Abn logo
Jan 26 2021 @ 02:19AM

పుల్వామా వీరుడికి రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం

ఉగ్రవాది కారును అడ్డుకునేందుకు యత్నించి అసువులు బాసిన మోహన్‌లాల్‌

సీఆర్పీఎఫ్‌ ఏఎస్సై ఓరన్‌కు కూడా పీపీఎంజీ

205 మందికి రాష్ట్రపతి శౌర్య పతకాలు


న్యూఢిల్లీ, జనవరి 25: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పోలీసు శౌర్య, సేవా పతకాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం ఆమోదించారు. విశిష్ట సేవలందించిన పోలీసు, అగ్నిమాపకం, జైళ్ల శాఖ, హోంగార్డులకు ఈ అవార్డులను ప్రకటించగా.. అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకానికి(పీపీఎంజీ) ఇద్దరు సీఆర్పీఎఫ్‌ ఏఎస్సైలను(మరణానంతరం) ఎంపిక చేశారు. వీరిలో ఒకరు ఏఎస్సై మోహన్‌లాల్‌ కాగా.. మరొకరు బానువా ఒరాన్‌. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జైషే మహమ్మద్‌ ఉగ్రవాది ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ జరిపిన ఆత్మాహుతి కారు దాడిని అడ్డుకునేందుకు యత్నించి మోహన్‌లాల్‌ అమరుడయ్యారు.  ఈ ఘటనలో బస్సులో ఉన్న 39 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఇక బానువా ఓరాన్‌ కూడా విద్రోహులను మట్టుబెట్టే క్రమంలో వీరమరణం పొందారు. వీరిద్దరికీ అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకాన్ని ప్రకటించారు. పీపీఎంజీ తర్వాత రెండో అత్యున్నతమైన రాష్ట్రపతి శౌర్య పతకాల(పీఎంజీ)కు 205 మంది, ఉత్తమ సేవా పతకాలకు 89 మంది, రాష్ట్రపతి పోలీసు పతకాలకు 650 మందిని ఎంపిక చేశారు. సీబీఐలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న సీనియర్‌ ఎస్పీ మహేశ్‌ భరద్వాజ్‌కు రాష్ట్రపతి పోలీసు పతకాన్ని ప్రకటించారు. అగ్నిమాపక శాఖలో పనిచేస్తూ విశేష సేవలందించిన 73 మందికి కూడా రాష్ట్రపతి అవార్డులను ప్రకటించారు. వీటిలో.. అత్యున్నతమైన రాష్ట్రపతి అగ్నిమాపక శౌర్య సేవా పతకానికి ఎనిమిది మంది, అగ్నిమాపక శౌర్య పతకానికి ఇద్దరు ఎంపికయ్యారు. 13 మందికి అగ్నిమాపక ఉత్తమ సేవాపతకాలు, 50 మందికి అగ్నిమాపక సేవాపతకాలను ప్రకటించారు. 54 మంది హోంగార్డులు సివిల్‌ డిఫెన్స్‌ మెడల్స్‌కు ఎంపికయ్యారు.


దేశవ్యాప్తంగా జైళ్లలో పనిచేసే 52 మందికు రాష్ట్రపతి అవార్డులు వరించాయి. వీరిలో రాజస్థాన్‌కు చెందిన వార్డర్‌ సుఖ్‌దాస్‌ స్వామికి మరణం తర్వాత రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రకటించారు. 12 మంది జైళ్ల శాఖ సిబ్బంది ఉత్తమ సేవా పతకాలకు, మరో 39 మంది సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఇక.. సోమవారం పునరుద్ధరించిన శౌర్య పతకాల వెబ్‌సైట్ ‌( www.gallantryawards.gov.in ) ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. దేశ భద్రతకు నిరంతరం కృషిచేస్తున్న జవాన్లు, పోలీసులు, పారామిలటరీ బలగాలు లేనిదే.. 2025 కల్లా భారత్‌ 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించలేదని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement