వైద్య శాఖ పోస్టులు ఫర్‌ సేల్‌!

ABN , First Publish Date - 2020-07-13T19:47:09+05:30 IST

జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీకి జరుగుతున్న ప్రక్రియలో..

వైద్య శాఖ పోస్టులు ఫర్‌ సేల్‌!

జిల్లాలో 255 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

‘ప్రైవేటు’లో ఉద్యోగాల కోతతో పెరిగిన డిమాండ్‌

దళారులు, రాజకీయ నేతల రంగ ప్రవేశం

ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలకుపైగా బేరం

ప్రజాప్రతినిధుల నుంచి అధికారులకు సిఫార్సు లేఖలు

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణపై అనుమానాలు


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీకి  జరుగుతున్న ప్రక్రియలో దళారులు, రాజకీయ నేతలు రంగ ప్రవేశం చేశారు. రూ.2 లక్షలకు తక్కువ కాకుండా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దళారుల వెనుక కొందరు అధికారులు, ఉద్యోగులు ఉండగా, రాజకీయ నేతల వెనుక ప్రజాప్రతినిధులు అండగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


కరోనా నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 255 స్టాఫ్‌ నర్సు, ఫార్మాసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ జరుగుతోంది. వైద్య శాఖలో మొత్తం 164 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందులో 92 స్టాఫ్‌ నర్సు పోస్టులు, 50 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 22 ఫార్మాసిస్టు పోస్టులున్నాయి. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 38 స్టాఫ్‌ నర్సు పోస్టులు, 3 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 4 రేడియోగ్రాఫర్‌ పోస్టులున్నాయి. అలానే వైద్య విధాన పరిషత్‌లో మొత్తం 46 పోస్టులు భర్తీ చేస్తుండగా అందులో 35 స్టాఫ్‌ నర్సు పోస్టులు, పది ఫార్మాసిస్టులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులున్నాయి. దీంతో అభ్యర్థుల నుంచి పోటీ ఎక్కువైంది. కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులలో ఉపాధి కోల్పోయిన వారంతా ఇక్కడ క్యూ కట్టడంతో ఈ పోస్టులకు డిమాండ్‌ పెరిగింది. స్టాఫ్‌ నర్సు పోస్టులకు రూ.34 వేలు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు రూ.28 వేలు జీతం ఇవ్వనున్నారు. కాగా, ప్రజాప్రతినిధుల చుట్టూ ఉండే పలువురు నాయకులు అభ్యర్థుల వద్ద డబ్బులు వసూలు చేసి ఆ పేర్లను సదరు ప్రజాప్రతినిధి చేత జిల్లా ఉన్నతాధికారులకు సిఫారసు చేయించుకుంటున్నారు.


ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే ఓ ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి ఇప్పటికే సుమారు ముప్పై వరకు సిఫార్సు లేఖలతో కూడిన జాబితా అధికారులకు అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక పదుల సంఖ్యలో మరికొంత మంది నుంచి కూడా సిఫార్సు లేఖలు అందినట్లు తెలుస్తోంది. అయితే ఈ పోస్టుల దరఖాస్తుకు ఇంకా గడువు ఉండడంతో సిఫార్సు లేఖల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. 


అర్హులకు అన్యాయం జరిగే ప్రమాదం

వైద్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిన చేపడుతున్న ఈ పోస్టుల భర్తీలో అనుసరిస్తున్న విధానం, అధికార పార్టీ నేతల జోక్యంతో అర్హులకు ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. ఆన్‌లైన్‌ ప్రక్రియపై అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్‌లైన్లో ఇష్టం వచ్చినట్లు మెరిట్‌ తయారు చేసే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఓ వైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అనవసరంగా బయట తిరగవద్దని చెబుతున్న ప్రభుత్వమే ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో జరిగే ఈ పోస్టుల భర్తీకి పరీక్ష, ఇంటర్వ్యూలు లేవు. కేవలం చదువులో మార్కులు, అనుభవం ఆధారంగా మెరిట్‌ తయారు చేసి రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్లో అభ్యర్థులందరి జాబితాను ఉంచి వెయిటేజీ ప్రకటిస్తే పారదర్శకంగా ఉంటుంది.


అర్హత సాధించని అభ్యర్థులు తాము ఎందుకు ఎంపిక కాలేదన్న విషయాన్నీ తెలుసుకునేందుకు వీలు ఉంటుంది. గతంలో వైద్య శాఖలో ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ సమయంలో అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసి మెరిట్‌ జాబితా తయారు చేశారన్న ఆరోపణలు రావడంతో కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. కొంతమంది పేర్లు మెరిట్‌ జాబితాలో తారుమారవడంతో ఆ పోస్టుల భర్తీని నిలిపేశారు. ఇటువంటి అనుభవం ఉన్నప్పుడు మళ్లీ అదే పంథాలో భర్తీ జరుగుతుండడంపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 


Updated Date - 2020-07-13T19:47:09+05:30 IST