దేవుడు మనుషుల్ని మళ్లీ మోసం చేశాడు!

ABN , First Publish Date - 2020-09-30T06:03:39+05:30 IST

అమర గాయకుడు ఘంటసాల అంటే బాలుకు గురుభక్తి. ‘‘ ఆయన గాన సముద్రుడు. ఇక ఎవ్వరు పాడినా - అది ఆయన పద్ధతిలో సాగవలసినదే కాని, అంతకు అతీతము కాజాలదు. మిగిలిన గానవాహినులు, గాన సరస్సులు ఆయనలో లీనము కావలసినవే..’’...

దేవుడు మనుషుల్ని మళ్లీ మోసం చేశాడు!

అమర గాయకుడు ఘంటసాల అంటే బాలుకు గురుభక్తి. ‘‘ ఆయన గాన సముద్రుడు. ఇక ఎవ్వరు పాడినా - అది ఆయన పద్ధతిలో సాగవలసినదే కాని, అంతకు అతీతము కాజాలదు. మిగిలిన గానవాహినులు, గాన సరస్సులు ఆయనలో లీనము కావలసినవే..’’ అనే బాలుపై ఘంటసాల మరణం తీవ్రమైన ప్రభావం చూపించింది.


తన మనుసులోని భావాలను గుదిగుచ్చి ‘‘దేవుడు మనుషుల్ని మళ్లీ మోసం చేశాడు’’ అనే ఒక కవిత రాశారు. 1974లో ఆంధ్రప్రభలో ప్రచురితమయిన ఆ కవితను చదవితే వర్తమానంలో అనేక మంది హృదయాలు ఇలాగే శోకిస్తున్నాయా అనిపిస్తుంది. 


ఆ నాడు బాలు రాసిన కవిత నవ్య పాఠకుల కోసం..  

‘‘ఘంటసాల సంగీతానికి ప్రతి రూపం. ఒక ప్రక్రియ. సంగీత గగనంలో ఆయన ధ్రువతార. ఆయన స్థానం అద్వితీయమైనది. అనితర సులభమైనది. ఘంటసాల గారితో నా పరిచయం ఎన్ని జన్మాల పుణ్యఫలమో చెప్పలేను. చాలామంది మా ఇద్దరి మధ్య గాఢమైన విరోధం ఉందనీ మాకు ఒకరినొకరిని చూస్తే పడదనీ అనుకుంటుండగా విన్నాను. ఆ మాటలు నూరుపాళ్లు అబద్ధాలు. ఆయన గళం ఆలపించని రాగం లేదు. ఆ గళం ఒప్పించని భావం లేదు. కవికలానికి తన గళాన్ని మేళవించి సుందరమైన పదాల అల్లికను, మధుమధుర గీతవల్లికగా మార్చేయగల ఆయన ప్రతిభ అనన్యసామాన్యం. ఆయన సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం నాకు ‘‘ఆలీబాబా నలబై దొంగలు’’ చిత్రంలో కలిగింది.


‘‘పొట్టి పొట్టి రైకదానా’’ అని కుమారి ఎల్‌. ఆర్‌. ఈశ్వరితో పాడిన పాట. ‘‘భామలో చందమామలో’’ అని శ్రీ మాస్టారితోను, కుమారి ఎల్‌. ఆర్‌. ఈశ్వరితోను నేను పాడిన పాట నేను ఏ నాటికీ మరచిపోలేను. ఆ గంధర్వ స్వరం తెలుగుజాతికే వరం. ఆ గానానుభూతి అజరామరం. ధూళివరకూ శిరసు వాల్చి నమస్కరించడం కన్నా ఆయనకు నేను చేయగల జోత మరేదీ ఉండదనుకుంటాను. 

(‘‘తొలినాళ్లలో’’ అనే శీర్షికతో ప్రచురిత మయిన ఇంటర్వ్యూలో ఘంటసాల గురించి బాలు మనోగతం)

సేకరణ: డా. గోపాలకృష్ణ




‘‘దేవుడు మనుషుల్ని మళ్లీ మోసం చేశాడు

దివిలో గంధర్వగానం వెగటేసిందట

మన మాస్టారి గానంపై మనసైన దేవుడు

మనల్ని మళ్లీ మోసం చేశాడు

మళ్లీ మాస్టార్ని ఎత్తుకుపోయాడు

దివి నుండి భువికి దిగి వచ్చిన గంధర్వ పారిజాతం 

నేడు గగన కుసుమమయింది ఏం?

త్యాగరాజు, తాన్‌సేన్‌లు నాకలోకంలో మూగబోయారా? 

మా గానరాజును పట్టుకెళ్లావ్‌? 

ఇన్ని కోట్లమంది ఉసురు నీకు తగలకపోతుందా? 

ఏం విధాతవయితే ఏం?

నీ తలరాత అదే అయినప్పుడు నువ్వు మాత్రం ఏం చెయ్యగలవ్‌? 

మాస్టారూ! మీరు దేశాన్ని సంగీతమయం చేయాలనుకున్నారు పాటల బడి పెట్టాలనుకున్నారు. 

మరి ఇన్ని కోట్ల మందిని మూగవోయేట్లు చేయడానికి మనసెలా ఒప్పిందండీ? 

నిన్నటిదాకా మీరు తిని వదిలిన మెతుకులు తిన్నాం

ఈ రోజు నుంచి మీ ఎంగిలి ప్రసాదమే మహా భాగ్యంగా తలచి తింటాం. పాడుకుంటాం...’’


Updated Date - 2020-09-30T06:03:39+05:30 IST