సంక్రాతి సంబురాలు

ABN , First Publish Date - 2022-01-15T05:21:27+05:30 IST

సంక్రాతి సంబురాలు

సంక్రాతి సంబురాలు
కేసముద్రం మండలం అమీనాపురంలో గంగిరెద్దుల సందడి, దంతాలపల్లిలో హరిదాసు వేషధారణలో పులుగుజ్జ లక్ష్మయ్య

రంగవల్లులతో కళకళలాడిన లోగిల్లు

అలరించిన గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసు వేషధారణ

ఆలయాలకు పోటెత్తిన భక్తజనం

వైభవంగా భోగి వేడుకలు..

నేడు సంక్రాంతి, రేపు కనుమ పర్వదినం


మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, జనవరి 14 : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబంగా తెలుగు ఆడపడుచులు ఇంటి ముంగిట వేసిన అందమైన ముగ్గులు, బోగి మంటలు, గంగిరెద్దుల కోలాహలంతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం బోగి పండుగ సందడి నెలకొంది. తెల్లవారకముందే భోగీ మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం మొదలైంది. మహిళలు అత్యంత ఆనందభరితంగా, ఆహ్లాదకరంగా ఇంటి వాకిళ్ల ముందు రంగవల్లులను విభిన్న రకాల రంగులతో ఉదయం 4 గంటల నుంచి  ముగ్గులు వేసి తలంటు స్నానాలు ఆచరించి నూతన దుస్తులు ధరించారు.  బోగి పర్వదినాన ప్రతి ఇంటి ముంగిట సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడేలా మహిళలు అందమైన రంగవల్లులను వేసి వాటిలో గొబ్బెమ్మలు, రేగుపండ్లు, పిండిపువ్వు, గరక, నవదాన్యాలు పెట్టి ఆనందోత్సవాల నడుమ బోగి వేడుకలు నిర్వహించారు.


బొమ్మల కొలువు..

భోగీరోజు 12 ఏళ్లలోపు పిల్లలకు భోగీ పండ్లను పోస్తారు. భోగి పర్వదినాన తన నివాసంలో చిన్నారులకు భోగి పండ్లను పోసి, బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. మానుకోటలో ఐదు దశాబ్ధాలుగా  కలివెండి రాంమోహన్‌ - సంధ్యారాణి దంపతులు బొమ్మల కొలువు నిర్వహిస్తున్నారు.


అలరించిన గంగిరెద్దులు, బసవన్నల విన్యాసాలు..

తెలంగాణ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాతి పండుగ తొలిరోజు భోగి పర్వదినాన గంగిరెద్దులు, డూ..డూ...బసవన్నల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు, యువకులు వివిధ రకాల పతంగులను ఎగరవేస్తూ ఆనందోత్సవాల నడుమ పర్వదిన వేడుకలు జరుపుకున్నారు. దంతాపల్లికి చెందిన పులుగుజ్జ లక్ష్మయ్య వేసిన హరిదాసు వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది.


సంక్రాంతి రోజున ఇలా..

సంక్రాంతి, భోగీ రోజు కొన్ని ప్రాంతాల్లో ముత్తయిదువులు కొత్తగాజులు వేసుకుంటారు. గాజులు తొడిగిన గాజుల వ్యాపారికి వారిపంటపొలాల్లో పండిన కొత్త ధాన్యాన్ని ఆనవాయితీగా ఇస్తారు. ఇంటికి వచ్చిన కొత్త అల్లుల్లు, కూతుర్లతో సరదాగా ఆనందంగా గడుపుతారు. ఆదివారం కనుమ పర్వదినం జరుపుకుంటారు.  


జిల్లా వ్యాప్తంగా..

దంతాలపల్లిలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ ఉమా, జడ్పీ వైస్‌చైర్మన్‌ నూకల వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు రవీందర్‌, నాగయ్య, సంద్య, సుశ్మిత పాల్గొన్నారు. చిన్నగూడూరులో ఎమ్మెల్యే డీఎ్‌స.రెడ్యానాయక్‌కు మైనారిటీ నాయకులు లతీఫ్‌, హుస్సేన్‌, మద్‌సూద్‌ బోగీ శుభాకాంక్షలు తెలిపారు. తొర్రూరులో బీరప్పనగర్‌, టీచర్స్‌ కాలనీ, రాజీవ్‌నగర్‌, సాయినగర్‌లతో పాటు వివిధ కాలనీలో తెల్లవారుజాము నుంచి బోగీ మంటలువేసుకుని పండుగను ఘనంగా నిర్వహించారు. పెద్దవంగర చిట్యాల గ్రామంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, మండల కేంద్రంలో జడ్పీటీసీ శ్రీరాంజ్యోతిర్మయిసుధీర్‌, పాలకుర్తి దేవస్థానం చైర్మన్‌ రాంచంద్రయ్యశర్మ పాల్గొన్నారు. డోర్నకల్‌ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మహిళలు ఇంటిముందు రంగవల్లులతో తీర్చిదిద్దారు. చిన్నారులు పతంగులు ఎగురవేశారు. గంగిరెద్దుల విన్యాసాలు పలువురిని ఆకర్షించాయి. నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి బహుమతులు అందజేశారు. బయ్యారంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓ మహిళ ఇంటి ఎదుట ముగ్గు వేసింది. ఆ ముగ్గును పలువురు ఆసక్తిగా తిలకించారు. గూడూరులో మహిళలు వారివారి ఇండ్లముందు రంగురంగుల ముగ్గులు వేసి.. ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కురవి మండలం నలెల్లలో బోగీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హైకోర్టు అడ్వకేట్‌ రచనరెడ్డి, రాహుల్‌రెడ్డి, నల్లెల్ల సర్పంచ్‌ ఎర్రంరెడ్డి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని వంద కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు. 55 మహిళ సంఘాల 600 మంది సభ్యులకు స్వీట్లు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్లను సన్మానించారు. కార్యక్రమంలో మహబూబాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు గుగులోతు రవికుమార్‌, దొడ్డ గోవర్థన్‌రెడ్డి, గార్లపాటి వెంకట్‌రెడ్డి, బాదావత్‌ రామునాయక్‌, పల్లా రాంచంద్రారెడ్డి, బండి దీపక్‌ పాల్గొన్నారు. 






Updated Date - 2022-01-15T05:21:27+05:30 IST