గ్రేటర్‌ ఆర్టీసీపై ఎండీ సజ్జనార్‌ మార్క్‌..

ABN , First Publish Date - 2021-11-20T18:41:21+05:30 IST

‘‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి..సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి..

గ్రేటర్‌ ఆర్టీసీపై ఎండీ సజ్జనార్‌ మార్క్‌..

  • ఆర్టీసీ రిపేర్..
  • బస్సుల్లో ప్రయాణిస్తున్న అధికారులు
  • కూడళ్లలో విస్తృత ప్రచారం
  • ప్రయాణికుల సంఖ్య పెంచుకునే యత్నం

హైదరాబాద్‌ సిటీ : ‘‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి..సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి.. చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆగుతుంది... బస్సుల్లో ఎక్కండి.. ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోండి..!!’’ అంటూ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, ముఖ్య కూడళ్లలో ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అమీర్‌పేట, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌తో పాటు రద్దీ ప్రాంతాల్లో సూపర్‌వైజర్లను నియమించి బస్సులు నిండుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక రూట్‌లో బస్సుల్లో ఒకేసారి క్యూ కట్టకుండా సమయపాలన ప్రకారం ముందుకు పంపిస్తూ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బస్సుల్లో ప్రయాణికులను పెంచుకునే అవకాశాలపై దృష్టిసారించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశాలతో గ్రేటర్‌ ఉన్నతాధికారులు ప్రయాణికులను ఆకట్టుకోవడంపై దృష్టిసారించారు.


గ్రేటర్‌లో ఆర్టీసీ 2,800 బస్సులను నడుపుతుండగా రోజూ 25 లక్షలమంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ సంఖ్యను 30 లక్షలకు పెంచుకునే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్‌లో విడతల వారీగా వెయ్యి ఎలక్ర్టికల్‌ నాన్‌ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలను ఆర్టీసీ పరిశీలిస్తోంది. ఎలక్ర్టిసిటీ బస్సులతో డీజిల్‌ భారం తగ్గడంతో పాటు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంటుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీలో విడతల వారీగా ఎలక్ర్టిక్‌ నాన్‌ ఏసీ బస్సులను పెద్దసంఖ్యలో తీసుకొస్తే నష్టాలు తగ్గి లాభాలు వచ్చే అవకాశాలుంటాయని ఆర్టీసీ సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు. 


ప్రయాణికుల్లా.. 

రద్దీ రూట్లలో ప్రయాణికుల సమస్యలు నేరుగా గుర్తించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు సాధారణ ప్రయాణికుల్లా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులతో నేరుగా మాట్లాడుతూ వారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్‌ట్రిప్పులు పెంచడంతో పాటు రద్దీలేని రూట్లలో ట్రిప్పులు తగ్గిస్తున్నారు. ప్రయాణికులు పెరిగే రూట్లలో డిపోలవారీగా డిపో మేనేజర్లు, సిబ్బంది రూట్‌ సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు పెరిగే అవకాశాలున్న రూట్లలో అదనపు సర్వీసులు నడిపేవిధంగా గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


ప్రకటనలు.. ప్రచారం..

ప్రత్యేక సెలవు రోజుల్లో ప్రయాణికులను ఆకర్షించేలా టీఎ్‌సఆర్టీసీ ప్రత్యేక ప్రకటనలు గుప్పిస్తోంది. పరీక్షల రోజుల్లో హాల్‌ టికెట్లు చూపిస్తే విద్యార్థులకు ఉచిత ప్రయాణం, బాలల దినోత్సవం సందర్భంగా 15 ఏళ్లలోపు చిన్నారులకు బస్సుల్లో రోజంతా ఉచిత ప్రయాణం వంటి ఆఫర్లు ప్రకటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించే చర్యలు మొదలు పెట్టింది. గతంలో దసరా నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఏపీ, తెలంగాణ జిల్లాలకు నడిపే స్పెషల్‌ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసేవారు. ఈ సంవత్సరం  అదనపు చార్జీలు లేకుండా 4 వేలకు పైగా ప్రత్యేక సర్వీసులను జిల్లాలకు నడిపి ప్రయాణికులను ఆకర్షించింది. ప్రజలను ఆర్టీసీ ప్రయాణాలకు అలవాటు పడేలా అవగాహన కల్పించేలా ఆర్టీసీ అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. 


గ్రేటర్‌ ఆర్టీసీపై ఎండీ సజ్జనార్‌ మార్క్‌

టీఎస్‌ ఆర్టీసీకి వస్తున్న నష్టాల్లో 50 శాతం గ్రేటర్‌ వాటా ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో నష్టాలు తగ్గించడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికులను భారీగా పెంచడంతో పాటు కమర్షియల్‌ ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టిసారిస్తున్నారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లో షాపులను ఆధునికీకరిస్తూ కమర్షియల్‌ ఆదాయం పెంచడంపై అధికారులకు ఎండీ పలు సూచనలు చేశారు. సికింద్రాబాద్‌తో పాటు పలు రైల్వే స్టేషన్ల నుంచి ఉదయం 4 గంటల నుంచి సిటీ బస్సులు నడిపేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏసీ బస్సులతో పాటు మెట్రో ఎక్స్‌ బస్సుల్లో ప్రయాణికులకు అందుతున్న సేవలను పరిశీలించేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ బస్సుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ప్రయాణికుల సమస్యలు పరిశీలించేందుకు, సూచనలు, సలహాలు స్వీకరించేందుకు కాల్‌ సెంటర్‌ వ్యవస్థను గ్రేటర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

Updated Date - 2021-11-20T18:41:21+05:30 IST