Abn logo
Aug 2 2021 @ 02:10AM

జలాల వివాదంతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం: పాట్కర్‌

దక్షిణాన్ని నిర్లక్ష్యం చేసిన కేంద్రం: హరగోపాల్‌

తెలంగాణకు అన్యాయమే: కోదండరాం

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన  జలాల వివాదాన్ని పరిష్కరించాల్సిన కేంద్రం, దీన్ని సాకుగా తీసుకొని, నదీ బోర్డులు ఏర్పాటు చేసి పెత్తనం చేస్తోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని ప్రముఖ పర్యావరణవేత్త మేధా పాట్కర్‌ అన్నారు. ‘కృష్ణానదీ జలాల వివాదం, కేంద్ర గెజిట్‌ పర్యవసానాలు-తెలంగాణ భవిష్యత్‌’పై పాలమూరు అధ్యయన వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో ఆమె మాట్లాడారు. కేంద్రం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే అవకాశమున్నా, రాష్ట్రాలపై పెత్తనానికే గెజిట్‌ను విడుదల చేసిందని విమర్శించారు. రెండు రాష్ట్రాల హక్కులను కాపాడేలా పౌర సమాజం ఉద్యమించాలన్నారు.


సామాజికవేత్త జి. హరగోపాల్‌ మాట్లాడుతూ, ఈ ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ దక్షిణ ప్రాంత జిల్లాలను పట్టించుకోలేదని అన్నారు. కృష్ణానదీ జలాల వివాదం తెలంగాణ ఉద్యమంలో భాగమైందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటయినప్పుడు తెలంగాణ ప్రజలు నీటి విషయంలో ఆందోళన చెందారని, దక్కాల్సిన నీరు దక్కలేదని తెలిపారు. ఈ వివాదాన్ని ఆసరాగా తీసుకొని కేంద్రం సమస్యను తన అధీనంలోకి తీసుకుందని ఆన్నారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కోదండరాం మాట్లాడుతూ.. కేంద్రం కృష్ణా జలాలను పంచకుండా, అధికారాలను తన చేతిలోకి తీసుకోవడమంటే తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్లేనని అన్నారు. తెలుగు ప్రజలు ఈ గెజిట్‌ని అడ్డుకోవాలని అన్నారు. న్యాయ వ్యవహారాల నిపుణుడు మాడభూషి శ్రీధర్‌ మాట్లాడుతూ కేంద్ర గెజిట్‌ రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి అని, స్థానిక వనరుల నిర్వహణ, అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలుండి చేసేదేంటని ఆయన ప్రశ్నించారు. సీపీఐఎంల్‌ న్యూడెమోక్రసీ నేత కె.గోవర్ధన్‌, రైతు స్వరాజ్యవేదిక కన్వీనర్‌ కన్నెగంటి రవి, పాలమూరు అధ్యయనవేదిక కన్వీనర్‌ ఎం.రాఘవాచారి, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య ఈ వెబినార్‌లో పాల్గొన్నారు.