కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

ABN , First Publish Date - 2021-01-08T07:23:43+05:30 IST

రెండు రోజులుగా ఊపిరితిత్తుల్లో మంటతో ఇబ్బంది పడుతున్న సీఎం కేసీఆర్‌ గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి వెళ్లిన సీఎం.. మధ్యాహ్నం 2.10 నుంచి 3.30 గంటల

కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

ఊపిరితిత్తుల్లో మంట, దగ్గుతో బాధపడుతున్న సీఎం

వైద్యుల సూచనతో యశోద ఆస్పత్రికి

స్వల్ప ఇన్‌ఫెక్షన్‌.. గుర్తించిన వైద్యులు!

కేసీఆర్‌ ఆరోగ్యానికి ఏ ఇబ్బందీ లేదు

వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు వెల్లడి

సీఎం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు

ప్రగతి భవన్‌ వర్గాల వెల్లడి

కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

5 రోజులు మందులు వాడాలని సూచన

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటన రద్దు


హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా ఊపిరితిత్తుల్లో మంటతో ఇబ్బంది పడుతున్న సీఎం కేసీఆర్‌ గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి వెళ్లిన సీఎం.. మధ్యాహ్నం 2.10 నుంచి 3.30 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఛాతీలో మంట వస్తుందని వైద్యులకు చెప్పడంతో ఆయనకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. సీటీ స్కాన్‌, అలా్ట్రసౌండ్‌, 2డీ ఎకో, రక్తపరీక్షలు చేశారు. సీఎం కేసీఆర్‌ను బుధవారం ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత్‌సాగర్‌రెడ్డి, హృద్రోగ నిపుణుడు ప్రమోద్‌కుమార్‌లు పరీక్షించారు. కొన్ని పరీక్షలు అవసరమని వారు సూచించడంతో కేసీఆర్‌ గురువారం ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్‌ ఎంవీరావు పర్యవేక్షణలో ఆయనకు వైద్య సేవలు అందించారు. కేసీఆర్‌ వెంట మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్‌ ఉన్నారు.


సీఎం కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కరోనా లక్షణాలు లేవని తేల్చారు. ఐదు రోజులు వాడాలని సీఎంకు మందులు ఇచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్‌కు బ్రాంకైటీస్‌ సమస్య ఉండడం వల్ల ప్రతి శీతాకాలంలో కొంత ఇబ్బంది పడతారని సన్నిహితులు తెలిపారు. ఇవి సాధారణ వైద్య పరీక్షలు మాత్రమేనన్నారు. సీఎం కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రగతి భవన్‌ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రాథమికంగా ఖరారైన షెడ్యూల్‌ ప్రకారం సీఎం కేసీఆర్‌ గురువారం సాయంత్రం కరీంనగర్‌ వెళ్లి, రాత్రికి అక్కడ బస చేయాల్సి ఉంది. శుక్రవారం పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు కూతురు వివాహానికి హాజరైన అనంతరం మేడిగడ్డ ఏరియల్‌ వ్యూ చేయాల్సి ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు

సీఎం కేసీఆర్‌ రెండు రోజులుగా స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారు. దగ్గుతో పాటు ఛాతిలో కొద్దిగా మంట వస్తోంది. పదేళ్ల నుంచి ఈ సీజన్‌లో ఆయనకు ఎలర్జీ, బ్రాంకైటీస్‌, సైనసైటిస్‌ వస్తుంటుంది. సైనస్‌, లంగ్స్‌కు సంబంధించిన పరీక్షలు చేశాం. గ్యాస్ర్టో ఎంటరాలజీ సమస్యలు లేవు. మిగతా రక్త పరీక్షలు చేశాం. అల్ర్టాసౌండ్‌, కొలస్ర్టాల్‌, షుగర్‌, లివర్‌, కిడ్నీ ఫంక్షనింగ్‌ను కూడా పరిశీలించాం. రిపోర్టులు ఇంకా రాలేదు. చెస్ట్‌ సీటీస్కాన్‌ చేయగా రిపోర్ట్‌ నార్మల్‌గా ఉంది. ప్రస్తుతం ఆయనకు యాంటీ అలర్జీ, యాంటీబయాటిక్‌ మందులు ఇచ్చాం. లంగ్స్‌లో కరోనా లక్షణాలు ఏమీ కనిపించలేదు. కేసీఆర్‌కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. 5 రోజుల వరకు మందులు ఇచ్చాం. 

- డాక్టర్‌ ఎంవీ రావు, సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు 

Updated Date - 2021-01-08T07:23:43+05:30 IST