‘సుప్రీం’ పర్యవేక్షణలో దర్యాప్తుజరగాలి: మాయావతి

ABN , First Publish Date - 2020-07-11T07:03:25+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ను విపక్షాలు ఖండించాయి. ఎన్‌కౌంటర్‌ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని, ఎనిమిది మంది పోలీసుల హత్యలపైనా దర్యాప్తు జరగాలని

‘సుప్రీం’ పర్యవేక్షణలో దర్యాప్తుజరగాలి: మాయావతి

  • ప్రభుత్వాన్ని కాపాడేందుకే దూబే ఎన్‌కౌంటర్‌: అఖిలేష్‌


లఖ్‌నవూ/న్యూఢిల్లీ, జూలై 10: ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ను విపక్షాలు ఖండించాయి. ఎన్‌కౌంటర్‌ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని, ఎనిమిది మంది పోలీసుల హత్యలపైనా దర్యాప్తు జరగాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్‌ చేశారు. అలాగే రౌడీల చేతుల్లో హత్యకు గురైన పోలీసుల కుటుంబాలకు న్యాయం జరిగేందుకు, పోలీసులకు-నేర రాజకీయ అంశాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు కూడా విచారణ చేపట్టాలని ట్విటర్‌లో ఆమె కోరారు. ఎన్‌కౌంటర్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ అనుమానాలు వ్యక్తంచేశారు. దూబేను తీసుకొస్తున్న కారు బోల్తాపడలేదని, నిజాలు బయటికొస్తే యోగి ప్రభుత్వం పడిపోతుందని, ప్రభుత్వం పడిపోకుండా ఉండేందుకే కారు బోల్తాపడినట్లు నాటకమాడి, దూబేను ఎన్‌కౌంటర్‌ చేశారని ట్విటర్‌లో ఆయన ఆరోపించారు. దూబే ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా గాంధీ డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ‘గూండారాజ్‌’గా మారిందని ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆరోపించారు. దూబే ఎన్‌కౌంటర్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘ఎన్‌కౌంటర్‌ రాజ్‌’ గా మార్చారని, ఆ ఎన్‌కౌంటర్‌ రాజ్యంలో న్యాయం చచ్చిపోయిందని ఆమె ఆరోపించారు. న్యాయం చెప్పాల్సింది కోర్టులు తప్ప పోలీసులు కాదని ఆమె ట్వీట్‌ చేశారు. కాగా దూబే ఎన్‌కౌంటర్‌ను శివసేన నేత సంజయ్‌ రౌత్‌ సమర్థించారు. ‘ఎనిమిది మంది పోలీసులను దూబే హత్యచేశాడు. అటువంటి నేరస్థుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అది మహారాష్ట్రలో అయినా, యూపీలో అయినా. కాబట్టి అతడిని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసుల చర్యను ప్రశ్నించకూడదు. దూబే మృతిపై కన్నీళ్లు కార్చాల్సిన పని లేదు’ అని పీటీఐతో రౌత్‌ అన్నారు.

Updated Date - 2020-07-11T07:03:25+05:30 IST