కశ్మీరు ఓ ఆరుబయలు జైలు : మెహబూబా ముఫ్తీ

ABN , First Publish Date - 2021-05-17T01:36:07+05:30 IST

పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కశ్మీరును ఆరుబయలు

కశ్మీరు ఓ ఆరుబయలు జైలు : మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్ : పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కశ్మీరును ఆరుబయలు జైలుగా అభివర్ణించారు. కశ్మీరు ప్రజల ఆలోచనలు పర్యవేక్షణకు గురవుతున్నాయని, ఆలోచనలను వ్యక్తం చేసినవారిని శిక్షిస్తున్నారని ఆరోపించారు. పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించడం నేరం కాదన్నారు. కశ్మీరులో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలపై ప్రభుత్వం విరుచుకుపడుతుండటాన్ని తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆమె ట్విటర్ వేదికగా ఈ ఆరోపణలు చేశారు. 


అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి కనీసం ఒక వేదిక అయినా లేకుండా చేశారని, కశ్మీరీలను అణచివేయడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా జరుగుతోందని ఆరోపించారు. కశ్మీరీ ఆర్టిస్ట్ ముదసిర్ గుల్, దక్షిణ షోపియాన్ జిల్లాకు చెందిన ముస్లిం మత పెద్ద సర్జన్ బర్కతిల అరెస్టును ఖండించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ అరాచకాలను ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఖండిస్తున్నారని గుర్తు చేశారు. కశ్మీరులో ఇది శిక్షించదగిన నేరం అయిపోయిందన్నారు. ప్రజా భద్రత చట్టం క్రింద ఓ ఆర్టిస్ట్‌పై కేసు పెట్టారని, పాలస్తీనాకు మద్దతిచ్చినందుకు ఓ మత బోధకుడిని అరెస్టు చేశారని మండిపడ్డారు.


‘‘మేము పాలస్తానీవారం’’ అంటూ రాసినందుకు ముదసిర్ గుల్‌ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించినందుకు బర్కతిని అరెస్టు చేశారు. బర్కతి భారత వ్యతిరేక ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట. గతంలో ఆయనను అరెస్టు చేశారు. 2020 అక్టోబరులో జైలు నుంచి విడుదలయ్యారు. 


ఇదిలావుండగా, ప్రజల ఆగ్రహాన్ని సొమ్ము చేసుకుని, హింసను ప్రేరేపించేందుకు ఎవరినీ అనుమతించబోమని జమ్మూ-కశ్మీరు పోలీసులు స్పష్టం చేశారు. 


Updated Date - 2021-05-17T01:36:07+05:30 IST