మథన పల్లె

ABN , First Publish Date - 2021-02-15T05:56:42+05:30 IST

కనీసం వేసవయినా రాకముందే రెండు కుసుమాలు మూఢభక్తి వేడిగాడ్పుకి వాడిపోవడం చోద్యానికి పరాకాష్ట...

మథన పల్లె

కనీసం వేసవయినా రాకముందే 

రెండు కుసుమాలు

మూఢభక్తి వేడిగాడ్పుకి వాడిపోవడం 

     చోద్యానికి పరాకాష్ట 


విరిగిపోయిన కాలచక్రంలో 

ఎప్పటికి కనబడని సత్య యుగపు ఆనవాళ్లు

ఏ తీరాల వైపు వెళ్లాలనుకున్నాయో కానీ

అడుగులు మాత్రం అస్పష్టంగానే తడబడ్డాయి


అవాస్తవాలు, అభూత కల్పనలు 

రోజు రోజుకి అరచేతుల్లో అరిచిగోల పెడుతుంటే 

చచ్చిపోయిన ఇంటి కుక్కపిల్లలు 

మళ్ళీ మళ్ళీ బతికొచ్చి ఆశ్చర్యపరుస్తాయి

మోసపోవడం మనకి పురాతన అలవాటు


గంటకో ప్రవచనం వినపడి పావనమౌతున్న 

ఆగర్భ ఆధ్యాత్మికమని చెప్పుకునే 

నేలమీద దయ్యాలు నిమ్మకాయల్లో దూరాయని 

ఎలా ఊహించారో తెలియదు కదా


తానే శివుడని భావించే అమ్మ ఒక ఆసుపత్రి గదిలో

మీ నెత్తుటి పాశం నాన్న జైలు గదిలో 

ఎప్పటికీ పునరుత్థానం చెందని చెల్లి ఆత్మని తీసుకుని

ఎవరి దగ్గరకి ముందు వెళ్తావో

ముందే ఎక్కడైనా భవిష్యత్‌ దర్శనం రాసిపెట్టి ఉండాల్సింది


నుదుటిమీద త్రిశూలపు ముగ్గు చూశాక

రాగిపాత్రలో నవరత్నాల కథ విన్నాక 

మీ మెడలో ఉన్న తాయెత్తు మీద రాసిన తాంత్రిక భాషకి 

       సరికొత్త వ్యాఖ్యానం రాయాలని ఉంది


మిమ్మల్ని మనువు ఆవహించాడు

మతం తన ఇంట్లో మిమ్మల్ని పెంచుకుంది 

మూఢనమ్మకం అలౌకికతను నూరిపోసింది

మీ నీడలు నిట్ట నిలువునా మోసం చేశాయి

నేర్పవలసిన గుణపాఠాల లెక్క రాస్తే

          ముందు మీతోనే రాయాలి 

ఈ భక్తి చరిత్ర ఏ యుగానికైనా నిలబడగలిగే కేస్‌ స్టడీ


మూసివేయబడిన గతకాలపు యుగాల 

          దార్లన్ని అసంపూర్ణాలైన చోట 

ఇదంతా ఇంద్రజాలిక మహామాయ 

మెదళ్ల నిండా అగరబత్తి అనుసంధానం

చదువుకున్న జ్ఞానమంతా 

ఆ రెండు మృతదేహాల చితి మంటలపై పోసిన పన్నీరు 

మీకు శిక్ష విధించే సెక్షన్లేవి ఇంకా రాయబడలేదు 

లేని యుగాల ఊహల్లో ఊరేగి ఊరేగి వెళ్లిపోయిన మీకూ 

బతికే ఉండి ఇంకా ఊరేగడానికి సిద్ధమౌతున్న వాళ్ళకి 

మాబోటి సామాన్యుల నివాళి

అనిల్‌ డ్యాని

97033 36688


Updated Date - 2021-02-15T05:56:42+05:30 IST