ఇం‘ట్రస్ట్‌’ లేకపోతే ఎలా..?!

ABN , First Publish Date - 2021-11-25T05:41:52+05:30 IST

ఇం‘ట్రస్ట్‌’ లేకపోతే ఎలా..?!

ఇం‘ట్రస్ట్‌’ లేకపోతే ఎలా..?!

మేడారం ట్రస్టుబోర్డు ఏర్పాటుకు  ఆసక్తి చూపని ప్రభుత్వం!

 మరో మూడు నెలల్లోనే మహాజాతర 

 ఇంకా నోటిఫికేషన్‌ జారీ చేయని దేవాదాయ శాఖ

 పునరుద్ధరణ కమిటీతోనే సరిపెట్టుకోవచ్చనే అనుమానాలు

 2014, 2016, 2020లో అదే పరిస్థితి

 ఈసారి కూడా పునరావృతమవుతుందనే చర్చ

 (ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

 మేడారం ట్రస్టు బోర్డు ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. మూడు నెలల్లో మహాజాతర జరగనుండగా ఇప్పటి వరకు దాని ఏర్పాటుకు దేవాదాయ శాఖ ఇంకా ముందడుగు వేయలేదు. కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా 2014, 2016, 2020 మహాజా తరలకు ట్రస్టుబోర్డు ఏర్పాటు కాలేదు. అధికార పార్టీలో గ్రూపుల లొల్లి వల్ల అడ్డుకట్ట పడింది. దీంతో అప్పట్లో మహాజాతరకు మూడు నెలల కాలపరి మితిపై పునరుద్ధరణ కమిటీని మాత్రమే ఏర్పాటు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోందనే చర్చ సాగు తోంది. టీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరుతో ట్రస్టుబోర్డు ఏర్పాటుకు అడ్డంకులు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి కూడా పునరుద్ధరణ కమిటీతోనే ప్రభు త్వం సరిపెట్టుకుంటుందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో ట్రస్టుబోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అందులో ఆదివా సీలను మాత్రమే నియమించాలనే గిరిజన సం ఘాల నుంచి డిమాండ్‌ వస్తోంది.

నోటిఫికేషన్‌ ఏదీ..?

ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజా తరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం గిరిజనులతో కూడిన ట్రస్టుబోర్డును ఏర్పాటు చేస్తుంది. జాతరకు ఆరు నెలల ముందే దేవాదాయ శాఖ దీని ప్రక్రియను ప్రారంభిస్తుంది. ట్రస్టుబోర్డు సభ్యుల నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. అయితే..  మహాజాతరకు  ఇంకా మూడు నెలల సమయం కూడా లేదు. ఇప్పటి వరకు కూడా ట్రస్టుబోర్డు ఏర్పాటుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మళ్లీ పునరుద్ధరణ కమిటీయేనా..?

మహాజాతరకు తొలిసారి 2014లో ట్రస్టుబోర్డు సభ్యుల ఎంపికలో అప్పటి అధికార కాంగ్రెస్‌లో విభేదాల ఏర్పడ్డాయి. దీంతో కమిటీ నియామకం జరగలేదు. జాతర పునరుద్ధరణ  కమిటీని  మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో గద్దెల వద్ద సమ్మక్క-సారలమ్మల ప్రసాదం (బెల్లం) పంపి ణీ, తలనీలాల సేకరణ, క్యూలైన్ల ఏర్పాటు, కొబ్బరి కాయల అమ్మకం, గద్దెల వద్ద బ్లెలం తొలగింపు తదితర విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. 2016 మహాజాతరలో నూ అదే పరిస్థితి. అధికార టీఆర్‌ఎస్‌లో గ్రూపుల లొల్లి తెరపైకి వచ్చింది. పార్టీలో విభేదాల కారణంగా ట్రస్టుబోర్డును ఏర్పాటు చేయ లేదు. మూడు నెలల ముందు జాతర పునరు ద్ధరణ పేరుతో ఓ కమిటీ వేసి అప్పుడు కూడా మమ అనిపించారు. 2020 మహాజాతరకు కూడా అదే పునా రావృతమైంది.  టీఆర్‌ఎస్‌ మూడు గ్రూపులు ఏర్పడి, ఎవరికి వారే ట్రస్టు జాబితాను దేవాదాయ శాఖకు అందజేశారు. దీంతో ట్రస్టుబోర్డు ఏర్పాటుపై తీవ్ర ఒత్తిళ్లు రావటంతో పునరుద్ధరణ కమిటీతో సరిపెట్టా రు. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉండటంతో జాతరకు ట్రస్టుబోర్డు నియామకం జరుగుతుందా..? లేక 2014, 2016, 2020 తరహాలో పునరుద్ధరణ కమిటీలే పునారవృతం అవుతాయా..? అనే ఉత్కంఠ భక్తుల్లో నెలకొంది. 

ఎక్కడి సమస్యలు అక్కడే..

వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి నాలుగు రోజుల పాటు జాతర జరగనుండగా ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్ల నిధులను కేటాయించింది. బోర్డు పర్యవేక్ష ణ లేకుండానే పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి. గిరిజన పూజారులు, నాయీబ్రాహ్మణులు, భూని ర్వాసిత రైతులతో చర్చించి జాతరను విజయవంతం చేయడంలో ట్రస్టుబోర్డు పాత్ర కీలకం. ప్రస్తుతం  ఇంకా బోర్డును ఏర్పాటు చేయకపోవడంతో  ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.  

పట్టుబడుతున్న ఆదివాసీలు

మేడారం జాతర ఆదివాసీల సంస్కృతీ సంప్రదా యలకు ప్రతీక. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉత్సవం ఉంది. అయితే.. మహాజాతరలో ఆదివాసీలకే సరైన గుర్తింపు లభించడం లేదని ఆ సామాజిక వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి. ట్రస్టుబోర్డు కమిటీలో తమకు సరైన ప్రాధాన్యం ఉండటం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతర సమయంలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. హుండీ లెక్కింపు తప్ప తమకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అంటున్నారు. ఈసారి ట్రస్టుబోర్డులో మొత్తం తమ సామాజిక వర్గానికే ప్రాతినిద్యం కల్పించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇందుకు అధికార పార్టీలోని కీలక నేతలపై ఒత్తిడి తెస్తున్నారు.

జాతర నిర్వహణ బాధ్యత ఆదివాసీలకే అప్పగించాలి

- సిద్ధబోయిన స్వామి, మేడారం సమ్మక్క పూజారి 

ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలతో సాగే మేడారం మహాజాతర నిర్వహణ బాధ్యతలను ఆదివాసీలకే అప్పగించాలి. ధర్మకర్తల మండలిలో వంద శాతం ఆదివాసీలనే నియమించాలి. ఆదివాసీయేతరులను సభ్యులుగా నియమించటంతో వారికి మా సంప్రదాయలపె అవగాహన ఉండటం లేదు. అలాగే వచ్చే ఫిబ్రవరి 19 నుంచి జరిగే మహాజాతరకు పునరుద్ధరణ కమిటీని కాకుండా ఈసారి శాశ్వత ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలి. భక్తులకు పూర్తి సౌకర్యాలు ఏర్పాటుకు అధికారులు దృష్టి సారించాలి. 


Updated Date - 2021-11-25T05:41:52+05:30 IST