అధిష్ఠానం నిర్ణయమే అంతిమం

ABN , First Publish Date - 2021-05-08T05:47:35+05:30 IST

అధిష్ఠానం నిర్ణయమే అంతిమం

అధిష్ఠానం నిర్ణయమే అంతిమం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

 అధినేత సూచనల మేరకే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఖరారు

 మంత్రులు ఎర్రబెల్లి, గంగుల, ఇంద్రకరణ్‌

 సీల్డ్‌కవర్‌ను ఓపెన్‌ చేసి పేర్లను ప్రకటించిన ‘పెద్ది’


కాళోజీ జంక్షన్‌(హన్మకొండ), మే 7: టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన ప్రకారమే జీడబ్ల్యుఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్లు ఖరారయ్యారని, ఇందులో మరో అభిప్రాయానికి తావులేదని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. హన్మకొండలోని హరిత హోటల్‌లో శుక్రవారం నూతనంగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీని నమ్ముకొని ఎళ్లవేళలా విధేయులుగా ఉంటే భవిష్యత్‌ బాగుంటుందని కార్పొరేటర్లకు సూ చించారు. ప్రస్తుతం కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిలో మేయర్‌, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యేందుకు ఎంతోమంది అర్హులు ఉన్నారని, కానీ అందరూ ఎన్నిక కాలేరన్నారు. అందరూ పార్టీ కుటుంబంలో సమానులేనని, పార్టీ అందరిని సమానంగా చూస్తుందని తెలిపారు. సీఎం ఆదేశాలను అమలు చేసి ఎన్నిక క్రమశిక్షణతో జరిగేలా ప్రవర్తించి మంచిపేరు సంపాదించుకోవాలని సూచించారు.

ఎన్నికకు పార్టీ విప్‌గా నియమితులైన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిలో తొమ్మిదిమంది కరోనా బారిన పడ్డారని, అందులో ఎనిమిది మంది టీఆర్‌ఎ్‌సకు చెందిన కార్పొరేటర్లే ఉన్నారని అన్నారు.  మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు సమర్థులైన అంకితభావం గల కార్పొరేటర్లు చాలామంది ఉన్నప్పటికీ అందరికీ అవకాశం దక్కదని అన్నారు. పదవుల కోసం ఆశపడిన కార్పొరేటర్లు నిరాశచెందవద్దని పార్టీ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉండాలని కోరారు.   ఈ సందర్భంగా ఆయన పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో  సంతకాలు తీసుకున్నారు.  

అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ కార్పొరేటర్లతో సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. పార్టీ అధిష్టానం పంపిన సీల్డ్‌కవర్‌ను ఓపెన్‌ చేసి మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్‌ పేర్లను ప్రకటించారు. మేయర్‌ అభ్యర్థిని సూచించే కార్పొరేటర్‌, బలపర్చే కార్పొరేటర్‌,  అలాగే డిప్యూటీ మేయర్‌ను సూచించే కార్పొరేటర్‌, బలపర్చే కార్పొరేటర్‌ల పేర్లను కూడా ప్రకటించారు. 

అనంతరం కార్పొరేటర్లందరినీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి రెండు బస్సుల్లో ఎన్నిక నిర్వహించే కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణకు తరలించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హరిత కాకతీయ హోటల్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడి నెలకొంది. ఉదయం నిర్వహించిన సమావేశంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, మాజీ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T05:47:35+05:30 IST