దండకారణ్యంపై కరోనా దాడి.. కొవిడ్‌ బారిన పడుతున్న మావోయిస్టులు

ABN , First Publish Date - 2021-05-12T06:34:38+05:30 IST

‘దండకారణ్యంలోకి కరోనా వైరస్‌ వ్యాపించిందా, అదును చూసి మావోయిస్టులపై దాడి చేసి మావోయిస్టులకు ఊపిరి ఆడకుండా చేస్తోందా ?’ అంటే అవుననే అంటున్నారు ఛత్తీస్‌గఢ్‌ ఇంటిల్‌ జెన్సీ వర్గాలు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌, సుక్మా, దంతెవాడ జిల్లాల పరిధిలోని అడవుల్లో అనేక మంది మావోయిస్టులు కరోనా భారిన పడ్డారు. వీరిలో సుమారు 10మంది మావోయిస్టులు మృతి చెందగా మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

దండకారణ్యంపై కరోనా దాడి.. కొవిడ్‌  బారిన పడుతున్న మావోయిస్టులు

 ఛత్తీస్‌గఢ్‌లో పది మంది మృతి 

 పలువురి పరిస్థితి విషమం

 చెట్ల బెరళ్లు, పసరుతో వైద్యం 

పొందుతున్న దళాలు

 అడవిలో వేగంగా వ్యాపిస్తున్న వైరస్‌

 ప్రత్యేక క్యాంపుల్లో మావోయిస్టులు

 కరోనా వలయంలో గిరిజన గ్రామాలు 

 జనజీవనంలోకి వస్తే 

వైద్యం అందిస్తామంటున్న పోలీసులు

చర్ల, మే 11: ‘దండకారణ్యంలోకి కరోనా వైరస్‌ వ్యాపించిందా, అదును చూసి మావోయిస్టులపై దాడి చేసి మావోయిస్టులకు ఊపిరి ఆడకుండా చేస్తోందా ?’ అంటే అవుననే అంటున్నారు ఛత్తీస్‌గఢ్‌ ఇంటిల్‌ జెన్సీ వర్గాలు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌, సుక్మా, దంతెవాడ జిల్లాల పరిధిలోని అడవుల్లో అనేక మంది మావోయిస్టులు కరోనా భారిన పడ్డారు. వీరిలో సుమారు 10మంది మావోయిస్టులు మృతి చెందగా మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అలాగే ఆయా జిల్లాల పరిధిలోని గిరిజనులు కూడా కరోనా వైరస్‌తో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. కరోనా ధాటికి దండకారణ్యం ఉక్కరి బిక్కిరవుతోంది. కాగా కరోనా బారినపడిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే వైద్య సేవలు అందిస్తామని  ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. 

మావోయిస్టులను కబళించిన కరోనా

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జీజాపూర్‌, దంతెవాడ, సుక్మా జిల్లాల్లో మావోయిస్టుల సంచారం అధికంగా ఉంటుంది. అలాగే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కాగా కరోనా సెకండ్‌వేవ్‌లో ఓ గిరిజనుడి ద్వారా దంతెవాడ, సుక్మా సరిహద్దుల్లో సంచరించే మావోయిస్టు దళంలోని ఓ సభ్యుడికి కరోనా సోకిందని తెలుస్తోంది. అధికాస్తా ఒకరి నుంచి ఒకరికి చేరి అనేక మంది మావోయిస్టులకు వైరస్‌ అంటుకున్నట్లు సమాచారం. ఇలా సుమారు 150 మంది మావోయిస్టులకు ఈ వైరస్‌ అంటుకున్నట్లు తెలుస్తోంది.  ఇలా వైరస్‌ బారిన పడ్డవారిలో సుమారు 8నుంచి 10మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరి కొంత మంది పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి.

వైరస్‌ వలయంలో దండకారణ్యం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ, సుక్మా, బీజీపూర్‌ జిల్లాల్లో సుమారు 700 పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ దండకారణ్యలో ఉన్నవే కాగా ఇప్పడు ఆ గ్రామాల్లో కరోనా విలయతాండవం చేస్తోందని సమాచారం. ప్రతీ గ్రామంలో సుమారు 10నుంచి 20మంది వైరస్‌ ఉన్నవారే కనిపిస్తున్నారని సమాచారం. కాగా వీరంతా ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వసల పనులు చేసిన వారేనని, ఆయా రాష్ట్రాల్లో పనులు చేసే క్రమంలో వారు వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇలా వారి ద్వారా స్థానిక గిరిజనులకు వైరస్‌ అంటుకున్నట్లు తెలుస్తోంది. వైరస్‌ తీవ్రత అధికంగా ఉండడంతో ఆయా జిల్లాలోని  సుమారు ఏడుగురు స్థానికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధ్రువీకరించలేదు.

కరోనాకు ఫుడ్‌పాయిజన్‌ తోడు

కాగా గత 20 రోజుల క్రితం మావోయిస్టు పార్టీ దంతెవాడ అడవుల్లో కొంత మంది గిరిజనులతో కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఇదే క్రమంలో మావోయిస్టులు తిన్న ఆహారం, పాలు పాయిజన్‌ అయినట్లు తెలుస్తోంది. దాంతో అప్పటికే కరోనాతో భాదపడుతున్న మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

చెట్ల బెరళ్లు, ఆకు పసర్ల వైద్యం

వైరస్‌ బారిన పడ్డ మావోయిస్టులు దండకారణ్యంలోని చెట్ల బెరళ్లు, ఆకుల పసరల ద్వారా మందులు తయారు చేసుకుని వైద్యం పొందుతున్నట్లు తెలుస్తోంది. స్థాకంగా ఉండే కొంతమంది నాటు వైద్యులు మావోయిస్టులకు ఈ మందును అందిస్తున్నట్లు పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే స్థానికంగా లభించే ఇంగ్లీష్‌ మందులను కూడా మావోయిస్టులు వాడుతున్నట్లు తెలుస్తోంది. వైరస్‌ ఇతర పార్టీ సభ్యులకు కూడా సోకకుండా ప్రత్యేక క్యాంపుల్లో మావోయిస్టులు వైద్యం పొందుతున్నట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు చెబుతున్నాయి. అలాగే దండకాణ్యంలోని పలుగ్రామాల్లో ఉండే గిరిజనులు కూడా స్థానిక నాటు వైద్యాన్నే ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 

లొంగిపోతే ఆదుకుంటాం

 దంతెవాడ ఎస్పీ అభిషేక్‌పల్లవ్‌ 

కరోనా వైరస్‌ బారినపడ్డ మావోయిస్టులు అడవుల్లో ఇబ్బందులు పడకుండా లొంగిపోవాలని బీజాపూర్‌, దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్‌పల్లవ్‌ ప్రచారం చేస్తున్నారు. లొంగిపోతే ప్రభుత్వం నుంచి మెరుగైన వైద్యం అదిస్తామని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి అభించే అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. 



Updated Date - 2021-05-12T06:34:38+05:30 IST