చెంగాళమ్మ ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

ABN , First Publish Date - 2022-01-24T03:59:48+05:30 IST

: తెలుగు, తమిళ రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దేవత అయిన సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి వెల్లడించారు.

చెంగాళమ్మ ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌
చెంగాళమ్మ ఆలయంలో మీడియాతో మాట్లాడుతున్న పాలకవర్గ చైర్మన్‌ బాలచంద్రారెడ్డి

గర్భాలయ గోపురానికి బంగారు తాపడం 

కాళంగిలో స్నాన ఘట్టాలు, దక్షిణాన మరో గాలిగోపురం నిర్మాణం 

 ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి 

సూళ్లూరుపేట, జనవరి 23 : తెలుగు, తమిళ రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దేవత అయిన సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న బీసీ హాస్టల్‌ శిథిలభవనంతోపాటు ఇరిగేషన్‌,  పంచాయతీరాజ్‌ కార్యాలయ భవనాలను కలెక్టర్‌ ఈ నెల 18న ఆలయ అభివృద్ధి కోసం దేవస్థానానికి స్వాధీనం చేసినట్లు వెల్లడించారు. యాదగిరిగుట్ట ఆలయ సపటి సౌందర్‌రాజన్‌చే మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేయిస్తామని చెప్పారు. ఆలయ ఆవరణలోని పాత భవనాలను  తొలగించి ఓ పద్ధతి ప్రకారం నూతన భవనాలు నిర్మించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ చైర్మన్‌గా ఎవరు  ఉన్నా ఆ ప్లాన్‌ ప్రకారమే భక్తుల విరాళాలతో నిర్మాణాలు జరిగేలా పాలకవర్గం తీర్మానం చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆలయ దక్షిణ దిశన కాళంగిగట్టుపై ఉన్న నివాసాలను తొలగించి వారందరికీ జగన్న కాలనీల్లో గృహాలు నిర్మించేలా చేస్తామని చెప్పారు. ఆప్రాంతంలో స్నానఘట్టాలు నిర్మించి ఆలయంలోకి అక్కడినుంచే మార్గం ఏర్పాటుచేసి దక్షిణదిశలో మరో గాలిగోపురం కూడా నిర్మిస్తామని తెలిపారు. 

గర్భాలయ గోపురానికి బంగారుతాపడం

గర్భాలయ గోపురానికి బంగారుతాపడం చేయించేందుకు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అంగీకరించారని ఆలయ చైర్మన్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయ భవనాలను సైతం తొలగించి అక్కడ భజన మందిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు.  సమావేశంలో ఆలయ పాలకవర్గ సభ్యులు పొన్నా నాగమ్మ,  మద్దూరు శారద, కామిరెడ్డి రేవతి,  ముంగర అమరావతి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T03:59:48+05:30 IST