుడే చెప్పలేం

రాష్ట్ర చక్కెరశాఖ కమిషనర్‌ మురళి


 శృంగవరపుకోట రూరల్‌ (జామి), ఆగస్టు 12 :  రాష్ట్రంలో చెరకు విస్తీర్ణం  గణనీయంగా పడిపోయిందని చక్కెర శాఖ కమిషనర్‌ ఎల్‌.మురళీకుమార్‌  తెలిపారు. గతంలో రెండు లక్షల హెక్టార్లలో సాగయ్యేదని...ప్రస్తుతం 60వేల హెక్టార్లకు తగ్గిపోయిందని చెప్పారు. బుధవారం భీమసింగి షుగర్స్‌ను ఆయన పరిశీలించారు. సంస్థ ఎమ్‌డీ విక్టర్‌రాజుతో వివిధ అంశాలపె ౖచర్చించారు. ఫ్యాక్టరీ స్థితిగతులు, ఇటీవల వచ్చిన నిపుణుల కమిటీ సభ్యులు తెలిపిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. యంత్రాలను కూలకూషంగా పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చెరకు విస్తీర్ణం పెరగాలంటే రైతులకు రాయితీపై విత్తనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. 


 ఇక్కడి కర్మాగారం పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. యంత్రాలన్ని పురాతనమైనవని తెలిపారు. దీని అభివృద్ధి విషయంలో నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. త్వరలో ముగ్గురు మంత్రుల కమిటీ కర్మాగారాన్ని పరిశీలిస్తుందని ముర ళీ కుమార్‌ వెల్లడించారు. ఈ కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గౌతంరెడ్డి, కన్నబాబు ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు చక్కెర కర్మాగారాల్లో 1.50 లక్షల టన్నులు, సహకార కర్మాగారాల్లో 50వేల టన్నుల పంచదార నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. 19 షుగర్‌ ప్యాక్టరీలకు గాను ప్రస్తుతం 8 మాత్రమే పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాదికి వీటి సంఖ్య ఆరుకు తగ్గే అవకాశం ఉందన్నారు. 


క్రషింగ్‌పై చెప్పలేం

ఈ ఏడాది భీమసింగి షుగర్స్‌ క్రషింగ్‌పై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని కమిషనర్‌ మురళీకుమార్‌ చెప్పారు. ఉత్తరాంధ్రలోని నాలుగు సహకార చక్కెర కర్మాగారాలను కలిపి డిస్టిలరీ లేదా ఇథనాయిల్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. అనంతరం ఏఐటీయూసీ నాయకుడు  కృష్ణంరాజు, లోక్‌సత్తా నాయకుడు బీశెట్టి బాజ్జీ, సీఐటీయూ నేత తమ్మినేని సూర్యనారాయణ, వైసీపీ నేత గొర్లె రవికుమార్‌లు కమిషనర్‌ను కలిశారు. 


కర్మాగారంలో క్రషింగ్‌ కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.  వేలాదిమంది రైతులు దీనిని దీనిని నమ్ముకొని ఉన్నారని తెలిపారు. త్వరగా ఆధునికీరణ పనులు చేపట్టాలని కోరారు. దీనిపె కమిషనర్‌ మురళి స్పందిస్తూ  నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం పరిశీలించాక అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తాయని భరోసా ఇచ్చారు.


రిటైర్డ్‌ కార్మికులు తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరగా...త్వరలో అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కర్మాగారం ఆవరణలో కమిషనర్‌ మురళీకుమార్‌ మొక్కలు నాటారు. కార్యక్రమంలో సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-08-13T09:49:14+05:30 IST