మీడియా అకాడమి భవనాన్నిసకాలంలో పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-07-22T21:00:34+05:30 IST

మీడియా అకాడమి భవనం త్వరలో పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లను కోరారు.

మీడియా అకాడమి భవనాన్నిసకాలంలో పూర్తి చేయండి

హైదరాబాద్: మీడియా అకాడమి భవనం త్వరలో పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లను కోరారు. నాంపల్లిలో మీడియా అకాడమి భవన నిర్మాణ పనులను చైర్మన్ అల్లం నారాయణ పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, మీడియా అకాడమి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉండే విధంగా మీడియా అకాడమి భవనాన్ని బహుళ అంతస్తుల భవనంగా నిర్మిస్తున్నట్లు ఇందులో 200 మందికి సరిపడే విధంగా ఆడిటోరియంను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. 


ఈ భవనంలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు, సర్టిఫికేట్ కోర్సుల నిర్వహణ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వీడియా కాన్ఫరెన్స్ తోపాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆడిటోరియంను నిర్మిస్తున్నామని అన్నారు. ఈ భవనం ద్వారా జర్నలిస్టులకు మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.  జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. భవన నిర్మాణంలో అవసరమైన మార్పులను అధికారులకు సూచించారు. నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని ఇంజనీర్లకు సూచించారు. క్రమం తప్పకుండా పనులను పర్యవేక్షించాలని మీడియా అకాడమి అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి, అసిస్టెంట్ ఇంజనీర్ నితిన్, మీడియా అకాడమి మేనేజర్ వనజ, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణ చందర్ రావు, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-22T21:00:34+05:30 IST