అందని ఆసరా..

ABN , First Publish Date - 2021-10-03T05:30:00+05:30 IST

అందని ఆసరా..

అందని ఆసరా..
పింఛన్ల కోసం ఆందోళన చేస్తున్న వృద్ధులు (పైల్‌)

రెండేళ్లయినా కొత్త పింఛన్లు కరువు 

ఊరిస్తున్న సర్కారు

తల్లడిల్లుతున్న అభాగ్యులు 

26,241 దరఖాస్తులు పెండింగ్‌


మరిపెడ రూరల్‌ (చిన్నగూడూరు), అక్టోబరు 3: ఆసరాకు గ్రహణం పట్టింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు దరఖాస్తు చేసుకుని రెండేళ్లయినా కొత్త పింఛన్లు లేవు. 2019 నుంచి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్న వారు ప్రతీ రోజు కార్యాలయాల చుట్టూ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. సర్కారు మాత్రం దరఖాస్తుదారులను ఊరిస్తుం ది. భర్తలు పోయి అభాగ్యులుగా మారిన వితంతువులు రోధన అరణ్య రోదనగా మారింది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు కొత్త పింఛన్‌ మంజూరు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గీతన్నలు, చేనేత కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు కళ్లల్లో వత్తులేసుకొని పడిగాపులు పడతున్నారు. ఇప్పటికే గత రెండేళ్ల నుంచి 7,408 దరఖాస్తులు పెండింగ్‌ పడగా కొత్తగా ప్రభుత్వం వృద్ధ్యాప్య పెన్షన్‌ కోసం ప్రభుత్వం 65ఏళ్ల నుంచి 57ఏళ్లకు వయస్సు కుదించింది. అసరా పించన్ల కోసం కొత్తగా ఆగస్టు 31 లోపు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పింది. దాంతో ఉరుకులు, పరుగులు పెడుతూ జిల్లా వ్యాప్తంగా 18,733మంది దరఖాస్తు చేశారు.  నెల గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకూ పలుకు లేదు. 


వృద్ధాప్య పింఛన్‌ అట్లుంచితే.. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 57ఏళ్లు నిండిన వృద్ధులందరికీ వృద్ధాప్య పింఛన్‌  ఇస్తామని చెప్పిన విషయాన్ని ముసలోళ్లు గుర్తు చేస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్‌ దెవుడెరుగు మిగతా పింఛన్లయినా ఏవి అంటూ అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. దివ్యాంగులు, వితంతువులు, ఫైలే రియా, ఎయిడ్స్‌, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కన్నీటితో నిత్యం ఆఫీసుల చుట్టూ  తిరిగి అధికారులను వేడుకుంటున్నారు. 


జిల్లా వ్యాప్తంగా 26,241 దరఖాస్తులు పెండింగ్‌

జిల్లా వ్యాప్తంగా వృద్ధ్యాప్య, ఇతరాత్ర పెన్షన్ల కోసం 26,241 మంది కొత్త పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు చేశారు. బయ్యారం 1,387, చిన్నగూడూరు 1,033, దంతాలపల్లి 1,029, డోర్నకల్‌ 1,573, గంగారం 379, గార్ల 1,185,  గూడూరు 1,896 కేసముద్రం 2,481, కొత్తగూడ 1,360,  కురవి 2,118, మహబూబాబాద్‌ 3,002, మరిపెడ 2,441, నర్సింహులపేట 1,009, నెల్లికుదురు 1,893, పెద్దవంగర 1,285, తొర్రూరు 2,784 మంది చొప్పున దరఖాస్తులు చేశారు. 


చావు దగ్గర్లో ఉన్న.. : ఎర్రంశెట్టి భారతమ్మ, చిన్నగూడూరు 

చావుకు దగ్గర్లో ఉన్న. నా భర్త చనిపోయి మూడేళ్లకు వస్తుంది. ఆయన పింఛనైనా నాకు ఇవ్వట్లేదు. ఎంపీడీవో ఆఫీసు చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. నాగోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అధికారులు జర పట్టించుకోని పింఛన్‌ ఇప్పించాలి. 


60ల పడ్డ పింఛన్‌ రావట్లే.. : ఎడ్ల చిన్న వీరయ్య, వృద్ధుడు ఉగ్గంపల్లి 

సీఎం కేసీఆర్‌ 57ఏళ్లు నిండితే పింఛన్‌ ఇస్తామని పోయిన ఎన్నికలప్పుడు చెప్పిండు. ఇప్పుడు 60ల పడ్డ ఇంకా పింఛన్‌ లేదు. దరఖాస్తు చేసి రెండేళ్లు కావస్తుంది. రోజు మా ఊళ్ల ఉన్న లీడర్లు, సర్పంచ్‌, కార్యదర్శిని అడుగుతున్నాం.  రేపు వస్తది. మాపు వస్తదని చెబుతున్నారు. మళ్లీ మొదటికొచ్చింది.  మీ సేవకు వెళ్లి దరఖాస్తు పెట్టాలని అధికారులు చల్లటి కబురేసిండ్రు. అక్కడి ఇచ్చి నెలకావొస్తాంది.


భర్త పోయి రెండున్నరేళ్లు : చిత్తారి లింగమ్మ, వితంతు మహిళ చిన్నగూడూరు 

భర్త పోయి రెండున్నరేళ్లు అవుతుంది. సర్పంచ్‌ ఎన్నికలన్న ముందు వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు పెట్టుకున్న. సర్పంచ్‌ ఎన్నికలయ్యాక వస్తందని ఓటు వేయించుకున్నారు. మళ్లీ సర్పంచ్‌ గెలిచాక దరఖాస్తు చేశా..రెండేళ్లు అవుతుంది. ఇంతవరకు పింఛన్‌ ఇవ్వట్లేదు. నా బిడ్డ ఒంటరి మహిళ ఆమెకు కూడా రావట్లేదు.


ప్రభుత్వ అనుమతికి పంపాం : సన్యాసయ్య, డీఆర్‌డీవో పీడీ

వివిధ రకాల పింఛన్ల కోసం ఇప్పటి కే జిల్లా వ్యాప్తంగా 26,241 దరఖాస్తు లు వచ్చాయి. ప్రభుత్వ అనుమతి కోసం పంపాం. దరఖాస్తు చేసుకున్నవారికి తప్పక పెన్షన్లు అందుతాయి. జిల్లా వ్యాప్తంగా 95,548మందికి రూ.20 కోట్ల 73లక్షల 42వేలను ఇప్పటికే అందిస్తున్నాం. 

Updated Date - 2021-10-03T05:30:00+05:30 IST