పైసల్లేవ్‌.. పనులెట్లా?!

ABN , First Publish Date - 2021-10-08T05:54:18+05:30 IST

పైసల్లేవ్‌.. పనులెట్లా?!

పైసల్లేవ్‌.. పనులెట్లా?!

సమీపిస్తున్న మేడారం మహాజాతర

ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహణ

మిగిలి ఉన్నవి మరో నాలుగు నెలలే..

ఇప్పటికే రూ.111.91 కోట్లతో  ప్రభుత్వానికి ప్రతిపాదనలు

కేటాయింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం!


 (ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. ఈ వేడుకకు సమయం సమీపిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహాజాతర జరగనుంది. మరో నాలుగు నెలల మాత్రమే మిగిలి ఉండటంతో ములుగు జిల్లా అధికార యంత్రాంగం వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.111.91 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదలపై ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. మరో వైపు కరోనా ఉధృతి తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ  థర్డ్‌వేవ్‌పై భయాందోళన ఇంకా తొలగిపోలేదు. జనవరి-ఏప్రిల్‌లో కరోనా పెరుగొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో  కోటి మందికి పైగా భక్తులు పాల్గొనే ఈ మహా జాతర నిర్వహణపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది.  

మరో నాలుగు నెలల్లో మహాజాతర

నాలుగు రోజులపాటు జరిగే మేడారం మహాజాతరకు తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది  ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించేందుకు గిరిజన పూ జారులు నిర్ణయించారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘశు ద్ధ పౌర్ణమి నాడు జరిగే ఈ  జాతరకు తెలంగాణతో పా టు ఏపీ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి సుమారు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా. మరో నాలుగు నెలల్లో మహాజాతర జరగనుండటంతో ప్రభుత్వం ఏర్పాట్లపై ఇంకా దృష్టి సారించటం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ జాతర జరిగే సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో అనే సందిగ్ధంలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్లు సమాచారం.

 ప్రతిపాదనలు ఇలా...

 మేడారం మహాజాతర నిర్వహణకు అధికారులు రూ.111.91 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీటిలో ప్రధా నంగా దేవాదాయ శాఖకు రూ. 17.14 కోట్లు, ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.13 కోట్లు, ఆర్‌డబ్లూఎస్‌ శాఖకు రూ.20 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.10.82 కోట్లు, పోలీసు శాఖకు రూ.13.44 కోట్లు, ఎన్‌పీడీసీఎల్‌ శాఖకు రూ.9.97 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ. 9.53 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.8 కోట్లు, రోడ్డు రవాణా శాఖకు రూ.4.60 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.1.74 కోట్లు, జిల్లా పంచాయతీ శాఖకు రూ.1.55 కోట్లు, డీటీడీవో (ఐటీడీఏ) శాఖకు రూ.71 లక్షలు, ఐసీడీఎ్‌సకు రూ.39 లక్షలు, పర్యాటక శాఖకు రూ.2 లక్షలు, పశు వైద్యానికి రూ.15 లక్షలు, ఎక్సైజ్‌ శాఖకు రూ.20 లక్షలు, అటవీ శాఖకు రూ.12లక్షలు, అగ్నిమాపక శాఖకు రూ.35 లక్షలు, మత్స్య శాఖకు రూ.22 లక్షలు, పౌరసంబంధాల శాఖకు రూ.28 లక్షలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే.. ప్రభుత్వం ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించాలో నిర్ణయం తీసుకొనే ముందు మరోసారి ఉన్నతాధికారులతో సమీక్షించనుంది. ఆ తర్వాతే జాతర నిర్వహణకు కావాల్సిన నిధులను విడుదల చేయనుంది. అయితే.. సమయం తక్కువగా ఉండటంతో నిధులు విడుదల ఆలస్యమైతే ఆగమాగంగా టెండర్ల నిర్వహణ, పనుల్లో నాణ్యత లోపం లాంటివి చోటుచేసుకుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండుమూడు రోజుల్లో జాతర నిధులు విడుదల చేసి, జనవరి చివర వారంలోగా పనులన్నీ పూర్తయ్యేలా  చర్యలు  చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. 

నిధుల కోసం ఎదురుచూపు

మేడారం మహాజాతరను రాష్ట్ర పండుగగా  1996లో  అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి  జాతరకూ ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిధుల కేటాయింపులు పెరిగాయి. 2016లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మహాజాతర నిర్వహించారు. ఆ ఏడాది రూ.132 కోట్లు ప్రభుత్వం కేటాయించి ఆర్భాటంగా ఏర్పాట్లు చేసింది. 2018లో రూ.80.55 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. 2020లో జరిగిన మహాజాతరకు మరిన్ని నిధులకు కోత పెట్టి కేవలం రూ.75 కోట్లే  విడుదల చేసింది. అయినప్పటికీ అరకొర సౌకర్యాలతోనే జాతర నిర్వహించారు.  ప్రతి మహాజాతరకూ కేటాయించే నిధులతో దాదాపు అన్ని తాత్కాలిక పనులే జరుగుతున్నాయి. మరగుదొడ్లు,  స్నాన ఘట్టాలు, జంపన్నవాగులో పూడికతీత, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుధ్యం, తాగునీటి సౌక ర్యం లాంటి పనులు తాత్కాలికంగా చేపడుతున్నారు. 2022లో నిర్వహించే మహాజాతరకు రూ.111.91 కోట్ల నిధులు అవసరమవుతాయని ములుగు జిల్లా యం త్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అయితే.. ఇందులో ఎన్ని నిధులకు కోత పెట్టి.. ఎన్ని మంజూరు చేస్తుందో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో నిధుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని గిరిజనులు అంటున్నారు.  

కరోనా టెన్షన్‌ 

మేడారం మహాజాతర నిర్వహణపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. 2020 ఫిబ్రవరిలో జరిగిన జాతర సమయంలో కరోనా ప్రభావం పెద్దగా లేదు. దేశవ్యాప్తంగా  కేరళలో మాత్రమే ఒక కేసు మాత్రమే నమోదైంది. మార్చి 21 నుంచి  ఉధృతి పెరిగింది. ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌తో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కరోనా ఏ క్షణాన ఎగిసి పడుతుందోననే  టెన్షన్‌ అన్ని వర్గాల్లో నెలకొంది. వచ్చే జనవరి-ఏప్రిల్‌ నెలల్లో  థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి నాలుగు రోజుల పాటు అధికారికంగా జాతర నిర్వహిస్తారు. నెల రోజుల ముందు నుంచే ముందుగానే ప్రతి రోజూ 2లక్షల నుంచి 10లక్షల మంది భక్తులు వనదేవతల దర్శనానికి తరలి వస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్టులు నిర్వహించి, జాతరకు తరలించటం కుదిరే పని కాదు. దీంతో ఏ ఒక్క ‘పాజిటివ్‌’ భక్తుడు జాతరకు వచ్చినా అందరికీ విస్తరించే అవకాశం ఎక్కువ ఉంది. పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులను కట్టడి చేయడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాజాతర జరిగే ఆ నాలుగు రోజులు 70 లక్షలకు పైగా భక్తులు మేడారం జాతర పరిసరాల్లోనే బస చేస్తారు. ఆ సమయంలో కరోనా మహమ్మారి విస్తరించేందుకు ఎక్కువ అవకాశాలుఉంటాయనే ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కోటిన్నర మంది భక్తులు పాల్గొనే మేడారం జాతర నిర్వహణకు ప్రభుత్వం ముందడుగు వేస్తుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-10-08T05:54:18+05:30 IST