అక్కడ 200 ఏళ్లుగా చీరలు కట్టుకుంటున్న మగవారు.. కారణమేంటో తెలుసా..!

ABN , First Publish Date - 2021-10-17T03:12:16+05:30 IST

మగవారు చీరలు కట్టుకోవడం ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా.. అవును ఇది నిజం. ఆ ప్రాంతంలో 200 సంవత్సరాల నుంచి ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.

అక్కడ 200 ఏళ్లుగా చీరలు కట్టుకుంటున్న మగవారు.. కారణమేంటో తెలుసా..!

మగవారు చీరలు కట్టుకోవడం ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా.. అవును ఇది నిజం. ఆ ప్రాంతంలో 200 సంవత్సరాల నుంచి ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిదవ రోజున(అష్టమి) చీరలు కట్టుకుని అమ్మవారి ఆలయానికి వెళ్లి పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. తమను క్షమించమని వేడుకుంటూ ఉంటారు. మహిళలు కూడా సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని సందడి చేయడం మనం చూడొచ్చు. అయితే అక్కడి మగవారు చీరలు ఎందుకు కట్టుకుంటారు.. వారికి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.. ఆ ప్రాంతం ఎక్కడ ఉంది.. అనే వివరాల్లోకి వెళితే..


గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఓల్డ్‌సిటీలో తరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన గర్బా పండుగను షెర్రీ గర్బా అని కూడా పిలుస్తారు. 200 ఏళ్ల క్రితం మహిళలకు ఆ ప్రాంతంలో రక్షణ లేకుండా ఉండేది. అదే సమయంలో ఓ వ్యక్తి తన కుమార్తెను చంపుతాడు. ఇలాంటి ఘటనలు ఎక్కువవడంతో సదుబా దేవి అనే అమ్మవారు ఇక్కడి వారిని శపించిందట. దీంతో భయపడ్డ పురుషులు అమ్మవారిని శరణు వేడుకుంటారు. ఇందుకు ప్రాయశ్చితంగా సదు మాత పేరుతో ఓ ఆలయాన్ని నిర్మించారు.


 అప్పటి నుంచి నవరాత్రి ఉత్సవాల్లో అష్టమి రోజున మగవారంతా చీరలు కట్టుకుని గర్బా అనే పేరుతో న్యత్యం చేస్తూ, ఇకపై తప్పు చేయమని.. తమను క్షమించమని అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ కుటుంబంలోని పిల్లలకు దీర్ఘాయువు ప్రాప్తిస్తుందని, లేదంటే వారి కుటుంబాలపై దేవత ప్రతీకారం తీర్చుకుంటుందని నమ్ముతారు. దీంతో బారోట్ కమ్యూనిటీకి చెందిన ఈ ప్రజలు అప్పటి నుంచి సదుమాత పట్ల కృతజ్ఞతగా ప్రతి ఏడాదీ ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.



Updated Date - 2021-10-17T03:12:16+05:30 IST