మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే!

ABN , First Publish Date - 2020-11-30T06:34:48+05:30 IST

సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా 20 ఏళ్ల అనుభవం వ్రిందా మెహతా సొంతం. శారీరక దృఢత్వాన్ని పెంచుకొనే కన్నా మానసికంగా దృఢంగా ఉండడం చాలా ముఖ్యం అంటారామె. ఇప్పట్లో అందరిలో ఫిట్‌నెస్‌ మీద అవగాహన పెరిగింది...

మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే!

సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా 20 ఏళ్ల అనుభవం వ్రిందా మెహతా సొంతం. శారీరక దృఢత్వాన్ని పెంచుకొనే కన్నా మానసికంగా దృఢంగా ఉండడం చాలా ముఖ్యం అంటారామె. ఇప్పట్లో అందరిలో ఫిట్‌నెస్‌ మీద అవగాహన పెరిగింది. అయితే మరింత అవగాహన పెరగాల్సి ఉందంటున్న వ్రిందా ఒత్తిడి లేని జీవనశైలి కోసం ఏం చెబుతున్నారంటే... 


మన మెదడు మనలోని శక్తిమంతమైన గురువు. మనం చేయాల్సిందల్లా దాన్ని ఎంత బాగా ఉపయోగించగలమో ఆలోచించడం. రాబోయే రోజుల్లో వచ్చే కరోనా లాంటి ఉపద్రవం మానసిక ఆరోగ్యం. ఈ మాటను నేను చాలా రోజుల నుంచి చెబుతున్నాను. మనం మానసికంగా ఫిట్‌గా లేకపోతే శారీరకంగా ఫిట్‌గా లేమని అర్థం. 


శరీరం, మనసూ రెండూ ఒకటే

మానసిక ఆరోగ్యం గురించి నేను ఎల్లప్పుడూ ఆన్‌లైన్‌ సెషన్స్‌ నిర్వహిస్తుంటాను. ప్రస్తుతం కరోనా కాలం లాంటి సవాళ్లతో కూడిన సమయంలో ఎంతోమంది ఒత్తిడి, ఉద్రేకానికి లోనవుతున్నారు. ముఖ్యంగా వారిలో అనవసరపు భయాలు ఎక్కువగా ఉన్నాయి. పరిస్థితి చేయి దాటకముందే ఈ సమస్య నుంచి బయట పడాలి. నేను ఇరవై ఏళ్లకు పైగా ఫిట్‌నెస్‌ రంగంలో ఉన్నాను. పలురకాల డైట్‌, ఫిట్‌నెస్‌ ట్రెండ్స్‌ను చూశాను. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఫిట్‌నెస్‌ మీద  అవగాహన పెరిగింది. అయితే పూర్తిస్థాయిలో కాదు. ఇప్పటికీ మనం ఆహారం, సప్లిమెంట్స్‌, వ్యాయామం ద్వారానే ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ మనస్సును మరచిపోతున్నాం. మన మనసు, శరీరం రెండూ వేర్వేరు కావు. అవి రెండూ ఒకటే. ఏదైతే మనసుపై ప్రభావం చూపుతుందో, శరీరంపైనా ప్రభావం చూపుతుంది. అలానే శరీరంపై ప్రభావం చూపేది, మనసుపై ప్రభావం చూపుతుంది. 

క్రమం తప్పకుండా శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఒంట్లోని మలినాలతో పాటు మనసు ఒత్తిడిని పెంచే ఆలోచనలు, భావోద్వేగాలను వదలించుకోవడం కూడా ముఖ్యమే. నా దృష్టిలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టే సెలబ్రిటీ ఎవరంటే.. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌. ఆయన ఆ రెండిటికీ ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. 


ఒత్తిడికి లోనవకుండా ఉండాలంటే...

  1. అన్నిటికన్నా ముందుగా మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. మన ప్రతి ఆలోచన, భావోద్వేగం శరీరంలో ప్రతి కణం మీద ఏదో విధంగా ప్రభావం చూపుతుంది. అందుచేత శరీరం, మనసూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
  2. తేలికైన ప్రాణాయామం లేదా బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల పాజిటివ్‌ ఆలోచనలు కలుగుతాయి.
  3. ప్రకృతిలో కొంత సమయం గడపాలి. ఎండలో కొద్దిసేపు నిల్చోవాలి. గడ్డి మీద, ఇసుకలో కొద్ది సేపు నడవాలి.
  4. ప్రశాంతమైన  సంగీతం వినాలి.
  5. రోజూ కొంత సమయం ధ్యానం చేయాలి.

Updated Date - 2020-11-30T06:34:48+05:30 IST