సమ్మక్క తల్లికి పుట్టింటి చీరె

ABN , First Publish Date - 2022-02-11T08:27:30+05:30 IST

మేడారం మహా జాతర ముంగిట.. సంప్రదాయంలో భాగంగా వన దేవత సమ్మక్కకు చంద వంశీయులు గురువారం పుట్టింటి చీరను సమర్పించారు.....

సమ్మక్క తల్లికి పుట్టింటి చీరె

మేడారంలో భక్త సందోహం.. 5 లక్షలమంది రాక

  బయ్యక్కపేట చంద వంశీయుల సమర్పణ..

  మేడారం జాతరకు లక్నవరం నీటి విడుదల

 పర్యాటకులకు సరస్సు సందర్శన బంద్‌


హైదరాబాద్‌, మేడారం, ములుగు, గోవిందరావుపేట, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మేడారం మహా జాతర ముంగిట.. సంప్రదాయంలో భాగంగా వన దేవత సమ్మక్కకు చంద వంశీయులు గురువారం పుట్టింటి చీరను సమర్పించారు. ఆచారం ప్రకారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట నుంచి మేళతాళాల నడుమ అంగరంగ వైభవంగా బయల్దేరి.. తమ ఆడ బిడ్డకు చీరను అందజేశారు. ముందుగా గ్రామంలోని ఆదివాసీలు ఇళ్లను శుభ్రం చేసుకుని పుణ్యస్నానాలు ఆచరించి కొత్త దుస్తులు ధరించారు. పురాతన సమ్మక్క గుడిని శుద్ధి చేసి అలుకు పూతలు చేశారు. ధూప, దీప నైవేద్యాలను సమర్పించి మొక్కుకున్నారు. అనంతరం పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బెల్లం, పుట్టింటి చీర, వడిబాల బియ్యంతో బయల్దేరారు. జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ కోర్నిబెల్లి శివయ్య ఆధ్వర్యంలో వాటిని సమ్మక్క గద్దె వద్ద సమర్పించారు.  

రేపు జంపన్న వాగుకు చేరనున్న నీరు

మేడారం సమ్మక్క, సారలమ్మ భక్తుల పుణ్యస్నానాల కోసం ఎప్పటిలాగే లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేశారు. ఈ జలాలు శనివారం జంపన్న వాగు చేరనున్నాయి. ఈ నెల 21 వరకు నీటి విడుల కొనసాగుతుందని సాగు నీటి శాఖ అధికారులు తెలిపారు. కాగా, లక్నవరం సరస్సు సందర్శనను ములుగు జిల్లా యంత్రాంగం తాత్కాలికంగా నిలిపివేసింది. మేడారం జాతర నుంచి భక్తులు తిరుగు ప్రయాణంలో లక్నవరాన్ని సందర్శిస్తుంటారు. అయితే, ఇరుకైన రోడ్లు, సరైన పార్కింగ్‌ వ్యవస్థ లేకపోవడం, పోలీసు యంత్రాంగమంతా జాతర విధుల్లో ఉండడంతో ముందుజాగ్రత్తగా లక్నవరం దారిని మూసివేశారు.  గతంలో జాతరకు ఒకట్రెండు రోజుల ముందు ఇలా చేసే అధికారులు ఈసారి ఆరు రోజుల ముందే దారిని మూసివేశారు. కాగా, ఇరుకు రోడ్లు, సరస్సు ఉండడంతో భక్తులను నియంత్రించడం కష్టమని భావించి రామప్ప దేవాలయ సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే పురావస్తు, దేవాదాయ శాఖలకు కలెక్టర్‌ లేఖ రాసినట్లు తెలుస్తోంది.  


ప్రత్యేక ఆకర్షణగా జాతర ఆహ్వాన పత్రిక

మేడారం మహా జాతరకు ప్రముఖులను ఆహ్వానించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ఆహ్వాన పత్రికను రూపొందించింది. గిరిజన కళలు, హస్తకళల బహుమతులతో దీనిని సిద్ధం చేసింది. ప్రత్యేక గిఫ్ట్‌ బాక్స్‌తో ఆహ్వాన పత్రికను ముస్తాబు చేశారు. ఇందులో కాఫీ టేబుల్‌ బుక్‌, కోయ/గోండు పెయింటింగ్స్‌, నాయకపు గిరిజన దారు శిల్పాలు, ఓజా గోండ్‌ క్రాఫ్ట్స్‌, బంజారా క్రాఫ్ట్స్‌, సమాచార స్టిక్కర్లు ఉన్నాయి. సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జాతీయ, రాష్ట్రస్థాయి ప్రముఖులకు ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ వీటిని అందజేసింది.

Updated Date - 2022-02-11T08:27:30+05:30 IST