మాయావతి ఎన్నికల ప్రచారంపై బీఎస్‌పీ క్లారిటీ

ABN , First Publish Date - 2022-01-07T22:37:39+05:30 IST

అనేక పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తున్నవారు ‘మాయావతి ఎక్కడ?’ అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కాగా, ఈ విషయమై తాజాగా బహుజన్ సమాజ్ పార్టీ క్లారిటీ ఇచ్చింది..

మాయావతి ఎన్నికల ప్రచారంపై బీఎస్‌పీ క్లారిటీ

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా రోజులుగా జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయి నేతలంతా యూపీ రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ చెమటోడుస్తున్నారు. ఆరోపణలు-ప్రత్యారోపణలు, ఎత్తులు-పైఎత్తులతో ఉత్తరప్రదేశ్ వాతావరణం అంతా రాజకీయ వేడితో సెగలు పుడుతోంది. అయితే ఇంత జరుగుతున్నా మాయావతి కనిపించడం లేదు. బహుజన్ సమాజ్ పార్టీ నేతలు ర్యాలీలు, సభలతో బిజీ బిజీగానే గడుపుతున్నప్పటికీ మాయావతి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈ విషయం మామూలు జనాలనే కాదు దేశ నాయకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ బహిరంగ సభలోనే కేంద్ర మంత్రి అమిత్ షా ఈ విషయమై స్పందించారు. ‘‘బెహెన్‌జీ కనిపించడం లేదు. ప్రచారానికి రావడం లేదు. ఓడిపోయాక మేం ప్రచారమే చేయలేదని అంటారేమో?’’ అని అమిత్ షా సెటైర్లు వేశారు కూడా.


అనేక పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తున్నవారు ‘మాయావతి ఎక్కడ?’ అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కాగా, ఈ విషయమై తాజాగా బహుజన్ సమాజ్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. మాయావతి ప్రచారానికి వచ్చినా, రాకపోయినా ఎన్నికల సన్నాహాల్లో ఆమె చురుగ్గా ఉన్నారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితమే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతిష్ చంద్ర మిశ్రా మాట్లాడుతూ ‘‘బెహెన్‌జీ తొందరలోనే ప్రచారంలోకి రాబోతున్నారు. ఆమె రాకతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉప్పెన వస్తుంది’’ అని అన్నారు. అయితే ఎప్పుడు రాబోతున్నారనే దానికి ఆయన స్పష్టత ఇవ్వలేదు.

Updated Date - 2022-01-07T22:37:39+05:30 IST