దేశీయ పరిజ్ఞానంతో మేఘా రిగ్గులు

ABN , First Publish Date - 2021-04-08T06:09:04+05:30 IST

తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో చమురు, గ్యాస్‌ రిగ్‌లను మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) తయారు చేసింది

దేశీయ పరిజ్ఞానంతో మేఘా రిగ్గులు

ఓఎన్‌జీసీ నుంచి 47 రిగ్గులకు ఆర్డర్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో చమురు, గ్యాస్‌ రిగ్‌లను మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) తయారు చేసింది. అత్యాధునిక హైడ్రాలిక్‌ టెక్నాలజీతో రిగ్గులను రూపొందించామని.. దేశీయంగా ప్రైవేటు రంగంలో రిగ్గులను మొదటి సారి తయారు చేసిన ఘనత తమకే దక్కుతుందని ఎంఈఐఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి. రాజేశ్‌ రెడ్డి తెలిపారు. 1500-2000 హెచ్‌పీ వరకూ సామర్థ్యం కలిగిన ఈ రిగ్గులు సులభంగా 4,000-6,000 మీటర్ల లోతు చమురు బావులను తవ్వగలవు. గుజరాత్‌లోని కలోల్‌ చమురు క్షేత్రంలో తొలి రిగ్గు బుధవారం కార్యకలాపాలను ప్రారంభించింది. 47 డ్రిల్లింగ్‌ రిగ్గులను సరఫరా చేయడానికి 2019లో ఓఎన్‌జీసీ నుంచి రూ.6,000 కోట్ల విలువైన ఆర్డర్‌ను టెండర్‌ ద్వారా ఎంఈఐఎల్‌ దక్కించుకుంది. ఈ ఆర్డర్‌లో భాగంగా మొదటి రిగ్‌ను సరఫరా చేసింది. మిగిలిన 46 రిగ్గుల తయారీ వివిధ దశల్లో ఉన్నాయని.. ప్రైవేటు రంగంలో ఇంత భారీ స్థాయిలో రిగ్గులను తయారు చేయడం ఇదే మొదటి సారని రాజేశ్‌ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం వద్ద ఉన్న చమురు క్షేత్రాల్లో రెండు రిగ్గులు అసెంబ్లింగ్‌ దశలో ఉన్నట్లు తెలిపింది. 

Updated Date - 2021-04-08T06:09:04+05:30 IST