పాలన అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2021-10-20T05:19:18+05:30 IST

పాలన అస్తవ్యస్తం

పాలన అస్తవ్యస్తం
మహబూబాబాద్‌లో ఒకే భవనంలో కొనసాగుతున్న ట్రెజరీ కార్యాలయం, వ్యవసాయ, ఉద్యానవనం, జిల్లా వైద్యశాఖ కార్యాలయాలు

జిల్లా ఏర్పడి ఐదేళ్లయినా.. ఇరుకు గదులు.. అరకొర వసతులు 

ఒక్క భవనంలో ఐదు నుంచి ఆరు శాఖల కార్యాలయాలు ఏర్పాటు..

అన్ని శాఖల్లో సిబ్బంది కొరత 

అదనపు పనిభారంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు

13 శాతం హెచ్‌ఆర్‌ఏతో సరిపెట్టుకుంటున్న ఎంప్లాయీస్‌


మహబూబాబాద్‌ టౌన్‌, అక్టోబరు 19 : మహబూబాబాద్‌ జిల్లా ఆవిష్కృతమై సరిగ్గా ఐదేళ్లు పూర్తయింది. ఐనా జిల్లా శాఖల  కార్యాలయాలు మాత్రం మారలేదు. ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా జిల్లా ఏర్పాటైన తొలి నాళ్లలో ఆయా శాఖలకు కేటాయించిన భవనాల్లోనే ఆఫీసులు కొనసాగుతున్నాయే తప్ప నూతన భవన కట్టడాలకు మాత్రం నోచుకోలేదు. నేటికి పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయించకపోవడంతో ఉన్న అరకొర సిబ్బంది.. ఇరుకు గదుల్లోనే విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. పట్టణ శివారు సాలార్‌ తండా సమీపంలో జిల్లా కలెక్టర్‌ కాంప్లెక్స్‌ భవనం నిర్మాణం కొనసాగుతుండగా, బీసీ కాలనీ సమీపంలో ప్రస్తు త పోలీస్‌ సూపరిండెంట్‌ కార్యాలయం పక్కన జిల్లా పోలీ స్‌ కార్యాలయ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్‌ పూర్తయితే అందులోకి అన్ని జిల్లా కార్యాలయాలు చేరనున్నాయి. ప్రజలకు పాలనను చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 11 అక్టోబర్‌ 2016 విజయదశమి పర్వదినం రోజున మానుకోట నూతన జిల్లాగా ఆవిష్కృతమైంది. సరిగ్గా ఈనెల 11తో ఐదు వసంతాలు పూర్తి అయినప్పటికి కార్యాలయాల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది.


జిల్లా ఆఫీ్‌సలకు నూతన భవనాలేవి..?

మహబూబాబాలో జిల్లా కలెక్టరేట్‌ను ఐటీడీఏ వైటీసీ భవనం, ఐటీఐ కళాశాలలో ఎస్పీ కార్యాలయాన్ని కేటాయించారు. ఇక మిగతా శాఖల కార్యాలయాలను ఐటీడీఏ, వ్యవసాయ శాఖ గోదాముల్లో  కేటాయించారు. మరికొన్నింటిని డివిజన్‌ కార్యాలయాల బోర్డులను జిల్లా ఆఫీ్‌సలుగా మార్చారు. అన్ని జిల్లా శాఖల కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో ఉద్యోగులు అదనపు పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి శాఖకు జిల్లా అధికారిని మాత్రమే నియమించారే తప్ప అందులో పనిచేసే సిబ్బందిని మాత్రం పూర్తి స్థాయిలో నియామకం జరపలేదు.  50 నుంచి 60శాతం మంది ఉద్యోగులతో బండిని లాగడంతో ఉద్యోగులు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. పూర్వ ఉమ్మడి జిల్లా కేంద్రంలో పని చేసిన ఉద్యోగులను నూతనంగా ఆవిష్కృతమైన మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌, హన్మకొండ, భూపాలపల్లి జయశంకర్‌, జనగామ జిల్లాలకు కేటాయింపులు చేశారు. గతంలో జిల్లా కేంద్రంలో పని చేసే ఉద్యోగులకు 20 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చే వారు ప్రస్తుతం నూతన జిల్లాగా ఏర్పడిన మానుకోట జిల్లాలో  పనిచేసే ఉద్యోగులకు 12 శాతం నుంచి ఒక్క శాతం పెంచడంతో 13 శాతంతో సరిపెట్టుకుంటున్నారు. 


ఒక్క భవనంలో అనేక కార్యాలయాలు..

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు మాత్రమే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మిగతా కార్యాలయాలకు మాత్రం అన్ని హంగులున్న భవనాలు లేవు.  ఇక ఐటీడీఏ పరిధిలోని ఇంగ్లీ్‌షమీడియం పాఠశాల మూడు అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ట్రెజరరీ, మొదటి అంతస్తులో వ్యవసాయ, ఉద్యానవనశాఖలు, రెండో అంతస్తులో వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. దానికి సమీపంలోని పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌లో ఉన్న మూడు అంతస్థుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో స్త్రీశిశు సంక్షేమ శాఖ, జిల్లా ఉపాధి కార్యాలయం, మిగతా మొదటి అంతస్తులో పరిశ్రమలు, రెండవ అంతస్తులో భూగర్భ జలవనరులు, మత్స్యశాఖ కార్యాలయాలను ఏర్పాటు  చేశారు. అక్కడి సమీపంలోని వ్యవసాయ గోదాముల్లో ఎక్సైజ్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇక విద్యాశాఖ, కో ఆపరేటివ్‌, డిస్ట్రిక్ట్‌ ట్రాన్స్‌ఫోర్టు కార్యాలయాలు గతంలో ఉన్న డివిజన్‌ కార్యాలయాల్లో జిల్లా ఆఫీ్‌సల నిర్వాహణ సాగుతుంది. ఒక్క భవనంలో ఐదు నుంచి ఆరు శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో ఇరుకు గదుల మధ్య ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో సైతం ఉద్యోగులకు కనీస వసతులు (మరుగుదొడ్లు) కూడా లేక పోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. ఇక మరికొన్ని శాఖలకు సర్కార్‌ భవనాలు కూడా లేక పోవడంతో అద్దె భవనంలో కొనసాగుతున్నాయి.


సిబ్బంది కొరతతో ఉద్యోగులపై పని ఒత్తిడి..

మహబూబాబాద్‌ జిల్లా కార్యాలయాలకు సరిపడ సిబ్బందిని కేటాయించకపోవడంతో ఉన్న ఉద్యోగులే పని చేయాల్సి రావడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. జిల్లా ఆవిష్కృతమైన సమయంలో పంపించిన సిబ్బందే తప్ప మళ్లీ కొత్తగా సిబ్బందిని పంపించిన దాఖాలాలు కన్పించడంలేదు. రోజుకు రోజుకు పనులు పెరగడం సిబ్బంది అంతే ఉండడంతో ఉద్యోగులు పని ఒత్తిడితో  మానసిక ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పనిచేసిన ఉద్యోగులకు హౌజ్‌ రెంట్‌ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ) 20 శాతం ఉండేది. ఆర్డర్‌ టూ సర్వ్‌తో మహబూబాబాద్‌ జిల్లాకు వచ్చిన ఉద్యోగులకు  కేవంల 13 శాతం హెచ్‌ఆర్‌ఏ మాత్రమే వస్తుంది.  పని ఒత్తిడికి తోడు హెచ్‌ఆర్‌ఏలో సైతం కోత పడింది. హెచ్‌ఆర్‌ఏలో కోతతో వేతనం కూడ తగ్గడం ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అన్ని హంగులతో కూడి భవనాలు లేకపోవడం, ఉన్న ఆఫీ్‌సల్లో సరియైున వసతులు లేక, మరో పక్క సిబ్బంది కొరతతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. 



Updated Date - 2021-10-20T05:19:18+05:30 IST