వాసన, రుచి తెలియలేదు: మేయర్ బొంతు రామ్మోహన్

ABN , First Publish Date - 2020-08-09T08:44:42+05:30 IST

మానసిక స్థైర్యం.. పౌష్టికాహారం.. ఆవిరి పట్టడం.. ఉదయం, సాయంత్రం వ్యాయామం.. సమయానికి మాత్రలు వేసుకోవడం.. ఇవన్నీ పాటిస్తూ.. ఎప్పటికప్పుడు శరీరంలో వస్తున్న మార్పులను గమనిస్తూ తగిన వైద్య సలహాలతో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే...

వాసన, రుచి తెలియలేదు: మేయర్ బొంతు రామ్మోహన్

  • వారం పాటు అదే పరిస్థితి..కళ్లు మూసుకొని ఆహారం తీసుకున్నా
  • ఆత్మస్థైర్యంతో కరోనాను జయించొచ్చు
  • అజాగ్రత్త.. నిర్లక్ష్యం ఏమాత్రం వద్దు
  • మనం బలహీనపడితే వైరస్‌ బలపడుతుంది
  • జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మానసిక స్థైర్యం.. పౌష్టికాహారం.. ఆవిరి పట్టడం.. ఉదయం, సాయంత్రం వ్యాయామం.. సమయానికి మాత్రలు వేసుకోవడం.. ఇవన్నీ పాటిస్తూ.. ఎప్పటికప్పుడు శరీరంలో వస్తున్న మార్పులను గమనిస్తూ తగిన వైద్య సలహాలతో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కరోనాను జయించవచ్చంటున్నారు గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రథమ పౌరుడు మేయర్‌ బొంతు రామ్మోహన్‌. గత నెల 25న కుటుంబ సభ్యులతోపాటు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ చేయించుకున్న మేయర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో తన ఇంట్లో ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. 15 రోజుల ఐసొలేషన్‌ చికిత్స పూర్తి కావడంతో శనివారం బయటకు వచ్చారు. నేరెడ్‌మెట్‌ ఎక్స్‌ రోడ్‌లో నిర్మిస్తున్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి పనులను పరిశీలించారు. రెండు వారాల ఐసొలేషన్‌ ఎలా గడిచింది? వైర్‌సను ఓడించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏయే చిట్కాలు పాటించారు? తదితర విషయాలను ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.  


ఐసొలేషన్‌ సమయంలో మేయర్‌ దినచర్య..

‘‘రోజూ ఉదయం 5 నుంచి 5.30 గంటల ప్రాంతంలో నిద్ర లేవడం. ఉప్పు నీళ్లతో గార్గ్‌లింగ్‌ చేసి 15 నుంచి 20 నిమిషాలు ట్రేడ్‌ మిల్‌పై నడక, పుషప్స్‌ ఇతరత్రా వ్యాయామాలు చేయడం. అనంతరం 10-15 నిమిషాలు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు. అనంతరం శొంఠి, అల్లం, మిరియాలు, లవంగాలు, తులసి ఆకుతో తయారు చేసిన కషాయం తాగడం. అరగంట తరువాత ఆవిరి పట్టడం.. ఓ గంట తరువాత అల్పాహారం తీసుకోవడం. ఆవిరి పట్టుకునే ముందు, తరువాత కనీసం అరగంట ఏం తినకుండా ఉండటం. అల్పాహారంలోనూ ప్రోటీన్‌లు ఎక్కువ, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం. అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం 1-1.30 మధ్యలో బ్రౌన్‌ రైస్‌ తినడం. సాయంత్రం పండ్లు, ఎగ్‌ వైట్‌, నట్స్‌ వంటివి స్నాక్స్‌గా తీసుకోవడం. సాయంత్రం కూడా గార్గ్‌లింగ్‌తోపాటు శారీరక, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం. రాత్రిపూట చపాతి/పుల్కాలు, అప్పుడప్పుడు బ్రౌన్‌ రైస్‌ లేదా దొడ్డు రవ్వ ఉప్మా తినడం. మొత్తంగా రోజుకు 3 సార్లు ఆవిరి పట్టడం, 2 పర్యాయాలు కషాయం తాగడం. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడంతోపాటు, అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులతో మాట్లాడటం’’ ఈ నియమాలన్నింటినీ నిత్యం పాటించేవాడినని మేయర్‌ తెలిపారు. 


వాసన, రుచి తెలియక..

‘‘పాజిటివ్‌గా నిర్ధారణ అయిన రెండు రోజులకే వాసన పోవడంతోపాటు.. రుచి తెలియలేదు. దీంతో ఆకలి మందగించింది. వారం రోజులపాటు రుచి తెలియక ఏది తినాలనిపించ లేదు. కళ్లు మూసుకొని ఆహారం తీసుకునేవాడిని. వాస్తవంగా వైరస్‌ సోకిన వారు ఈ సమయంలోనే సరైన ఆహారం తీసుకోక బలహీనపడుతారు. ఇదే అదనుగా వైరస్‌ ప్రభావం చూపుతుంది. రోజూ నాలుగైదు సార్లు ఆక్సిజన్‌ లెవల్స్‌తోపాటు, పల్స్‌ ఏ స్థాయిలో ఉందో చెక్‌ చేసుకునే వాడిని. పడుకొని లేచినప్పుడు, ఆందోళనకు గురైనప్పుడు ఆక్సిజన్‌ లెవల్‌, పల్స్‌ స్వల్పంగా తగ్గినట్టు ఉండేది. ఐదు, పది నిమిషాల్లో మళ్లీ సాధారణ స్థితికి వచ్చేది. రోజుకూ మూడున్నర నుంచి 4 లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగేవాడిని. ఎక్కువగా గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. సాధారణంగానే కొందరు నీళ్లు తక్కువగా తాగుతారు. కరోనా వస్తే.. నీళ్లు తీసుకునే శాతం మరింత తగ్గుతుంది. దీంతో రక్తం చిక్కగా మారి హిమోగ్లోబిన్‌ శాతం తగ్గి గడ్డకట్టే ప్రమాదం ఉంది. నిత్యం 4 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి’’ అని మేయర్‌ చెప్పారు.


మానసిక స్థైర్యంతో ఉండాలి

వైరస్‌ సోకిందని ఆందోళన చెందవద్దు. మానసిక స్థైర్యంతో ఉండాలి. వైద్యుల సూచన మేరకు మాత్రలు, ఆహారం తీసుకుంటే చాలు. మన శరీరం ఎలా ఉంది? ఎలా స్పందిస్తుందన్నది మనకు తెలిసిపోతుంది. ఏదైనా తేడా ఉందనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. నాకు తెలిసిన చాలా మంది శ్వాస సమస్య వస్తోందని చెబుతున్నారు. న్యూమోనియా, టీబీ, అస్తమా ఉన్న వాళ్లపై వైరస్‌ ఎక్కువగా ప్రభావం చూపుతోంది. వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఇబ్బంది ఉండదు. ఆలస్యం చేస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఆయా సమస్యలు ఉన్న వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం చేయవద్దు. అని మేయర్‌ ఐసొలేషన్‌ చికిత్స గురించి వివరించారు.


Updated Date - 2020-08-09T08:44:42+05:30 IST