Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా రోగిని ఇలా మోసుకుంటూ వెళ్లిన 24 ఏళ్ల ఈ మహిళ కథేంటో తెలిస్తే..

‘ఈ కష్టకాలంలో ఒకరికొకరు సాయంగా ఉండాలి. మీ తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, చివరకు ముక్కూ ముఖం తెలియని వారే కావచ్చు, ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా ఉండి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన సమయం ఇది’ అంటూ ఓ 24 ఏళ్ల వివాహిత సందేశమిస్తోంది. ఇంత మంచి మాటలు చెబుతున్న ఆమె ఏమీ పెద్దగా చదువుకోలేదు. ఏ జిల్లా కలెక్టరో, ప్రభుత్వ ఉన్నతోద్యోగో కూడా కాదు. రాజకీయ నాయకురాలు అంత కంటే కాదు. అస్సాం రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ సామాన్య మధ్య తరగతి గృహిణి. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె అనుకోకుండా చేసిన ఓ పనికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట హల్ చల్ చేయడంతో ఆమె వార్తల్లోకెక్కింది. మీడియా చానెళ్లన్నీ ఆమె ఇంటర్వ్యూలకు ఎగబడ్డాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే..


అస్సాం రాష్ట్రంలోని నగోన్ నగరం పరిధిలిలోని భాటీగాన్ గ్రామానికి చెందిన నిహారికా దాస్ అనే 24 ఏళ్ల వివాహిత కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా వేరే నగరంలో నివసిస్తున్నాడు. ఆరేళ్ల కొడుకుతో పాటు 75 ఏళ్ల మామయ్య తులేశ్వర్ దాస్‌ యోగక్షేమాలను నీహారిక చూసుకుంటూ ఉంటోంది. అయితే కరోనా మహమ్మారి ఆ ఇంటిని కూడా వదిలి పెట్టలేదు. కొద్ది రోజులుగా తులేశ్వర్ దాస్ కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో అతడిని తన ఇంటికి కాస్త దగ్గరలో ఉన్న హెల్త్ కేర్ సెంటర్‌కు తీసుకుని పరీక్షలు చేయించాలని నీహారిక భావించింది. ఓ ఆటోను పిలిచింది. ఇంటి ముందు ఉన్న రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఆటో లోపలకు రాలేకపోయింది. కనీసం నిలబడటానికి కూడా తులేశ్వర్ దాస్‌కు ఓపిక లేదు. సాయం పట్టడానికి కూడా ఎవరూ రాలేదు. దీంతో ఆమె ఓ నిర్ణయానికి వచ్చేసింది. 

తన మామయ్యను వీపు మీద మోసుకుంటూ హెల్త్ కేర్ సెంటర్‌కు తీసుకుని వెళ్లింది. ఆమె అలా తన మామయ్యను మోసుకొస్తున్న దృశ్యాన్ని చూసి అంతా షాకయ్యారు. అతడి పరిస్థితిని పరీక్షించిన హెల్త్ వర్కర్లు పరిస్థితి విషమంగా ఉందని తేల్చారు. 21  కిలోమీటర్ల దూరంలో ఉన్న నగౌన్‌లోని కొవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లమని రిఫర్ చేశారు. ఓ ప్రైవేటు వాహనం ద్వారా ఆ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అయితే ఆ ఆసుపత్రిలో కనీసం స్ట్రెచర్ కూడా లేదు. సాయం పట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె తన భుజానికి పని చెప్పింది. తన మామయ్యను వీపుపై మోసుకుంటూ ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లింది. అయితే అక్కడ ఖాళీలు లేవని చెప్పి.. నగౌన్‌లోనే సివిల్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ కూడా అదే సీన్ రిపీట్ అయింది. చివరకు ఎలాగోలా తులేశ్వర్ దాస్‌కు ఆ ఆసుపత్రిలో బెడ్ దొరికింది. ఈ ఘటన జూన్ 2వ తారీఖున జరిగింది. 


ఆమె తన మామయ్యను వీపుపై మోసుకెళ్తున్న దృశ్యాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫొటో తీశారు. దాన్ని కాస్తా సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ‘ఓ కరోనా రోగిని అలా మోసుకుంటూ వెళ్లాలంటే బలమే కాదు, మనోబలం కూడా కావాలి. స్త్రీ శక్తికి ఈ ఫొటోయే నిదర్శనం. స్త్రీ జాతికి ఆమె ఓ ఆదర్శం’ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నెట్టింట ఆమె ఫొటోలు వైరల్ అవడంతో మీడియా చానెళ్లు ఆమె ఇంటర్వ్యూ కోసం క్యూ కట్టాయి. ‘నేనేమీ కావాలని ఈ పనిని చేయలేదు. చుట్టూ అందరూ ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు.ఆ రోజు మొత్తం మీద నేను నా మామయ్యను రెండు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లా. జాలిపడుతూ చూస్తూ ఊరుకున్నారే కానీ, సాయంగా తోడు రాలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా ఉండకూడదు. ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ముక్కూముఖం తెలియని వాళ్లయినా సరే సాయం చేయడానికి ముందుకు రావాలి’ అని నీహారిక చెప్పుకొచ్చింది. కాగా, కరోనా బారిన పడిన తన మామయ్యకు అత్యంత తగ్గరగా మెలగడంతో నీహారిక కూడా కొవిడ్ బారిన పడింది. ఆమెకు కూడా కరోనా పాజిటివ్ అని టెస్టుల్లో తేలింది. ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement