మేడిగడ్డ.. ఇసుక అడ్డా!

ABN , First Publish Date - 2021-03-08T08:04:42+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ రిజర్వాయర్‌.. ఇసుక వెలికితీతకు అడ్డాగా మారుతోంది.

మేడిగడ్డ.. ఇసుక అడ్డా!

  • వేసవిలో భారీగా తవ్వకాలు
  • వర్షాకాలం అవసరాలకు నిల్వ
  • ప్రత్యేకంగా ఆరు రీచ్‌ల ఏర్పాటు
  • 20కిపైగా రీచ్‌ల  నుంచి 50 లక్షల
  • క్యూబిక్‌మీటర్ల వెలికితీతకు నిర్ణయం 

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ రిజర్వాయర్‌.. ఇసుక వెలికితీతకు అడ్డాగా మారుతోంది. గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిన నేపథ్యంలో రిజర్వాయర్‌ నుంచి భారీ పరిమాణంలో ఇసుకను బయటకు తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆరు రీచ్‌లను గుర్తించింది. వానాకాలంలో ఇసుక వెలికితీత సాధ్యం కాక గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. దీంతో ప్రభుత్వం కొన్నేళ్లుగా వేసవిలోనే భారీగా ఇసుకను వెలికి తీసి నిల్వ చేస్తోంది. ఇందులోభాగంగా ఈసారి సుమారు 50లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వెలికితీసి నిల్వ చేయనుంది. మేడిగడ్డ పరిధిలోని 6 రీచ్‌లతోపాటు కొత్తగా ప్రారంభించనున్న మరో 20 రీచ్‌ల నుంచి ఇసుకను వెలికితీసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏటా రాష్ట్ర అవసరాలకు సుమారు కోటి నుంచి 1.2 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరం ఉంటుంది. ఇందులో సుమారు 60 శాతం ఇసుక హైదరాబాద్‌ అవసరాలకే కావాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 


ఇందులో భాగంగా ఇసుక ఉన్న రీచ్‌లను గుర్తించడం, రీచ్‌ల నుంచి ఇసుక బయటకు తీయడం వంటి ప్రక్రియ అంతా సర్కార్‌ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఖనిజాభివృద్ధి సంస్థ(ఎండీసీ)కు ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది. ఏ రీచ్‌లో ఏ మేర ఇసుక లభ్యత ఉన్న విషయాన్ని ఎండీసీ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 37 రీచ్‌లు ఉండగా, ప్రతి రోజూ 50 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వెలికి తీసి విక్రయిస్తోంది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చర్యల్ని తీసుకుంటోంది. ఇసుక రీచ్‌ల్లోనే కాకుండా స్టాకు యార్డుల్లో కూడా ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. పరిమితికి మించి ఎక్కువ లోడ్‌ ఇసుకను రవాణను నియంత్రించడానికి వీలుగా కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 23వే బ్రిడ్జిలను నెలకొల్పారు. అలాగే నకిలీ వే బిల్లులను అరికట్టడానికి వీలుగా ‘‘సాండ్‌ ఏ’’ పేరిట యాప్‌ను రూపొందించారు. 


ఇసుక లభ్యతను పెంచేందుకే..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై పలు రిజర్వాయర్లను ప్రభుత్వం నిర్మించిన విషయం తెలిసిందే. వీటిలోకి ఎప్పటికప్పుడు కొత్త ఇసుక వచ్చి చేరుతోంది. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు వరదలో భాగంగా వచ్చే ఇసుకను వేసవి కాలంలో వెలికితీయడం ద్వారా రాష్ట్ర అవసరాలు తీరడంతోపాటు ప్రాజెక్టులో పూడిక తీసినట్టవుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా మేడిగడ్డ నుంచి భారీగా ఇసుకను బయటకు తీయాలని సర్కార్‌ నిర్ణయించింది.



Updated Date - 2021-03-08T08:04:42+05:30 IST