Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంబీబీఎస్‌ యూజీ, పీజీ కౌన్సెలింగ్‌ లేట్‌!

  • ఆందోళనలో 20 వేల మంది విద్యార్ధులు.. 
  • ఈడబ్ల్యుఎస్‌ ఆదాయ పరిమితి తేలేదాకా ఇంతే
  • జనవరి 6 తర్వాతే పీజీ కౌన్సెలింగ్‌కు చాన్స్‌
  • ఏడాది నష్టం అంటున్న వైద్య విద్యార్ధులు 
  • పీజీకి ఏడాది, యూజీ తరగతులకు 9 నెలల ఆలస్యం


హైదరాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి) : అగ్రవర్ణ పేదల కోటాకు అర్హతగా రూ.8 లక్షల ఆదాయ పరిమితి విషయం తేలేదాకా ఎంబీబీఎస్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యేట్లు కనిపించడం లేదు. ఈడబ్ల్యూఎస్‌ కోటాకు సంబంధించి ఆదాయ పరిమితిని కేంద్రం తగ్గించే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవేళ పెంచినా, తగ్గినా కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదటికొస్తుంది. ఆదాయ పరిమితి మారితే ఈడబ్ల్యూఎస్‌ కోటా కేటగిరిలోకి వచ్చేవారు మారిపోతారు. దీంతో మొత్తం కౌన్సెలింగ్‌ ప్రక్రియనే నిలిపివేయడంతో రాష్ట్రంలో 20 వేల మంది వైద్య విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో రాష్ట్రంలో పీజీ సీటు పొందే 1500 మంది విద్యార్ధులతో పాటు నేషనల్‌ పూల్‌కు పోటీపడే మరో 6000 మంది ఉన్నారు. అలాగే యూజీకి సంబంధించి రాష్ట్రంలో 5215 సీట్లకు తోడు నేషనల్‌ పూల్‌కు మరో 8 వేల మంది పోటీ పడతారు.


దీంతో యూజీ, పీజీలకు సంబంధించి 20వేలకు పైచిలుకు విద్యార్దులు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నీట్‌ పీజీ అర్హత పరీక్ష ఫలితాలు సెప్టెంబరులో వెలువడినా కౌన్సెలింగ్‌ మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన నీట్‌ పీజీ -2022 అర్హత పరీక్ష వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. వాస్తవానికి ప్రతి ఏటా జనవరిలో నీట్‌ పీజీ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. మే మొదటివారంలో పీజీ వైద్య విద్య తరగతులు ప్రారంభం అవుతుంటాయి. మే చివరి నాటికి మొత్తం కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే కరోనా వైరస్‌ కారణంగా అన్ని రకాల అర్హత పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. నీట్‌ పీజీ పరీక్ష కూడా రెండుసార్లు వాయిదా పడి ఆలస్యంగా నిర్వహించారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వివిధ కారణాల వల్ల కౌన్సెలింగ్‌లో విపరీతమైన జాప్యం నెలకొంది. దీంతో ఇప్పటికే 9 మాసాల అకడమిక్‌ ఇయర్‌ కోల్పోవాల్సివచ్చింది. ఇక వైద్యవిద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్షను ప్రతిఏటా జూన్‌లో నిర్వహిస్తారు.


జూలైలో ఫలితాలు విడుదల అవుతాయి. ఆగస్టు చివరినాటికి మొత్తం కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయి తరగతులు మొదలవుతాయి. అయితే ఈ ఏడాది నీట్‌ యూజీ పరీక్ష సెప్టెంబరు 12న జరిగింది. నవంబరు 1న ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే ఇంతవరకు యూజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా మొదలు కాలేదు. దీంతో ఎంబీబీఎస్‌ విద్యార్ధులు కూడా ఈసారి దాదాపు 8-9 నెలల విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సివస్తోంది. అసలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందా? లేదా? అన్న అనుమానాలను విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. 


కేంద్రం తాత్సారం వల్లే..

మెడికల్‌ పీజీ ఆలిండియా కోటా సీట్లలో ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని గత జూలైలో కేంద్రం నిర్ణయించింది. దీన్ని సవాలు చేస్తూ కొంతమంది విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈడబ్ల్యూఎస్‌ ఆదాయ పరిమితి హేతుబద్ధతను కూడా సుప్రీం ప్రశ్నించింది. ప్రస్తుతం కోర్టుకు కమిటీ నివేదిక ఇచ్చేవరకు 4 వారాలపాటు పీజీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అంటే తిరిగి జనవరి మొదటి వారంలో పీజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయని వైద్య విద్య ఉన్నతాధికారులు చెబుతున్నారు.  


వైద్య సేవలపైనా ప్రభావం

వైద్య విద్య కళాశాల అనుబంధ ఆస్పత్రుల్లో వైద్య సేవలందించడంలో పీజీ విద్యార్ధులదే కీలక పాత్ర ఉంటుంది. వాస్తవానికి మెడికల్‌ కాలేజీలో పీజీ విద్యలో మూడు బ్యాచ్‌ల విద్యార్ధులుండాలి. కానీ పీజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈసారి రెండు బ్యాచ్‌ల విద్యార్ధులే ఉంటారు. దీంతో ఉన్నవారిపై విపరీతమైన పని భారం పడుతోంది. అలాగే వైద్య సేవలపైన కూడా తీవ్ర ప్రభావం ఉంటోందని వైద్య విద్యార్ధులు చెబుతున్నారు.


కేంద్రం సత్వరమే నిర్ణయం తీసుకోవాలి

ఈడబ్ల్యూఎస్‌ ఆదాయ పరిమితి విషయంలో కేంద్రం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. వీలైనంత త్వరగా పీజీ కౌన్సెలింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అకడమిక్‌ ఇయర్‌ లాస్‌ అయింది. ఇంకా ఆలస్యమైతే విద్యార్దులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. మరోవైపు ఉన్న విద్యార్ధులపై తీవ్రమైన పని భారం పడుతోంది. 

 డాక్టర్‌ మహేశ్‌, అధ్యక్షుడు, హెల్త్‌కేర్‌ రీఫార్మ్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ 

Advertisement
Advertisement