ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-03-06T06:39:27+05:30 IST

ప్రభుత్వ భూముల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక తహసీల్దార్లను ఆదేశించారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ కె శశాంక

-  జిల్లా కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 5: ప్రభుత్వ భూముల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రభుత్వ భూముల రక్షణ, పెండింగ్‌ మ్యుటేషన్‌ల పరిష్కారం, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఫర్నిచర్‌, టాయిలెట్స్‌, నీటి సౌకర్యం, పార్కు నిర్మాణం, నాలా, ధరణి తదితర అంశాలపై తహసీల్దార్లతో మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను గుర్తించి వాటి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌ మ్యుటేషన్లను మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ లాల్‌, ఎస్‌ఈ వెంకట మాధవరావు, జిల్లా సర్వే ల్యాండ్‌ అధికారి అశోక్‌, ఆర్డీవోలు పి బెన్‌షలోమ్‌, ఆనంద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఉపాధిహామీ పనులకు టెక్నికల్‌ అసిస్టెంట్లను నియమించాలి


కరీంనగర్‌ టౌన్‌ : వేసవిలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ పనులు గుర్తించి కూలీలకు పనులు కల్పించుటకు టెక్నికల్‌ అసిస్టెంట్లను నియమించాలని జిల్లా కలెక్టర్‌ కె శాశంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్రస్థాయి అధికారుల బృందంతో ఉపాధిహామీ పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో టెక్నికల్‌ అసిస్టెంట్ల పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేస్తే జిల్లాలో వేగవంతంగా ఉపాధిహామీ పనులు జరుగుతాయని అన్నారు. గ్రామాల్లో ఉపాధిహామీ పనులను గ్రామ పంచాయతీ కార్యదర్శులతోపాటు సర్పంచులను కూడా భాగస్వాములను చేస్తే పనులు వేగవంతంగా పూర్తవుతాయని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి బృందం ప్రతినిధులు మాట్లాడుతూ కరీంనగర్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్ల కొరత ఉందని, ఉన్న సిబ్బందిపై పనిభారం అధికంగా ఉందన్నారు. వచ్చే మూడు నెలలు ఉపాధిహామీ పథకంలో ఎక్కువ పనులు గుర్తించి కూలీలందరికీ పనులు కల్పించాలని కలెక్టర్‌ను కోరా రు. సమావేశంలో ఉపాధిహామీ పథకం రాష్ట్రస్థాయి బృందం సభ్యులు, స్పెషల్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ వి మురళీధర్‌, డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ వి నరేష్‌కుమార్‌, చీఫ్‌ కన్జర్వేటర్‌ సైదులు, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-06T06:39:27+05:30 IST