ఒక స్త్రీ... ఇస్త్రీ కథ!

ABN , First Publish Date - 2021-10-25T07:03:51+05:30 IST

మారుతున్న కాలానికి తగ్గట్టు చిరు వ్యాపారులు కూడా తమ వృత్తి నైపుణ్యాలను కూడా మార్చుకుంటూ ఉండాలి. అందుకోసం మేం పూనుకున్న గ్యాస్‌ ఇస్త్రీ పెట్టెల ప్రాజెక్టు విజయవంతమైంది.

ఒక స్త్రీ... ఇస్త్రీ కథ!

వినూత్నం


మారుతున్న కాలానికి తగ్గట్టు చిరు వ్యాపారులు కూడా తమ వృత్తి నైపుణ్యాలను కూడా మార్చుకుంటూ ఉండాలి. అందుకోసం మేం పూనుకున్న గ్యాస్‌ ఇస్త్రీ పెట్టెల ప్రాజెక్టు విజయవంతమైంది. 

మాది కేరళ. మా పూర్వీకులు బెంగళూరులో స్థిరపడడంతో నేను ఇక్కడే పుట్టి, పెరిగాను. ప్రారంభంలో కార్పొరేట్‌ ఉద్యోగాలు చేసినా, సమాజం మీద ప్రభావాన్ని కనబరిచే వృత్తిలో కొనసాగాలనే ఆలోచనతో, ఉద్యమ్‌ వ్యాపార్‌లో చేరి చిరువ్యాపారులకు తోడ్పడుతున్నాను. ఈ పని ద్వారా నాకు వృత్తిపరమైన సంతృప్తి దక్కుతోంది. 

ప్రతి వీధి చివరనా కనిపించే ఇత్తడి ఇస్త్రీ పెట్టె బొగ్గుల ధరతో భగ్గుమంటోంది. నిప్పుల నుంచి ఎగసిపడే పొగతో ఆరోగ్యం కుదేలవుతోంది. నిప్పురవ్వలతో దుస్తులకు రంధ్రం పడితే, ఇక భృతి గల్లంతే! పెట్టె ఆడందే డొక్కాడని ఇస్త్రీవాలాల బ్రతుకులివి. వాళ్ల కష్టాలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించి... బొగ్గులకు బదులు గ్యాస్‌తో నడిచే ఇస్త్రీ పెట్టెలకు అంకురార్పణ చేసిందో మహిళ. 

‘ఉద్యమ్‌ వ్యాపార్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో... బెంగుళూరులోని ఇస్త్రీవాలల బ్రతుకుల్లో కొత్త జీవం నింపుతున్న... 

మేనకా మీనన్‌ను నవ్య పలకరించింది!


ముడతలు వదిలి, రెపరెపలాడే దుస్తులు ధరించనిదే ఆఫీసులకు వెళ్లలేం! ఎంత ఆధునికమైన ఐరన్‌ బాక్సులు ఇంట్లో ఉన్నా, బట్ట అణగాలంటే ఇత్తడి ఇస్త్రీ పెట్టె తగలాల్సిందే! కానీ వీధికొకటి చొప్పున కనిపించే ఇస్త్రీ బంకులు క్రమేపీ కనుమరుగవడం మొదలుపెట్టాయి. దాంతో చిరు వ్యాపారుల జీవనభృతిని మెరుగు పరచడమే లక్ష్యంగా పని చేసే లీడ్‌ ఉద్యమ్‌ వ్యాపార్‌ బాధ్యతలు కలిగిన నేను, ఇస్త్రీ వ్యాపారం నెమ్మదించడానికి కారణాలను అన్వేషించాను. ఆ క్రమంలో ఇస్త్రీవాలాలను కలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. 


వేడెక్కే పెట్టె వెంటే కష్టాలు.. 

ఒకసారి బొగ్గులను మండించి, నిప్పు కణికలుగా మార్చడానికి కనీసం 40 నిమిషాల సమయం పడుతుంది. అలా మండించిన బొగ్గులు కాలి, బూడిదగా మారితే, మళ్లీ కథ మొదటికొస్తుంది. అవి తిరిగి మండుకుని, పెట్టే వేడెక్కేవరకూ ఆగక తప్పదు. ఇలా రోజులో దాదాపు రెండు గంటల సమయం వృథా అవుతుంది. ఇక వాన కురిసి, బొగ్గులు తడిచాయంటే అవి ఎండేవరకూ పెట్టె అటకెక్కక తప్పదు. వీటన్నిటినీ మించి బొగ్గుల ధరలతో ఇస్త్రీవాలాల జేబుల్లో చిల్లులు పడుతున్నాయి. ఈ తిప్పలకు తోడు పెట్టె నుంచి నిప్పురవ్వలు ఎగసిపడి, దుస్తులు కాలితే ఇక అంతే సంగతులు. కస్టమర్ల తిట్లు, చీవాట్లతో ఇస్త్రీవాలాల కడుపులు ఆ రోజుకి నిండిపోతూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే, బొగ్గుల పెట్టె నుంచి వెలువడే సెగ, పొగలతో ఇస్త్రీవాలాలను దగ్గు, ఆయాసం లాంటి ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తూ ఉండడం గమనించాను. కుల వృత్తి కాబట్టి, పడుతూ లేస్తూ ఎలాగోలా సర్దుకుపోదామనుకున్నా, అందుకు అవరోధాలు కాలక్రమేణా పెరిగిపోతూ ఉండడంతో, వారికి పెట్టెలను అటకెక్కించే పరిస్థితి దాపురించింది. వాళ్ల కష్టాలు తీరాలంటే అదే వృత్తిని హూందాగా, ఆరోగ్యకరంగా కొనసాగించే ప్రత్యామ్నాయాన్ని వారికి చూపించాలి. ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టాను.


సౌకర్యంగా ఉండేలా మార్పులు చేసి...

ఇందుకోసం ఎంతో పరిశోధన చేశాను. ఆ క్రమంలో ఎల్‌పిజితో నడిచే బోలెడన్ని ఇస్త్రీ పెట్టెలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. వాటిని తెప్పించి, ప్రత్యక్షంగా వాడి చూస్తే, ఎన్నో ఇబ్బందులు బయల్పడ్డాయి. ఇస్త్రీవాలాలు వాడే ఇస్త్రీపెట్టెల హ్యాండిల్స్‌ కలపతో తయారై ఉంటాయి. కానీ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినవాటి హ్యాండిల్స్‌ ప్లాస్టిక్‌వి. అంతే కాకుండా హ్యాండిల్‌కూ, పెట్టెకూ మధ్య జాగా తక్కువ ఉండడంతో, ఆ డిజైన్‌ ఇస్త్రీవాలలకు అసౌకర్యంగా మారింది. కాబట్టి ఈ ఇబ్బందులన్నిటినీ డిస్ర్టిబ్యూటర్ల దృష్టికి తీసుకువచ్చి, ఇస్త్రీవాలలకు సౌకర్యంగా ఉండేలా మార్పులు చేయించి వాళ్లకు అందించాం. వాటిని వాడడం మొదలుపెట్టిన తర్వాత మునుపటి బొగ్గుల పెట్టెతో పోల్చుకుంటే, తాజాగా తయారు చేయించిన గ్యాస్‌ ఇస్త్రీపెట్టెలు 27ు ఎక్కువ ఆదాయాన్ని అందించాయి. ఇంధనం ధర తగ్గడంతో పాటు, సమయం కూడా ఆదా అవుతూ ఉండడంతో ఇస్త్రీవాలాల ఆదాయం మునుపటి కంటే పెరిగింది. 


ఐదు కిలోల సిలిండర్‌

ఇస్త్రీ పెట్టెలకు అనుసంధానించే గ్యాస్‌ సిలిండర్‌ బరువు ఐదు కిలోలే! ఈ రకం సిలిండర్ల వాడకం ఇళ్లలో తక్కువ. కాబట్టి గ్యాస్‌ కంపెనీల దగ్గర ఈ సిలిండర్లు మిగిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇస్త్రీవాలాలు అవే సిలిండర్లను వాడుకోవడం వల్ల గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభం దక్కుతోంది. 


40% మహిళలే...

ఇస్త్రీ వృత్తిలో మహిళలూ ఉన్నారు. బెంగుళూరులోని ఇస్త్రీవాలాల్లో 40ు మహిళలే! పురుషులతో సమానంగా అవే కష్టాలను భరిస్తూ, బ్రతుకీడుస్తున్న మహిళలకు కూడా గ్యాస్‌తో నడిచే ఇస్త్రీపెట్టెలు అందేలా తోడ్పడ్డాం. ఇస్త్రీవాలాలకూ... ఐరన్‌ బాక్స్‌ డీలర్లూ, గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లకూ మధ్య ఉద్యమ్‌ వ్యాపార్‌ తరఫున అనుసంధానకర్తగా వ్యవహరించడంతో పాటు కొనుగోలులో, శిక్షణలో తోడ్పడుతూ ఉంటాం. ఇలా బెంగుళూరుతో పాటు త్రివేండ్రం, చెన్నైలలోని ఇస్త్రీవాలాలకూ సహాయపడ్డాం. ఇప్పటివరకూ మొత్తం 10 నుంచి 15 వేల మంది ఇస్త్రీవ్యాపారులకు మేం తోడ్పడ్డాం. కాలం మారుతోంది. మారుతున్న కాలానికి తగ్గట్టు చిరు వ్యాపారులు కూడా తమ వృత్తి నైపుణ్యాలను కూడా మార్చుకుంటూ ఉండాలి. అందుకోసం మేం పూనుకున్న గ్యాస్‌ ఇస్త్రీ పెట్టెల ప్రాజెక్టు విజయవంతమైంది. మున్ముందు ఇస్త్రీపెట్టెల ధరలు మరింత అందుబాటులోకి తేగలిగే ప్రయత్నాలు చేస్తాం. ఇస్త్రీపెట్టెల కొనుగోలులో ఆర్థిక తోడ్పాటు అందించి, వాళ్ల జీవితాలు మరింత మెరుగు పడేలా చేయడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం.

-గోగుమళ్ల కవిత

Updated Date - 2021-10-25T07:03:51+05:30 IST