ఫైనల్స్‌లో... జిల్లా బాస్‌

ABN , First Publish Date - 2021-10-02T05:57:30+05:30 IST

ఫైనల్స్‌లో... జిల్లా బాస్‌

ఫైనల్స్‌లో... జిల్లా బాస్‌

టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పీఠం ఎంపికపై ఉత్కంఠత

రెడ్డి వర్గం వైపే అధిష్టానం 

ఇరువురి మధ్యే పోటీ.. 

హుజురాబాద్‌ ఎన్నికలతో బ్రేక్‌ ?


మహబూబాబాద్‌,   అక్టోబర్‌ 1 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌ జిల్లా ఏర్పాటు తర్వాత జరిగిన టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో తొలి జిల్లా అధ్యక్ష పీఠం ఎంపిక తీవ్ర ఉత్కంఠత చోటు చేసుకుంటోంది. అధిష్ఠానం ఆదేశాలతో గ్రామాలు, మండలాలు, పట్టణ పార్టీ, అనుబంధ సంఘాల కమిటీల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసిన అయా నియోజకవర్గాల శాసనసభ్యులు పూర్తి జాబితాను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అందజేసివచ్చారు. ఇక జిల్లా కార్యవర్గంతో పాటు అధ్యక్ష పీఠం ఖరారే ఫైనల్స్‌కు చేరింది. వాస్తవానికి ప్రస్తుతం ప్రకటించే పార్టీ జిల్లా కమిటీలు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయాల్సి ఉంటుందని ఆధిష్టానం ఆచీతూచీ వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా గ్రూపులుగా విడిపోయి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రుల మధ్య వారధిగా పనిచేస్తూ అందరిని ఒక్క తాటిపైకి నడిపించలేకపోయినా.. ఎవరిని నొప్పించకుండ పనిచేసే నాయకత్వం అవసరమన్న కోణంలో ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈలోగా హుజురాబాద్‌ ఉప ఎన్నికల నగరా సిద్ధం కావడంతో... అప్పుడిప్పుడే జిల్లా కమిటీలు ప్రకటిస్తారా...? లేక ఉప ఎన్నికలు పూర్తి చేశాక ప్రకటిస్తారా...? అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


ఒక్కతాటిపై నడపగల నేత కోసం...

ప్రతి జిల్లాలో లాగే మహబూబాబాద్‌ జిల్లాలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీలో గుంభనంగా గ్రూపు రాజకీయాలు గుప్పుమంటూనే ఉన్నాయి. అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లకు ఇది తెలియంది కాదు. ఆధిపత్య పోరును చల్లార్చేందుకు అనేక మార్లు అధిష్టానం చేసిన ప్రయత్నాలు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించాయే తప్పా కొత్త, పాత నేతల మధ్య ఇంకా ఆ గ్యాప్‌ కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రూపులకు అతీతంగా అందరిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి పార్టీ బండిని నడిపే చతురత, సామార్థ్యత కలిగిన నేతను జిల్లా అధ్యక్ష పీఠానికి ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తోంది. అందుకే జిల్లా మంత్రులే ఫైనల్‌ అని పైకి చెబుతున్నప్పటికి మహబూబాబాద్‌ జిల్లా భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా స్థానిక శాసనసభ్యుల అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకోక తప్పని పరిస్థితి కన్పిస్తోంది. ఇప్పటికే మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎంపీ మాలోతు కవిత, పూర్తిస్థాయి నియోజకవర్గాలు కలిగిన ఎమ్మెల్యేలు బానోత్‌ శంకర్‌నాయక్‌, డీఎ్‌స.రెడ్యానాయక్‌లు ఎవరికి వారే... తమ అభ్యర్థులను ప్రతిపాదించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మధ్యేమార్గంగా ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ వ్యూహాత్మకంగా ఒక అభ్యర్థిని తానే ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన అయితేనే అటు ఎంపీ కానీ, మరో ఎమ్మెల్యే కానీ అభ్యంతరాలు చెప్పరన్న కోణంలో ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఇక మంత్రి సత్యవతిరాథోడ్‌ ఏకైక నేత పేరే అధిష్టానం వద్ద ప్రతిపాదించినట్టు సమాచారం. 


రెడ్డి సామాజిక వర్గం వైపే మొగ్గు 

మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌ తొలి అధ్యక్ష పీఠం కోసం రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ముఖ్యనేతల పేర్లు తెరపైకి రాగా, దళిత సామాజికవర్గం నుంచి ఇరువురు నేతలు తమకు అవకాశం ఇవ్వాలంటూ మంత్రులతో పాటు అధిష్టానానికి విజ్ఞప్తి చేసి వచ్చారు. అత్యధిక గిరిజన జనాభాతో ఆవిర్భవించిన మహబూబాబాద్‌ జిల్లాలో ఎంపీ, రెండు ఎమ్మెల్యే స్థానాలు గిరిజన సామాజిక వర్గానికి రిజర్వు అయి ఉన్నాయి. దీనికి తోడు మంత్రి పదవితో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానం కూడా ఇదే సామాజిక వర్గానికి దక్కింది. ఈ పరిస్థితుల్లో గిరిజనేతర సామాజికవర్గానికే జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్ష స్థానం ఇవ్వాలన్న డిమాండ్‌ ఉంది. ఈ క్రమంలో దళిత, వెనుకబడిన, ఆగ్రవర్ణాల వారిలో ఎవరికి కేటాయించాలన్న అంశాన్ని అధిష్టానం పరిశీలించినట్లు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి వలసలు ఉండకుండ కాపాడుకునేందుకు ఇదే సామాజికవర్గానికి కేటాయిస్తే బాగుంటుందన్న ఆలోచనలో అధిష్టానం పడినట్టు చెబుతున్నారు. తమకు అవకాశం కల్పించాలని దళిత వర్గీయులు కోరి ఉండడాన్ని కూడా పరిశీలిస్తూ భవిష్యత్తులో మరో అవకాశాన్ని లేదా అనుబంధ సంఘాల్లో ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-10-02T05:57:30+05:30 IST