Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘మాధ్యమ’ నిఘా!

‘‘భావస్వేచ్ఛ అనేది మనం ఇష్టపడే ఆలోచనలకు మాత్రమే కాదు, ద్వేషించే ఆలోచనలకు కూడా ఉండాలి’’- ఈ మాటలు డిజిటల్ మీడియాకు సంబంధించిన కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ ఢిల్లీ న్యాయస్థానానికి ‘వాట్సాప్’ చేసిన నివేదనలోనివి. ఈ కొత్త నిబంధనల కారణంగా, తాము చేసే డిజిటల్ వ్యక్తిగత సంభాషణలను కనుగొని, వాటి ఆధారంగా తమ మీద చర్యలు తీసుకుంటారని సాధారణ పౌరులు భయపడి, స్వేచ్ఛగా సంభాషించడానికి భయపడతారని ఆ సంస్థ తన పిటిషన్‌లో ఫిర్యాదు చేసింది. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలకు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ విడియో వంటి ఓటీటీ వేదికలకు వర్తించే కొన్ని నిబంధనలను మొన్న ఫిబ్రవరి 25 నాడు కేంద్రం జారీచేసింది. మూడు మాసాల గడువులోపల, అంటే ఈ మే 25 నాటికి ఆ నిబంధనలకు తమ ఆమోదాన్ని ఆయా సంస్థలు, వేదికలు తెలియజేయాలి. లేని పక్షంలో, డిజిటల్ సామాజిక మాధ్యమాలకు ఉన్న ప్రత్యేక రక్షణలు పోతాయి. ఈ నిబంధనలు ఆయా సామాజిక మాధ్యమాలు చెప్పుకునే విలువలకు, వ్యాపారానికి మాత్రమే కాక, వాటిని వినియోగించే అసంఖ్యాక ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరంగా ఉన్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నిబంధనల విషయంలో ప్రభుత్వం పట్టింపుగా ఉన్నదన్న సంగతి రెండు మూడు రోజులుగా జరుగుతున్న సంఘటనలు తెలియజేస్తున్నాయి. భావ ప్రకటనాస్వేచ్ఛకు, వ్యక్తిగత గోప్యతకు భంగకరం అన్న ప్రాతిపదిక మీద వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, సోమవారం నాడు ఢిల్లీ శివార్లలోని గుర్గావ్‌లో ఉన్న ట్విట్టర్ కార్యాలయానికి ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు వెళ్లడం, బుధవారం నాడు తాజాగా కేంద్ర సమాచార సాంకేతిక శాఖ హెచ్చరిక జారీచేయడం వివాదం తీవ్రతరమవుతున్నదని సూచిస్తున్నాయి.


కొత్తగా ఏర్పరచిన ఈ నిబంధనలు ఏమిటి? 2000 సంవత్సరంలో చేసిన సమాచారసాంకేతికత చట్టంలోని 87 వ సెక్షన్‌కు అనుబంధంగా ఈ నిబంధనలను పొందుపరచారు. వీటి పేరు- సమాచార సాంకేతికత (తటస్థ వేదికల మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక ప్రవర్తనా నియమావళి) నిబంధనలు, 2021. ఇటువంటి నిబంధనలను పాత చట్టానికి అనుబంధంగా జారీచేస్తారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌వంటి సామాజిక మాధ్యమాలను తటస్థ వేదికలు (ఇంటర్ మీడియరీలు) అంటున్నారు. ఈ వేదికలకు 2011లో కూడా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇప్పుడు 2021 నిబంధనలు ఆ పాత నిబంధనలను పూర్వపక్షం చేస్తాయి. సామాజిక మాధ్యమాలలో, వినియోగదారుల మధ్య సంభాషణలు, సమాచార వినిమయం జరుగుతూ ఉంటుంది. ఆ మాధ్యమాలను నిర్వహించేవారికి ఆ సంభాషణలలోని, సమాచారంలోని అంశాలతో ఎటువంటి ప్రమేయం ఉండదు. పత్రికలలోలాగా, అక్కడ ఎవరూ ఎడిట్ చేయరు. కాబట్టి, ఆ సంస్థలను తటస్థ వేదికలు అంటున్నారు. ఆ వేదికలలో ఏదైనా అభ్యంతరకర అంశాలుంటే, ఆ అంశాలను పంపినవారు బాధ్యులవుతారు తప్ప, వేదికలు జవాబుదారీ కాదు. ఇప్పుడు కొత్తగా రూపొందించిన నిబంధనలను కనుక వాట్సాప్ వంటి సంస్థలు పాటించకపోతే, జవాబుదారీతనం లేని రక్షణ ఇకపై కొనసాగదు. జరిగే సంభాషణలలోని విషయానికి కూడా వారు బాధ్యులవుతారు. ఇంతకూ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు ఏమిటి? ఆసాంతం గోప్యత అన్నది వాట్సాప్ చెప్పుకునే ఘనత. అంటే, పంపినవారు, తీసుకున్నవారు తప్ప మధ్యలో ఎవరూ సందేశాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం లేని సాంకేతిక బందోబస్తు. కొత్తగా వచ్చిన నిబంధనలు ఏమి అడుగుతున్నాయంటే, ఏదైనా వ్యాప్తి చెందిన ఒక సందేశం మొదటగా ఎక్కడ నుంచి మొదలైంది అధికారులతో వాట్సాప్ వంటి వేదికలు పంచుకోవాలి. అట్లా పంచుకోవడం అంటే, ఆసాంతం గోప్యత అన్న విలువను పక్కన పెట్టవలసిందేనని, ఇక వినియోగదారులకు స్వేచ్ఛ ఎక్కడుంటుందని ఆ వేదికలు ప్రశ్నిస్తున్నాయి. అట్లాగే, ప్రభుత్వం అభ్యంతరకరమని సూచించిన ఏ పోస్టునైనా 36 గంటలలోగా తొలగించాలి. మాధ్యమ సంస్థలుగా తమకు కొన్ని మార్గదర్శకాలు, విధానాలు ఉంటాయని, మంచిచెడ్డలతో నిమిత్తం లేకుండా కేవలం ఆదేశాలకు లోబడి సందేశాలను తొలగిస్తే, ఇక భావస్వేచ్ఛకు అర్థమేమిటని ట్విట్టర్ ప్రశ్నిస్తోంది. ఇక, తటస్థ వేదికలన్నీ ఒక స్పష్టమైన చిరునామాను, ఒక బాధ్యుడైన భారతీయ అధికారినీ కలిగి ఉండాలన్నది మరో ముఖ్య నిబంధన. అంటే, ఎప్పటికప్పుడు వచ్చే ఫిర్యాదులతో ప్రభుత్వం, పోలీసులు ఆ ఉద్యోగిని వేధిస్తారన్న భయాందోళనను సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ కట్టుదిట్టాలన్నీ దేశభద్రత కోసం చేస్తున్నామని చెబుతున్నది. ఎవరో ప్రమాదకర కార్యకలాపాలలో ఉండేవారికి తప్ప సామాన్యులకు ఈ నిబంధనల వల్ల ఎటువంటి అసౌకర్యం ఉండదని ప్రభుత్వం వాదిస్తున్నది కానీ, ప్రభుత్వ నియమాలను పాటించాలంటే ప్రతి సంభాషణను ఆ వేదిక జాగ్రత్త చేయవలసి ఉంటుంది. అంతేకాదు, ప్రతి సంభాషణను ఏదో ఒక పద్ధతిలో అంచనావేయవలసి ఉంటుంది. తమ సంభాషణలు మరెక్కడో రికార్డయి ఉంటాయంటే ఎంతమందికి అది సదుపాయంగా ఉంటుంది? 


రెండో విడత కొవిడ్ వెల్లువ సందర్భంగా కేంద్రప్రభుత్వం, నరేంద్రమోదీ విఫలమయ్యారని ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక టూల్ కిట్ రూపొందించిందని బిజెపి నేతలు ఆరోపించడం, దానిపై వివాదం చెలరేగడం తెలిసిందే. బిజెపి నేతల పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని ట్విట్టర్ భావించి చర్యలు తీసుకున్నది. చర్యలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని నోటీసు ఇవ్వడానికి పోలీసులు ట్విట్టర్ కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వం మీద క్రమంగా ఏర్పడుతున్న అవిశ్వాసాన్ని అణచివేయడానికి, టూల్ కిట్ కుట్రకేసు వంటిదేదో రూపొందుతోందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. పోలీసు సందర్శనల గురించి, నిబంధనల గురించి పౌరసమాజం నుంచి తగినంత ప్రతిస్పందనలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. స్వేచ్ఛల గురించి మాధ్యమాలు మాట్లాడుతుంటే, ప్రభుత్వం దేశభద్రత గురించి మాట్లాడుతోంది. ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మేము, మాకే నీతులు చెబుతారా’ అన్న ధోరణిలో గురువారం నాటి ప్రభుత్వ స్పందన ధ్వనించింది. 


ఇదే సమయంలో మరో కోణాన్ని ఇక్కడ ప్రస్తావించవలసి ఉన్నది. ఇదే వాట్సాప్ వ్యాపార అవసరాల కోసం వ్యక్తిగత గోప్యతకు తూట్లు పొడవడానికి ప్రయత్నిస్తున్నది. అది రూపొందించిన కొత్త నిబంధనావళికి వినియోగదారులు ఆమోదం తెలిపితేనే పూర్తిస్థాయిలో వాట్సాప్‌లో ఉన్న సదుపాయాలను వాడుకోవచ్చునని నిర్బంధిస్తోంది. స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ కోసం ఉన్న ఆకాంక్షకు భంగకరంగా ఫేస్‌బుక్ గతంలో వ్యవహరించింది. గూగుల్ అయితే తమ వ్యాపారం కోసం దేశదేశాల్లో అక్కడి ప్రభుత్వాలకు దాసోహం అంటున్నది. సామాజిక మాధ్యమాల పేరుతో ఉన్న వేదికలు రాజకీయ స్వేచ్ఛల గురించి ఆందోళన చెందుతున్నాయి, అంతర్జాతీయ సంస్థలైన తమపై దేశీయమైన ఒత్తిడులేమిటని చిరాకు పడుతున్నాయి తప్ప, వాటికి స్వేచ్ఛాయుత వ్యక్తీకరణల విషయంలో నిజమైన పట్టింపు ఉన్నదని భావించలేము. అయితే, ప్రస్తుత సందర్భంలో, వారు భారతీయ వినియోగదారుల స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు, భారతీయ పౌరులమీద రాజకీయంగా నిఘా పెట్టడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కాబట్టి, మాధ్యమాల పోరాటం ఇప్పుడు న్యాయమైనదీ, అవసరమైనదీ కూడా.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...