సిద్ధూ-సీఎం భేటీ.. సమస్యలన్నీ పరిష్కారం!

ABN , First Publish Date - 2021-10-01T02:17:51+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్ని

సిద్ధూ-సీఎం భేటీ.. సమస్యలన్నీ పరిష్కారం!

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్ని మధ్య జరిగిన సమావేశం ముగిసింది. చండీగఢ్‌లోని పంజాబ్ భవన్‌లో ఇద్దరి మధ్య జరిగిన ‘చర్చలు’ సఫలమైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ‘సమస్యలు మొత్తం’ పరిష్కారమైనట్టు వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి. సమావేశానికి ముందు సిద్ధు మాట్లాడుతూ.. ఎలాంటి చర్చలకైనా తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 


కాగా, పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లో ఉండబోనని, అలాగని బీజేపీతో చేతులు కలపబోనని స్పష్టం చేశారు.


మరోవైపు, పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంపై పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జఖర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అధికారాన్ని అణగదొక్కేందుకు పదేపదే చేస్తున్న ప్రయత్నాలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఏజీ, డీజీపీ వంటి ఉన్నతాధికారుల ఎంపిక విషయంలో ఆరోపణలు సరికాదని సిద్ధూను ఉద్దేశించి అన్నారు. 


Updated Date - 2021-10-01T02:17:51+05:30 IST