కరోనాను ఆమె ఎలా జయించిందంటే...

ABN , First Publish Date - 2020-03-20T14:47:59+05:30 IST

కొవిద్‌-19 (కరోనా)... ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్‌ ఇప్పటికే చాలామందిని పొట్టనబెట్టుకుంది. వేల మంది ఐసొలేషన్‌ సెంటర్లలో ప్రత్యేక చికిత్స పొందుతున్నారు.

కరోనాను ఆమె ఎలా జయించిందంటే...

కొవిద్‌-19 (కరోనా)... ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్‌ ఇప్పటికే చాలామందిని పొట్టనబెట్టుకుంది. వేల మంది ఐసొలేషన్‌ సెంటర్లలో ప్రత్యేక చికిత్స పొందుతున్నారు. అలాంటి ప్రమాదకర వైరస్‌ను ఓడించింది అమెరికాకు చెందిన 37 ఏళ్ల ఎలిజబెత్‌ ష్నీడర్‌. చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరిన ఆమె ప్రజలకు ఒక నమ్మకం ఇవ్వాలనే ఆలోచనతో తన అనుభవాలను ఫేస్‌బుక్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. కరోనా వైరస్‌ను తను ఎలా జయించిందంటే...


‘‘మేము ఉండేది వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో. నేను బయో టెక్నాలజీ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా చేస్తున్నా. ఫిబ్రవరి 22న ఒకరింట్లో జరిగిన చిన్నపార్టీకి హాజరయ్యా. ఫిబ్రవరి 25వ తేదీన నేను జలుబు, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులతో బాధపడ్డా. అయితే ఎప్పుడోసారి అలానే ఉంటుంది అనుకొని ఆఫీసుకు వెళ్లాను. ఆ వారం అంతా ఆఫీసు పనితో బిజీగా ఉండిపోయా. ఒకరోజు మధ్యాహ్నం తలనొప్పి మొదలైంది. దాంతోనే జ్వరం, ఒళ్లు నొప్పులు పెరిగాయి. దాంతో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసి కొద్ది సేపు నిద్రపోయా. లేచి చూసేసరికి ఒళ్లు మరీ వేడెక్కింది. 103 డిగ్రీల జ్వరం. తెలియకుండానే వణుకు రావడం మొదలైంది. దాంతో మందులు తెప్పించుకొని వేసుకున్నా. జ్వరం మరీ ఎక్కువైతే నన్ను ఎమర్జెన్సీ రూమ్‌లోకి తీసుకెళుతుందని నా స్నేహితురాలికి ఫోన్‌చేశాను. కానీ జ్వరం మెల్లగా తగ్గడంతో హమ్మయ్య అనకున్నా. మరుసటి రోజు కరోనా వైరస్‌ గురించి, అది సోకిన వారిలో కనిపించే లక్షణాల గురించి వార్తాపత్రికల్లో చదివా. అయితే నాకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు వంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో నాకేం కాలేదు. అయినా నాకెందుకు ఆ వైరస్‌ వస్తుంది అనుకున్నా. అంతేకాదు డాక్టర్‌ వద్దకు వెళితే ఇంటికి వెళ్లి పండ్ల రసాలు ఎక్కువగా తాగు అని చెబుతారు అంతే అని భావించాను.


ఆ విధంగా...

తరువాత ఒక రోజు ఫేస్‌బుక్‌లో మా ఫ్రెండ్‌ పెట్టిన పోస్ట్‌ చూశా. ఆరోజు పార్టీకి వచ్చిన 40 శాతం మందికి నాలానే జ్వరం, తలనొప్పి వచ్చాయని తెలిసింది. దాంతో నాలోనూ భయం మొదలైంది. వెంటనే మా దగ్గర్లోని స్టడీ సెంటర్లో నాజల్‌ స్వాబ్‌ కిట్‌ తెచ్చుకొని శాంపిల్‌ పంపించా. కోవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. అమ్మకు చెబితే ఆమె ఒక్కసారిగా ఏడ్చేసింది. స్థానికంగా ఉన్న ఆరోగ్యశాఖ అధికారులు నన్ను వారం రోజులు ఇంటిపట్టునే ఉండమన్నారు. దాంతో ఇంటి నుంచే ఆఫీస్‌ పని చేసేదాన్ని. చికిత్స, వైద్యుల సూచనలతో నేను ఇప్పుడు కరోనా వైరస్‌ నుంచి బయటపడ్డా. అందరికి నేను చెప్పేది ఒక్కటే.... ఆందోళన పడకండి. మీరు ఆరోగ్యంగా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోండి.  కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్‌ చేయించుకోండి. ఇంట్లోనే ఉండండి. మందులు టైమ్‌కు వేసుకోండి. తొందరగా కోలుకుంటారు.


మీ వయసును బట్టి కూడా కోవిడ్‌-19 వైరస్‌ రకరకాల లక్షణాలతో బయటపడుతుంది. ఆ రోజు పార్టీకి వచ్చిన వాళ్లు 40, 50 ఏళ్ల మధ్యలో ఉంటారు. నేను 30ల్లో ఉన్నాను కాబట్టి తొందరగా కోలుకున్నా. వైరస్‌ సోకగానే మొదటి మూడు రోజులు తలనొప్పి, జ్వరం (తొలి మూడు రోజులు అదేపనిగా, ఆతర్వాత వస్తూ పోతూ), ఒళ్లునొప్పులతో బాధపడ్డా. కొందరికి విరోచనాలు కూడా అయ్యాయట. దగ్గు, జలుబుతో గొంతునొప్పి, శ్వాస పీల్చుకోవడం కష్టం అవుతుంది. జ్వరం లక్షణాలు 10-16 రోజుల పాటు ఉంటాయి. చాలామంది దగ్గు ఉంటే పరీక్షలు చేయించుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. నేను త్వరగా స్పందించడంతో నా శాంపిల్స్‌ను దగ్గర్లోని ‘కింగ్‌ కౌంటీ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌’కు పంపారు. అక్కడే నాకు కరోనా ఉందని తేలింది. 7 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండమన్నారు. డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ నెమ్మది నెమ్మదిగా వైరస్‌ బారి నుంచి సురక్షితంగా బయటపడ్డాను. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో నా అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో పెడితే అందరికీ ఉపయోగపడుతుందని నా స్నేహితులు కోరడంతో పోస్ట్‌ చేశాను. కరోనా లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పరీక్షలు చేయించుకోండి. లేదంటే కరోనాను వ్యాప్తి చేసినవారవుతారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’’. 

Updated Date - 2020-03-20T14:47:59+05:30 IST