కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-17T06:31:33+05:30 IST

కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలి
మాట్లాడుతున్న జీవన్‌ రెడ్డి

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ధర్మపురి, జనవరి 16: కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణవీధిలో కోతులు బెదరించడం వల్ల భవనంపై నుంచి కాలు జారి కింద పడి మృతి చెందిన నారంభట్ల రాజేశ్వరీ కుటుంబ సభ్యులను డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేశ్వరీ మృతి వివరాలు గురించి అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడారు. కోతులు బెదరింపు వల్ల ప్రాణాలు కోల్పోయిన రాజేశ్వరీ కుటుంబానికి ప్రభుత్వం రూ. 20 లక్షలు ఆర్థికసాయం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోతులు జనవాసాల మధ్య తిరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురువుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోతుల బెడద వల్ల ప్రజలకు, వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయిందన్నారు. కోతుల నివారణ కోసం 2022-23 అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బడ్జెట్‌ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కోతులకు ప్లానింగ్‌ ఆపరేషన్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌  మండల అధ్యక్షుడు సంగనభట్ల దినేష్‌, ఉపాధ్యక్షుడు వేముల రాజేష్‌, జిల్లా కార్యదర్శి కస్తూరి శ్రీనివాస్‌, చిలుముల లక్ష్మణ్‌, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడే సింహరాజు ప్రసాద్‌, మాజీ ఎంపీటీసీ సీపతి సత్యనారాయణ, ఆశెట్టి శ్రీనివాస్‌, అయ్యోరు మహేష్‌, రాందేని మొగిలి, గరిగె రమేష్‌, స్తంభంకాడి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-01-17T06:31:33+05:30 IST