గుండెచెరువు

ABN , First Publish Date - 2021-06-22T05:21:24+05:30 IST

గుండెచెరువు

గుండెచెరువు
ఎక్స్‌కవేటర్‌తో చెరువులో తవ్వకాలు

పచ్చని పల్లెల్లో అధికారపక్ష నేతల అక్రమాలు

పామర్రు మండలం కాపవరం చెరువు నాశనం

చెరువు కట్టలు మాయమయ్యేలా తవ్వకాలు

పంచాయతీ తీర్మానాలు బుట్టదాఖలు

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

ఎమ్మెల్యే మనుషులమంటూ రుబాబు

పామర్రు (గుడివాడ) : అధికారపక్ష నాయకుల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. పామర్రు ఎమ్మెల్యే మనుషులమంటూ కొంతమంది మట్టి మాఫియా అవతారమెత్తి దోచుకుతింటున్నారు. ఫలితంగా పామర్రు మండలం పెరిశేపల్లి శివారు గ్రామమైన కాపవరంలోని చెరువుల స్వరూపాలు పూర్తిగా మారిపోయాయి. మూడు మీటర్ల మేర ఉండాల్సిన చెరువు కట్ట కేవలం మీటరుకు కుచించుకుపోయేలా మట్టిని తవ్వేశారు. ఈనెల 6వ తేదీన మొదలైన దాష్టీకం నేటికీ కొనసాగుతూనే ఉంది. 

పంచాయతీ తీర్మానం పట్టించుకోకుండా..

సాధారణంగా చెరువులో తీసిన మట్టిని చెరువు కట్టల పటిష్టానికి వాడటంతో పాటు గ్రామంలోని పేదల ఇళ్ల స్థలాల మెరకకు ఉపయోగించాలి. అలాకాకుండా బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాపవరం చెరువుకు దక్షిణం, తూర్పు వైపున ఉన్న కట్టలను సైతం మాయం చేశారు. చెరువు గట్లు బలహీనం కావడంతో కట్టలపై ఉన్న కొబ్బరిచెట్లు ఆధారం కోల్పోయి పడిపోయే పరిస్థితి దాపురించింది. ఇక మట్టి లోడ్‌లతో తిరిగే ట్రాక్టర్లకు విద్యుత్‌ స్తంభాలు తగిలి కింద పడిపోతున్నాయి. ఈ విషయమై  కలెక్టర్‌, డీపీవో, ఆర్డీవో, తహసీల్దార్‌, ఎంపీడీవోలకు గ్రామ సర్పంచ్‌ చెరుకూరి పద్మ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చెరువు మట్టిని గ్రామంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల మెరకకు వినియోగించాలని పంచాయతీ తీర్మానం ఉన్నా.. అలా చేయకుండా ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారు. అక్రమార్కులతో అధికారులు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. తక్షణం మట్టి తవ్వకాలు నిలిపి చెరువు స్వరూపాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం : ఆర్డీవో

ఈ విషయమై ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌ను వివరణ కోరగా, ఆ ప్రాంతానికి ఇప్పటికే తహసీల్దార్‌, వీఆర్వోలను పంపి విచారణ చేశామని, మట్టి దోపిడీకి పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

----------------------------------------------------------------------------

పట్టపగలే బరితెగింపు

ఆగని అధికారపక్ష నేతల చేపల చెరువుల తవ్వకాలు

నందివాడ రూరల్‌ (గుడివాడ), జూన్‌ 21 : నందివాడ మండలం పుట్టగుంటలో పట్టా పుట్టించి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడమే కాకుండా, చేపల చెరువు తవ్వుతున్న వారిని అడ్డుకున్నామని హడావుడి చేసిన రెవెన్యూ అధికారుల ఆదేశాలు తాటాకు చప్పుళ్లే అని తేలిపోయాయి. ఆక్రమిత భూమికి సరిహద్దుగా ఉన్న మరో ఐదు ఎకరాల అసైన్డ్‌, ప్రభుత్వ భూమిలోనూ అక్రమార్కులు పట్టపగలే చేపల చెరువులు తవ్వేశారు. రెవెన్యూ ఉన్నతాధికారి కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉన్న ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లకు తోడు సోమవారం ట్రాక్టర్‌ డోజర్లను రంగంలోకి దింపి చెరువులు తవ్వారు. పుట్టగుంట, అరిపిరాల, తుమ్మలపల్లి గ్రామాల సరిహద్దున ఉన్న డొంక ఈ అక్రమ చేపల చెరువుల గట్టుగా మారిపోతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాదంలో ఉన్న భూమికి సంబంధించి 2018కి ముందున్న అడంగళ్‌ కాపీ పుస్తకాలు బయటపెడితే కబ్జా పర్వం వెలుగు చూస్తుందని నిపుణులు చెబుతున్నా అధికారులు ఆ దిశగా శ్రద్ధ చూపట్లేదు. దీనిపై నందివాడ తహసీల్దార్‌ రెహ్మాన్‌ను వివరణ కోరగా, ఆక్రమణలపై సమగ్రంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. 





Updated Date - 2021-06-22T05:21:24+05:30 IST