కొణిదెల వారి ఆడబడుచు.. నిహారికకు శుభాకాంక్షలు: చిరు

కొణిదెల వారి ఆడబడుచు నిహారికకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రత్యేకంగా నిహారికని చిరు అలా సంభోధించటం చూసిన ఎవరైనా.. ఆమె ఏమైనా గుడ్ న్యూస్ చెప్పిందేమో.. అందుకే అలా చిరు శుభాకాంక్షలు తెలిపి ఉంటారని అనుకుంటారు. అయితే ఇక్కడ విషయం మాత్రం అది కాదు. నిహారిక నిర్మాతగా నిర్మించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్‌ని వీక్షించిన చిరు.. ఎంతో వినోదాత్మకంగా ఉందంటూ నిహారికకి, వెబ్ సిరీస్ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా.. పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంపై మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ‘జీ 5’‌ ఓటీటీలో నవంబర్ 19న విడుదలై సక్సెస్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌ను మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఆయనతో కలిసి మానసా శర్మ కథ, మాటలు అందించారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్‌ని చూసిన చిరంజీవి.. తన ట్విట్టర్ వేదికగా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూశాను. ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. నిర్మాణంలో తన తొలి ప్రయత్నంలోనే ఇంత హృద్యంగా, వినోదాత్మకంగా తీసి ప్రేక్షకులని మెప్పిస్తున్న కొణిదెల వారి ఆడబడుచు నిహారికకి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టీమ్ అందరికీ నా అభినందనలు. మీరిచ్చిన ఈ స్పూర్తితో తను మరిన్ని జనరంజకమైన చిత్రాలను నిర్మించాలని కోరుకుంటూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ సిరీస్‌కు ఇప్పటి వరకు 6 కోట్ల నిమిషాల వ్యూస్ వచ్చినట్లుగానూ, ‘జీ 5’‌లో పెద్ద హిట్ అయినట్లుగా ‘జీ 5’‌ వర్గాలు వెల్లడించాయి.   


Advertisement