మయాంక్‌ నిలిచాడు

ABN , First Publish Date - 2021-12-04T08:39:31+05:30 IST

తొలి టెస్టులో చేసింది 30 పరుగులే.. దీంతో జట్టులో చోటే సందేహంగా మారిన వేళ.. తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సత్తా చాటుకున్నాడు.

మయాంక్‌ నిలిచాడు

అజేయ శతకంతో అండగా.. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 221/4

ఎజాజ్‌కు నాలుగు వికెట్లు 

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు


తొలి టెస్టులో చేసింది 30 పరుగులే.. దీంతో జట్టులో చోటే సందేహంగా మారిన వేళ.. తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సత్తా చాటుకున్నాడు. చావో.. రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో కివీ్‌సపై ఎదురుదాడికి దిగి   క్రీజులో నిలిచిన తీరు అపూర్వం. స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ విజృంభణకు 80/3తో కష్టాల్లో పడిన జట్టును తొలి రోజే అజేయ శతకంతో మెరుగైన స్థితిలో నిలిపాడు. జట్టు సాధించిన స్కోరులో సగంకన్నా ఎక్కువ అతడి పరుగులే ఉండడం విశేషం. మరోవైపు మైదానం తడిగా ఉండడంతో రెండు సెషన్ల ఆటే వీలైంది.


ముంబై: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఎప్పటిలాగే మిడిలార్డర్‌ నిరాశపరిచినా.. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (246 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 120 బ్యాటింగ్‌) అసలు సిసలైన ఆటను ప్రదర్శించాడు. ఒకవేళ రహానెను ఆడిస్తే మయాంక్‌పైనే వేటు పడేది. ఈ దశలో దక్కిన అవకాశాన్ని అతడు అద్భుతంగా వినియోగించుకున్నాడు. తిరుగులేని షాట్లతో కెరీర్‌లో నాలుగో శతకాన్ని బాదాడు. మరో ఓపెనర్‌ గిల్‌ (71 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 44) కూడా సహకరించడంతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆట ముగిసే సమయానికి 70 ఓవర్లలో 4 వికెట్లకు 221 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్‌తో పాటు సాహా (25 బ్యాటింగ్‌) ఉన్నాడు. ఉదయం పూట మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో తొలి సెషన్‌ను రద్దు చేశారు. ముంబైలోనే జన్మించిన కివీస్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ తన సొంత మైదానంలో నాలుగు వికెట్లతో మెరిశాడు. గాయం కారణంగా జడేజా, రహానె, ఇషాంత్‌లను తప్పించారు.


శుభారంభం అందినా..:

అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా ఉండడంతో రెండో టెస్టును లంచ్‌ విరామం నుంచి ఆరంభించారు. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఇక బంతి చక్కగా బౌన్స్‌ కావడంతో ఓపెనర్లు మయాంక్‌, గిల్‌ ఇబ్బంది లేకుండా ఆడారు. ముఖ్యంగా  గిల్‌ రెండో ఓవర్‌లోనే 3 ఫోర్లు బాదాడు. దీంతో తొలి 4ఓవర్లలో జట్టుస్కోరు 20కి చేరింది. అటు ఒత్తిడిలో ఉన్న మయాంక్‌ ఆరంభంలో మాత్రం ఆచితూచి ఆడాడు. ఎజాజ్‌ ఓవర్‌లో భారీ సిక్స్‌ బాదాక అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అలాగే స్క్వేర్‌ డ్రైవ్‌తో మిచెల్‌ ఓవర్‌లో ఫోర్‌తో ట్రాక్‌లో పడ్డాడు. అక్కడి నుంచి సూపర్‌ స్ట్రోక్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు.


ఎజాజ్‌ దెబ్బ:

అంతా సవ్యంగా సాగుతుందనుకున్న దశలో స్పిన్నర్‌ ఎజాజ్‌ భారత్‌కు ఝలక్‌ ఇచ్చాడు. అర్ధసెంచరీకి సమీపంలో గిల్‌ను మొదట అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక అదే స్కోరు వద్ద తన మరుసటి ఓవర్‌లోనే పుజార (0)ను ఓ అద్భుత బంతితో బౌల్డ్‌ చేశాడు. తన సహజశైలికి భిన్నంగా పుజార క్రీజు బయటికి వెళ్లి ఫ్లిక్‌ చేయాలని చూశాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్‌ తీసుకుని వికెట్లను పడగొట్టింది. అదే ఓవర్‌లో కోహ్లీ (0)ని కూడా ఎల్బీ చేయడంతో భారత్‌ ఒక్కసారిగా తడబడింది. అటు మయాంక్‌ మాత్రం బౌండరీలతో ఒత్తిడి పెంచాడు. చివరకు 111/3 స్కోరుతో జట్టు టీ బ్రేక్‌కు వెళ్లింది.


మయాంక్‌ సెంచరీ:

చివరి సెషన్‌లో కివీస్‌ బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. 80/3తో కష్టాల్లో పడిన జట్టును ఆఖరి సెషన్‌లో మయాంక్‌- శ్రేయాస్‌ (18) జోడీ ఆదుకుంది. వీరు నాలుగో వికెట్‌కు 80 రన్స్‌ జోడించారు. అయితే తొలి టెస్టు సెంచరీ హీరో శ్రేయా్‌సను కూడా ఎజాజ్‌ పెవిలియన్‌  చేర్చాడు. అటు మయాంక్‌ స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించాడు. 59వ ఓవర్‌లో ఫోర్‌తో అద్భుత సెంచరీని అందుకున్నాడు. తనకు వికెట్‌ కీపర్‌ సాహా సహకారం అందించడంతో ఐదో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు సమకూరాయి. వెలుతురు మందగించడంతో ఆటను అర్ధగంట ముందుగానే నిలిపేశారు.


 11 ఏళ్ల తర్వాత స్వదేశంలో కివీ్‌సపై సెంచరీ చేసిన భారత ఓపెనర్‌గా మయాంక్‌ అగర్వాల్‌. 2010లో సెహ్వాగ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఏ వేదికపై అయినా 2014లో ధవన్‌ తర్వాత కివీ్‌సపై శతకం బాదిన ఓపెనర్‌ కూడా మయాంక్‌ ఒక్కడే.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (బ్యాటింగ్‌) 120; గిల్‌ (సి) టేలర్‌ (బి) ఎజాజ్‌ 44; పుజార (బి) ఎజాజ్‌ 0; కోహ్లీ (ఎల్బీ) ఎజాజ్‌ 0; శ్రేయాస్‌ (సి) బ్లండెల్‌ (బి) ఎజాజ్‌ 18; సాహా (బ్యాటింగ్‌) 25; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 70 ఓవర్లలో 221/4. వికెట్ల పతనం: 1-80, 2-80, 3-80, 4-160. బౌలింగ్‌: సౌథీ 15-5-29-0; జేమిసన్‌ 9-2-30-0; ఎజాజ్‌ పటేల్‌ 29-10-73-4; సోమర్‌విల్లే 8-0-46-0; రచిన్‌ రవీంద్ర 4-0-20-0, మిచెల్‌ 5-3-9-0.

Updated Date - 2021-12-04T08:39:31+05:30 IST