Abn logo
Sep 20 2021 @ 23:35PM

‘మతిమరుపు’ను లైట్‌ తీసుకోవద్దు!

మంచాన పడేస్తుంది.. నిద్రలోనే ప్రాణం తీస్తుంది!

60ఏళ్లు దాటితే తస్మాత జాగ్రత్త!

కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ముఖ్యం

నేడు ప్రపంచ మతిమరుపు దినోత్సవం 


నెల్లూరు (వైద్యం) సెప్టెంబరు 20 :

జ్ఞాపకాలే నిట్టూర్పు.. జ్ఞాపకాలే ఓదార్పు.. అన్నాడో సినీకవి. అలాంటి జ్ఞాపకాలే జీవితాన్ని నిత్యనూతనం చేస్తుంటాయి. జ్ఞాపకాలు లేకపోతే మనసంతా శూన్యమై, బతుకు భారమైపోతుంది. కొన్ని జ్ఞాపకాలు మెదడు పొరల్లో నిక్షిత్తమై ఎన్ని సమస్యలు ఎదురయినా బతుకు మీద తీపిగుర్తుగా నిలిచిపోతాయి. ఆశాభావాన్ని మేల్కొలుపుతాయి. కోల్పోతే ఆ జీవితమంతా అస్తవ్యస్తంగా మారుతుంది. ఇలా జ్ఞాపకశక్తిని కోల్పోవడమే వైద్య పరిభాషలో అల్జీమర్స్‌ (మతిమరుపు) అంటారు. జ్ఞాపకశక్తి క్రమేపి తగ్గిపోయి (డెమెన్షియా) వ్యాధికి గురై తెలివి (మెమోరీ) తగ్గి బంధువులు, స్నేహితులతోపాటు కుటుంబ సభ్యులను మరచిపోయే స్థాయికి చేరుకోవడం మతి మరుపు వ్యాధికి (అల్జీమర్స్‌) కారణం. ఈ వ్యాధిపై నిర్లక్ష్యం చేస్తే వ్యాధిగ్రస్తుడు మంచానికే పరిమితమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కోసారి నిద్రలోనే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. 1906లో అల్జీమర్‌ అనే జర్మనీ న్యూరో పైథాలజిస్ట్‌ ఈ వ్యాధిని కనుగొన్నాడు. మెదడులోని కొన్ని బాగాలు దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని ఆయన నిర్ధారించారు. ఆయన జ్ఞాపకార్థం ఏటా సెప్టెంబరు 21వ తేదీన ప్రపంచ ఆల్జీమర్స్‌ డేగా ప్రకటించారు. 


జిల్లాలో 70 వేల మందికిపైగా... 


జిల్లాలో ఈ మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్‌) వ్యాధిగ్రస్తులు 70 వేల మందికిపైగా ఉన్నారు. 65 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయసు ఉన్న వారిలో 10 శాతం మంది, 85 ఏళ్ల పైబడిన వారిలో 50 శాతం మంది ఈ వ్యాధికి గురవుతున్నట్లు వైద్యులు నిర్ధారిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో ఉన్న వారే ఎక్కువగా ఈ వ్యాధి బారినపడుతున్నారు.  మనిషి ఒత్తిడికి గురైనప్పుడు మెదడులో విషయగ్రహన చర్యను అడ్డుకునే అల్లోప్రెగనోలోన్‌ అనే స్టెరాయిడ్స్‌ స్థాయిలు అధికమవుతున్నాయి. ఇది ఎక్కువ కాలం కొనసాగితే అల్జీమర్స్‌ వచ్చే ముప్పు ఉంది.  అందుకే ఒత్తిడిని బాగా తగ్గించు కోవాలి.


తొలి దశలోనే జాగ్రత్త పడాలి ..


అల్జీమర్స్‌ వ్యాధి పూర్తి నివారణకు వీలుకాదు. నియంత్రణ మాత్రమే చేయవచ్చు. వయసు పైబడకపోయినా వారి తలలో రక్తం గడ్డకట్టటం, తలకు తీవ్ర గాయం అయినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే అల్జీమర్స్‌ వ్యాధిగా నిర్ధారించరాదు. రక్తంలో సోడియం, క్రియాటీన్‌, థైరాయిడ్‌ మోతాదు తగ్గితే అల్జీమర్స్‌ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే మందులతో నయం చేయవచ్చు. 


ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే..


అల్జీమర్స్‌ వ్యాధిని గుర్తించే ఆధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాఽథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధిని నయంచేయవచ్చు. ముందుగా మెదడులో ఏ ప్రాంతం దెబ్బతిన్నదో తెలుసుకుంటే సరైన వైద్యం అందించవచ్చు. ముఖ్యంగా కుటుంబ బాంధవ్యాలు చాలా వరకు లోపిస్తున్నాయి. అందుకే పిల్లలు కూడా మానసికంగా దెబ్బతింటున్నారు. పెద్దల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు బలపడాల్సి ఉంది.

- డాక్టర్‌ సంపత్‌కుమార్‌, న్యూరోఫిజీషీయన్‌. నారాయణ ఆసుపత్రి


అన్నీ అల్జీమర్స్‌ కాదు! 


కొన్ని మతిమరుపులకు సంబంధించి అన్నిటినీ అల్జీమర్స్‌గా నిర్ధారించలేం. ప్రత్యేక పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించి చికిత్స అందించాలి. మతిమరుపు వ్యాధిగ్రస్థులను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే నయం చేసే వీలుంటుంది. వ్యాధి మూడో దశకు చేరితే నివారణకు మందులు లేవు. వ్యాధిగ్రస్థులకు సేవలు ఎలా చేయాలో కుటుంబ సభ్యులకు అవగాహన కూడా కల్పిస్తున్నాం. 

- డాక్టర్‌ బాలఖాసీం, న్యూరాలజిస్ట్‌ కిమ్స్‌ ఆసుపత్రి