ఎంసీజీలో ఆ జోరు చూపేనా?

ABN , First Publish Date - 2020-12-23T06:44:15+05:30 IST

తొలి టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత జట్టు తమ చరిత్రలోనే అత్యంత చెత్త ఓటమిని మూటగట్టుకుంది. ఈ అవమానాన్ని దిగమింగుతూ ఈనెల 26 నుంచి జరిగే బాక్సింగ్‌ డే టెస్టు కోసం తమ సన్నాహకాలను ప్రారంభించింది

ఎంసీజీలో ఆ జోరు చూపేనా?

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

తొలి టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత జట్టు తమ చరిత్రలోనే అత్యంత చెత్త ఓటమిని మూటగట్టుకుంది. ఈ అవమానాన్ని దిగమింగుతూ ఈనెల 26 నుంచి జరిగే బాక్సింగ్‌ డే టెస్టు కోసం తమ సన్నాహకాలను ప్రారంభించింది. నాలుగు టెస్టుల సిరీ్‌సలో ఇప్పటికే ఆసీస్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే రెండో టెస్టుకు వేదిక అయిన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానం (ఎంసీజీ)లో భారత రికార్డు అంత గొప్పగా ఏమీ లేకపోవడం ఆందోళనపరిచే విషయం. ఇప్పటివరకు ఎంసీజీలో 13 టెస్టులాడిన భారత జట్టు మూడు మాత్రమే గెలిచింది. ఎనిమిది టెస్టుల్లో ఓటమిపాలై, రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది.


చివరి మ్యాచ్‌లో అదుర్స్‌..

భారత్‌కు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయమేమిటంటే.. ఈ మైదానంలో ఆడిన చివరి టెస్టులో కోహ్లీ సేన ఆస్ట్రేలియాపై 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడం.. 2018, డిసెంబరులో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచి సిరీస్‌ ఆధిక్యాన్ని 2-1కి పెంచుకుంది. ఆ మ్యాచ్‌లో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా చెలరేగి 33 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌ గడ్డపై ఓ భారత బౌలర్‌ సాధించిన ఉత్తమ గణాంకాలివి. అలాగే ఆసీ్‌సపై చరిత్రాత్మక సిరీస్‌ విజయానికి ఈ గెలుపే కీలకంగా నిలిచింది. ఇక 2014లో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు (ఎంసీజీలో టీమిండియాకు ఇదే అత్యధికం) చేసి డ్రాగా ముగించింది. మరోవైపు ఆసీస్‌లో భారత జట్టుకు తొలి టెస్టు విజయం కూడా 1977లో ఈ మైదానంలోనే దక్కింది. 


సమస్యలతోనే..

ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి ముందే తుది జట్టు ఎంపికపై స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉంది. కోహ్లీ, షమి అందుబాటులో లేకపోవడం, పలువురు ఆటగాళ్లు ఫామ్‌ కోల్పోవడం జట్టుకు ప్రతికూలాంశాలు. దీనికి తోడు రహానె, పుజార, సాహా, పృథ్వీ షా, విహారి ఇలా కీలక ఆటగాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఏదేమైనా బాక్సింగ్‌ డే టెస్టుకు సరికొత్తగా భారత్‌ బరిలోకి దిగాల్సి ఉంది. స్థాయికి మించిన ఆటతీరుతో చెలరేగి.. ఎంసీజీలో 2018 టెస్టు ఫలితాన్ని రాబడితేనే ఈ సిరీస్‌లో సజీవంగా ఉండగలుగుతుంది.  

Updated Date - 2020-12-23T06:44:15+05:30 IST