మేడిగడ్డ టూ కొండపోచమ్మ సాగర్‌

ABN , First Publish Date - 2021-06-18T05:17:17+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన అన్ని రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.

మేడిగడ్డ టూ కొండపోచమ్మ సాగర్‌
నంది పంప్‌హౌస్‌ నుంచి మోటార్ల ద్వారా రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోతలు

- ప్రారంభమైన కాళేశ్వరం ఎత్తిపోతలు

- 120 టీఎంసీలను ఎత్తిపోయడమే లక్ష్యం

- రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలింపు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన అన్ని రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో వాటన్నింటికీ నీటిని తరలించి జలకళ ఉట్టి పడేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. గత ఏడాది మిడ్‌మానేరు వరకు కాళేశ్వరం నీటిని తరలించగా, ఈ ఏడాది కొండపోచమ్మ సాగర్‌ వరకు నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా రెండు మాసాల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున 120 టీఎంసీల నీటిని తరలించాలని నిర్ణయించారు. నాలుగు రోజులుగా గోదావరి, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఎత్తిపోతలను ప్రారంభించారు. బుధవారం రాత్రి పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారం అండర్‌ టన్నెల్‌లో గల ఒక పంప్‌ను ప్రారంభించి నంది రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయగా, గురువారం రెండు మోటార్లను ప్రారంభించారు. అక్కడినుంచి గాయత్రి పంప్‌హౌస్‌కు అంతే మొత్తంలో నీటిని వదలగా, గాయత్రి నుంచి మిడ్‌మానేరులోకి నీటిని వదిలిపెట్టారు. అలాగే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మి బ్యారేజీ నుంచి రెండు మోటార్ల ద్వారా 4,200 క్యూసెక్కుల నీటిని సరస్వతి బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక్కడినుంచి సరస్వతి పంప్‌హౌస్‌ ద్వారా నుంచి పెద్దపల్లి జిల్లా మంథని సుందిళ్ల వద్దగల పార్వతి బ్యారేజీలోకి రెండు మోటార్ల ద్వారా 5,860 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నీటిమట్టాలు పెరిగిన తర్వాత శుక్రవారం పార్వతి పంప్‌హౌస్‌ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని వదలనున్నట్లు జల వనరుల శాఖాధికారులు పేర్కొన్నారు. గురువారం నాటికి శ్రీపాద ఎల్లపంల్లి ప్రాజెక్టులో 20.175 టీఎంసీలకు గాను 9.42 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి నంది పంప్‌హౌస్‌లోకి 6,300 క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. అక్కడినుంచి కరీంనగర్‌ జిల్లా రామడుగులోగల గాయత్రి పంప్‌హౌస్‌లోకి, అక్కడినుంచి మిడ్‌ మానేరులోకి నీటిని వదులుతున్నారు. శ్రీపాద ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ నీటిమట్టం గురువారం సాయంత్రం వరకు 11.679 టీఎంసీలు ఉండగా, 10 గేట్ల ద్వారా 51,900 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిపెడుతున్నారు. ప్రాణహిత నది ద్వారా 51,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. గత ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని మిడ్‌మానేరు వరకు, అక్కడి నుంచి ఎల్‌ఎండీలోకి వదిలిపెట్టారు. అనంతగిరి, ఇమామాబాద్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్ల పనులు పూర్తికావడంతో వాటిలోకి ట్రయల్‌ రన్‌లో భాగంగా గత ఏడాది నీటిని వదిలిపెట్టగా, కొంతమేరకు సిద్ధిపేట ప్రాంతంలో ఆయకట్టు భూములకు సాగునీటిని కూడా విడుదల చేశారు. ఈ ఏడాది ఆ రిజర్వాయర్లకు 70టీఎంసీలకు పైగా నీటిని వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. అవసరమైతే సింగూర్‌, నిజాంసాగర్‌ రిజర్వాయర్లకు కూడా నీటిని సరఫరా చేయనున్నారు. అందుకే సీజన్‌ ప్రారంభం నుంచే మోటార్లను ప్రారంభించి రోజుకు 2టీఎంసీల చొప్పున నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఒక్కటొక్కటిగా పంప్‌లను నడిపిస్తున్నారు. 

నిర్విరామంగా నడవనున్న మోటార్లు..

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇక నుంచి నిర్విరామంగా మోటార్లను నడిపి నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. 2019 నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి అదే ఏడాది నుంచి ఎత్తిపోతలను ప్రారంభించారు. గత ఏడాది దాకా మిడ్‌మానేరు వరకే నీటిని ఎత్తిపోశారు. మొదటి ఏడాది 66 టీఎంసీలు, గత ఏడాది 33 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. మొదటి ఏడాది 66 టీఎంసీల నీటిని ఎత్తిపోసినందుకు 1906.59 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగం కాగా, దీనికి రూ.1105.82 కోట్ల కరెంట్‌ బిల్లు వచ్చింది. గత ఏడాది 33 టీఎంసీల నీటిని ఎత్తిపోసినందుకు 1697.88 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌కు రూ.984.77 కోట్లు, మొత్తం 3604.49 మిలియన్‌ యూనిట్లకు రూ.2070 కోట్ల కరెంట్‌ బిల్లు రావడం గమనార్హం. ఈ ఏడాది 120 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రూ.2250 విద్యుత్‌ బిల్లు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వారం రోజుల క్రితమే రాష్ట్రంలోకి నైరుతి పవనాలు ప్రవేశించడంతో గోదావరి, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ భాగానగల బాబ్లీ ప్రాజెక్టు నిండి గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లిలోకి కూడా వరద వస్తున్నది. ప్రాణహిత నది గుండా 51వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. అన్నారం బ్యారేజీలోకి మానేరు గుండా వరద వస్తున్నది. సాధ్యమైనంత వరకు ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు, అక్కడినుంచి కొండమ్మ పోచమ్మ వరకు నీటిని తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి ఎల్‌ఎండీలో 24 టీఎంసీలకు గాను 10.43 టీఎంసీల నీళ్లు ఉన్నందున ఈ నీళ్లు ప్రస్తుతానికి వరి నాట్లు వేసేందుకు సరిపోతాయని, ఆలోపు వర్షాల వల్ల కొంత వరద రావచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురిసే వర్షాలను బట్టి కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీలోకి పునరుజ్జీవ పథకం ద్వారా ఎత్తిపోయనున్నారు. ముందుగా కొండపోచమ్మ వరకు గల అన్ని రిజర్వాయర్లను నింపేందుకు పంపులను ప్రారంభించారు. 

Updated Date - 2021-06-18T05:17:17+05:30 IST