11న కలెక్టర్లతో భేటీ

ABN , First Publish Date - 2021-01-09T07:21:10+05:30 IST

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఈ నెల 11న కలెక్టర్లతో కీలక భేటీ జరగనుంది. ప్రగతి భవన్‌లో నిర్వహించనున్న సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నారు

11న కలెక్టర్లతో భేటీ

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సమావేశం

పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం

పార్ట్‌-బీ, సాదాబైనామాలపై దిశానిర్దేశం

వ్యాక్సిన్‌ పంపిణీపైనా చర్చించే అవకాశం


హైదరాబాద్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఈ నెల 11న కలెక్టర్లతో కీలక భేటీ జరగనుంది. ప్రగతి భవన్‌లో నిర్వహించనున్న సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నారు. రెవెన్యూ, విద్యాశాఖ, పంచాయతీ, మునిసిపల్‌, వైద్య ఆరోగ్య, అటవీ, ఇతర శాఖలకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి.. తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ఇటీవల ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సీనియర్‌ అధికారులు, కొందరు కలెక్టర్లతో సమావేశంనిర్వహించారు. ఆ సమావేశంలో రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 11వ తేదీన జరిగే సమావేశంలో వీటిపై కూలంకషంగా చర్చించనున్నారు. పెండింగ్‌ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీరణ, కలెక్టర్ల నేతృత్వంలో ట్రైబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్‌-బీలో చేర్చిన వివాదాస్పద భూములను ఏవిధంగా పరిష్కరించాలనే అంశంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.


ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పార్ట్‌-బీలో ఏయే భూములున్నాయి? వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే అంశంపై సీఎంవో ప్రత్యేక అధికారి రామయ్య సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించారు. దాని ఆధారంగానే ఇటీవల కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం చర్చలు జరిపారు. ఇక, సాదా బైనామాల క్రమబద్ధీకరణ విషయంలోనూ సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పార్ట్‌-బీ భూములు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ అంశాలపై మార్గదర్శకాల ముసాయిదా సిద్ధమైంది. సీఎంవో కార్యదర్శి వి.శేషాద్రి నేతృత్వంలో ముసాయిదాను సిద్ధం చేసి, మార్పులు చేర్పులు చేశారు.


దీన్ని సీఎంకు నివేదించి.. ఆయన ఆమోదం మేరకు 11న జరిగే కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ల చేతికి అందించనున్నారు. కాగా, రాష్ట్రంలోవి విద్యాసంస్థలను పునఃప్రారంభించే విషయమై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించే కార్యాచరణపైనా చర్చించే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్‌ను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తారు. దాంతో పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలును సమీక్షిస్తారు. సమావేశానికి కలెక్టర్లు, అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని సీఎం ఆదేశించారు.

Updated Date - 2021-01-09T07:21:10+05:30 IST