Advertisement
Advertisement
Abn logo
Advertisement

భూ కబ్జా వాస్తవమే

  • 70.30 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది
  • జమున హేచరీస్‌ నిబంధనలను పాటించలేదు
  • చట్ట విరుద్ధంగా పౌలీ్ట్ర ఫాం, షెడ్లు, రోడ్ల నిర్మాణం
  • అచ్చంపేట, హకీంపేట భూములపై మెదక్‌ కలెక్టర్‌
  • సర్వే వివరాలను ప్రభుత్వానికి అందించామని వెల్లడి

మెదక్‌/మాసాయిపేట, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లోని అసైన్డ్‌ భూములు ఆక్రమణకు గురైన మాట నిజమేనని మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ వెల్లడించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సంబంధించిన మెస్సర్స్‌ జమున హేచరీస్‌ యాజమాన్యం ఈ ఆక్రమణలకు పాల్పడిందని వివరించారు. అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో 56 మందికి చెందిన 70.30 ఎకరాల అసైన్డ్‌ భూములు కబ్జాకు గురైనట్లు తమ సర్వేలో తేలిందన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. అచ్చంపేటలోని సర్వే నంబర్లు 77 నుంచి 81, 130 అలాగే హకీంపేటలోని 97, 111 సర్వే నంబర్లలో నిర్వహించిన సర్వేలో 70.30 ఎకరాల అసైన్డ్‌ భూములు ఆక్రమణకు గురైనట్లు సర్వేలో తేలిందని స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడి భూములను కబ్జా చేశారని బాధితులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. జమున హేచరీస్‌ యజమానులు జమున, నితిన్‌ రెడ్డి నాలా కన్వర్షన్‌ లేకుండానే అసైన్డ్‌ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారని కలెక్టర్‌ వివరించారు.


అనుమతులు లేకుండా పౌలీ్ట్ర ఫాంలు, భారీ షెడ్లు, రోడ్లు నిర్మించారని స్పష్టం చేశారు. హేచరీస్‌ అక్రమ నిర్మాణాలపై వెటర్నరీ శాఖ ద్వారా నివేదిక తెప్పించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని కలెక్టర్‌ తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేయడంతో పాటు చెట్లను నరికివేశారని వెల్లడించారు. పౌలీ్ట్ర నుంచి కాలుష్యం వస్తున్నట్లు గుర్తించామన్నారు. అచ్చంపేట, హకీంపేటలో అసైన్డ్‌ భూముల ఆక్రమణలపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి నివేదిక పంపించామని కలెక్టర్‌ వివరించారు. కాగా, అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లోని వివాదాస్పద భూములపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడంతో ఆ ఊళ్లలో భూములు కోల్పోయిన వారిలో ఆశలు మొదలయ్యాయి. తమ స్థలాలను ప్రభుత్వం తిరిగి ఇస్తుందని స్థానికులు ఆశతో ఉన్నారు.

Advertisement
Advertisement