బీఎస్‌పీ ఆలోచనకు ఇన్నేళ్లు పట్టింది: నోయిడా ఏయిర్‌పోర్ట్‌పై మాయావతి

ABN , First Publish Date - 2021-11-25T23:18:01+05:30 IST

బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు జేవార్ ప్రాంతంలో తాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఏవియేషన్ హబ్, నోయిడా నుంచి బల్లియా వరకు 8 వరుసల గంగా ఎక్స్‌ప్రెస్ వే వంటి ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది..

బీఎస్‌పీ ఆలోచనకు ఇన్నేళ్లు పట్టింది: నోయిడా ఏయిర్‌పోర్ట్‌పై మాయావతి

లఖ్‌నవూ: దేశంలో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా ప్రభుత్వం చెబుతోన్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేశారు. కాగా, బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, ఎయిర్‌పోర్ట్ కూడా నిర్మించాలని అప్పట్లోనే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆ పార్టీ సుప్రెమో మాయావతి అన్నారు. కాకపోతే ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ పనులు జరగకుండా సహాయ నిరాకరణ చేసిందని, అయితే ఎస్పీ, బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చిన చాలా కాలానికి తాజాగా ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన జరిగిందని మాయావతి చెప్పుకొచ్చారు.


గురువారం ఆమె తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు జేవార్ ప్రాంతంలో తాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఏవియేషన్ హబ్, నోయిడా నుంచి బల్లియా వరకు 8 వరుసల గంగా ఎక్స్‌ప్రెస్ వే వంటి ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది. నోయిడా అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనట్టుగానే ఈ ప్రాజెక్టులతో అభివృద్ధితో పాటు ఉపాధికి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని నిర్ణయించాం. కానీ కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సహాయ నిరాకరణ చేసింది. సమాజ్‌వాదీ పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక పథకాల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఈరోజు తొలి అడుగు పడింది. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, నష్టపరిహారం ఇవ్వడం లాంటి విషయాల్లో ఏమాత్రం ఆలస్యం జరగకుండా, ఎవరికీ నష్టం జరగకుండా చూడాలి’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2021-11-25T23:18:01+05:30 IST