ధ్యానం అంటే...

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

గుటై యిష్షీ క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దానికి చెందిన జెన్‌ గురువు. అతను చైనాకు చెందినవాడు కాబట్టి ‘చాన్‌ గురువు’ అని కూడా అనవచ్చు..

ధ్యానం అంటే...

గుటై యిష్షీ క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దానికి చెందిన జెన్‌ గురువు. అతను చైనాకు చెందినవాడు కాబట్టి ‘చాన్‌ గురువు’ అని కూడా అనవచ్చు. ‘ధ్యాన్‌’ అనే మాటను చైనాలో ‘చాన్‌’గానూ, జపాన్‌లో ‘జెన్‌’గానూ పలుకుతారు. ఎక్కడ ఏ విధంగా పిలిచినా ఇదంతా గౌతమ బుద్ధుడి ధ్యాన పద్ధతుల గురించి వివరించేదే. బోధి ధర్మ తరువాతి గురువు గుటై యిష్షీ. అతను బాల్యం నుంచీ ఆధ్యాత్మిక చింతన కలిగినవాడు. మిగిలిన పిల్లల్లా కాకుండా... ఎప్పుడూ ఏకాంతంగా, మౌనంగా కూర్చొని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఊరికి దూరంగా... కొండల్లో ధ్యానం చేస్తూ, బుద్ధుని సూత్రాలను వల్లె వేస్తూ గంటలకు గంటలు గడిపేవాడు. పరిసరాలను మరచిపోయేవాడు. తిండి మీద కూడా ధ్యాస ఉండేది కాదు. ఎప్పుడు తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో, ఏం చేస్తూ ఉంటాడో ఎవరికీ తెలిసేది కాదు.


ఒకసారి గుటై ఒక పర్వత ప్రాంతంలో బుద్ధుని సూత్రాలను పఠిస్తూ, సంచరిస్తున్నప్పుడు... ఒక యువ సన్యాసిని వచ్చి అతణ్ణి కలిసింది. ‘‘ధ్యానం గురించి ఒక్క మాటలో చెప్పు చూద్దాం’’ అని సవాలు విసిరింది. ఆమెకు సరైన సమాధానం చెప్పలేక గుటై యిష్షీ  తల దించుకున్నాడు. 


‘‘కొండల్లో, కోనల్లో ఉంటూ ధ్యానం చేస్తున్నావనీ, కనుక నీకు తెలిసే ఉంటుందనీ గంపెడాశతో వచ్చాను. కానీ నీకేం తెలియదని తేలిపోయింది’’ అంటూ ఆమె వెళ్ళిపోయింది.

‘అవును... గంటలకు గంటలు ఈ అడవుల్లో, ఈ గుట్టల్లో ఒంటరిగా తిరుగుతూ, కళ్ళు మూసుకొని కొంతసేపు, కళ్ళు తెరిచి కొంతసేపు కూర్చొని... నేను తెలుసుకున్నదేమిటి? ఎందుకు ఆమెకు ఏమీ చెప్పలేకపోయాను?’’ అని ఆశ్చర్యపోయాడు గుటై. ఆ విషయం గురించే మధనపడ్డాడు. 


కొంతకాలం తరువాత అతని గురువు కోషు టెన్ర్యూ అక్కడికి వచ్చాడు. గుటై యిష్షీ  చాలా వినయంగా... తనకూ, ఆ యువ సన్యాసినికి మధ్య జరిగిన విషయాన్ని వివరించి, ‘‘మహాశయా! ధ్యానాన్ని ఒక్క మాటలో చెప్పడం ఏమిటి? ఎలా?’’ అని ప్రశ్నించాడు. గురువు ఏం చెబుతారో, ఎలా చెబుతారో అని తదేకంగా ఆయననే చూస్తున్నాడు. అతని శరీరంలో అణువణువూ జాగృతమై ఉంది. 


కొషు టెన్ర్యూ తన చేతి వేలు ఒకదాన్ని పైకెత్తి చూపించి, అక్కడి నుంచీ వెళ్ళిపోయాడు. అంతే! ఆ చర్యతో గుటై యిష్షీకు జ్ఞానోదయం అయింది. ఆ తరువాత అతని జీవితం, మాట తీరు, నడత అన్నీ ఊహించలేని విధంగా మారిపోయాయి. ఎందరెందరో అతని పట్ల ఆకర్షితులయ్యారు.

 

ఽ‘‘ద్యానం అంటే ఏమిటి?’’ అని అని ఎవరైనా ఆయనను అడిగితే, ఒక వేలును పైకెత్తి చూపించేవాడు. అతని పేరు గుటై. కానీ అందరూ ‘గుటై యిష్షీ’ అని పిలిచేవారు. అంటే ‘ఒంటి వేలు గుటై’ అని అర్థం. ఆ ఒంటి వేలు జెన్‌ గురించి, ధ్యానానికి ఆయన ఇచ్చిన నిర్వచనం గురించి ఎంతో చర్చ జరిగింది. ‘‘ఏకం, నిత్యం, విమలం, అచలంగా ఉండడమే ధ్యానం’ అనే నిర్వచనాన్ని గుటై యిష్షీ మార్గాన్ని అధ్యయనం చేసినవారు ప్రతిపాదించారు.

  రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST