మేలుకో కృష్ణయ్య... ఏలుకోవయ్యా!

ABN , First Publish Date - 2021-12-31T05:40:54+05:30 IST

కరుణాంతరంగుడైన శ్రీరంగనాథుడి అనుగ్రహాన్ని కోరుకుంటూ ధనుర్మాస వ్రతాన్ని చేపట్టిన గోదాదేవి... ఆ స్వామి గొప్పతనాన్ని పాశురాల్లో ఆలపిస్తూ...

మేలుకో కృష్ణయ్య... ఏలుకోవయ్యా!

కరుణాంతరంగుడైన శ్రీరంగనాథుడి అనుగ్రహాన్ని కోరుకుంటూ ధనుర్మాస వ్రతాన్ని చేపట్టిన గోదాదేవి... ఆ స్వామి గొప్పతనాన్ని పాశురాల్లో ఆలపిస్తూ... గోపికలను మేలుకొలుపుతోంది. వ్రతానికి వారిని సమాయత్తం చేస్తోంది. గత వారాల్లో పదిహేను పాశురాల విశేషాలు తెలుసుకున్నాం. పది మంది గోపికలను మేలుకొలిపిన గోదాదేవి... పదహారో పాశురంలో నందగోపుని నివాసానికి గోపికలతో సహా చేరుకుంది. స్వామిని దర్శించుకోవడం కోసం భవన ద్వారాలు తెరవాలని ద్వారపాలకులను ఆమె కోరింది. స్వయంగా శ్రీకృష్ణుడు తమకు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే... ఆ స్వామిని మేల్కొలపడానికి వచ్చామనీ, కాబట్టి ద్వారాలు తెరిచి, తమను లోపలికి పంపాలనీ వేడుకుంది. పదిహేడో పాశురంలో... భవనంలోకి గోపికలు ప్రవేశించారు. స్వామి గొప్పతనాన్ని కొనియాడారు. ఆయనను మేల్కొలిపే ప్రయత్నం చేస్తూ... ‘‘మూడు లోకాలూ కొలిచే దేవా! మొద్దు నిద్దుర వదిలి మేలుకో స్వామీ!’’ అని ప్రార్థించారు. స్వామికి ఇష్టురాలైన నీళాదేవిని పద్ధెనిమిదో పాశురంలో కొనియాడుతూ, ‘‘నీ మేనత్త కొడుకైన శ్రీ కృష్ణుణ్ణి మేల్కొలపడానికి ఇక్కడకు వచ్చాం.


తలుపు తియ్యవమ్మా! ’’ అని కోరారు. పంతొమ్మిదో పాశురంలో శ్రీకృష్ణుడి మాయలను వర్ణిస్తూ... ఆయనను, నీళాదేవినీ ఎలాగైనా మేల్కొలపాలని గట్టి సంకల్సం చేసుకున్నారు. చివరకు, ‘‘నీ పతిదేవుణ్ణి మాకోసం ఒక్క క్షణం విడిచిపెట్టవచ్చు కదా!’’ అని నీళాదేవిపై నిష్టూరాలు ఆడారు. ఆపదల్లో ఉన్న దేవతలను స్వామి ఏ విధంగా కాపాడారో ఇరవయ్యో పాశురంలో గోదాదేవి వర్ణిస్తూ... అంతటి గొప్పవాడైన స్వామిని చూసే అవకాశం మాకు కల్పించడానికి నిద్దుర నుంచి మేలుకో అని నీళాదేవిని కోరింది. ఇరవయ్యొకటో పాశురంలో... నీళాదేవి కటాక్షంతో తెరుచుకున్న శయనమందిరంలో శ్రీకృష్ణుణ్ణి గోదాదేవి, గోపికలు దర్శించుకున్నారు. ఆదమరచి నిదురపోతున్న స్వామిని మేల్కొలిపి, ప్రసన్నం చేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. ‘‘అందరికీ ప్రభువువు నువ్వే. ఈ భూమి మీద పేదలైనా, రాజులైనా నువ్వే దిక్కంటూ నీ దగ్గరకే చేరుతారు. ఆడువారిమైన మేము కూడా నీ సన్నిధికే చేరుకున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరువు. మమ్మిల్ని అనుగ్రహించు’’ అని ఇరవై రెండో పాశురంలో శ్రీకృష్ణుణ్ణి గోదాదేవి ప్రార్థించింది.

Updated Date - 2021-12-31T05:40:54+05:30 IST