మా పోలీసుల్ని అప్పగించండి : మయన్మార్

ABN , First Publish Date - 2021-03-06T21:10:05+05:30 IST

భారత్‌లో ప్రవేశించిన తమ పోలీసులను తిరిగి అప్పగించాలని మయన్మార్ కోరింది

మా పోలీసుల్ని అప్పగించండి : మయన్మార్

న్యూఢిల్లీ : భారత్‌లో ప్రవేశించిన తమ పోలీసులను తిరిగి అప్పగించాలని మయన్మార్ కోరింది. ఫిబ్రవరి 1న ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలదోసి, అధికారం చేపట్టిన సైనిక ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి ఇష్టపడని కొందరు పోలీసులు మన దేశంలో ఇటీవల ప్రవేశించిన సంగతి తెలిసిందే. సైనిక ప్రభుత్వంపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుండగా, ఆ నిరసనలను కఠినంగా అణచివేసేందుకు సైన్యం ప్రయత్నిస్తోంది. 


సైనిక ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి ఇష్టపడని దాదాపు 30 మంది పోలీసు అధికారులు తమ కుటుంబ సభ్యులతో సహా భారత దేశంలో ప్రవేశించినట్లు మన దేశంలోని మిజోరాం రాష్ట్రంలో ఉన్న చంపాయ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మారియా సీటీ జువాలి తెలిపారు. ఎనిమిది మంది పోలీసు అధికారులను తిరిగి తమ దేశానికి అప్పగించాలని మయన్మార్‌లోని ఫాలం జిల్లా అధికారులు ఓ లేఖ ద్వారా తమను కోరినట్లు తెలిపారు. స్నేహపూర్వక సంబంధాలను నిలబెడుతూ ఈ పోలీసు అధికారులను తిరిగి అప్పగించాలని కోరినట్లు చెప్పారు. తాము భారత దేశ హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. 


మయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలకు పోలీసులు కూడా మద్దతిస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు తమ దేశాన్ని విడిచి పారిపోవడం ఇదే తొలిసారి అని సమాచారం. 


Updated Date - 2021-03-06T21:10:05+05:30 IST