మందుల చీటీతో బయటపడ్డ ‘డాక్టర్’ యవ్వారం! మెడికల్ షాపు‌లోని ఉద్యోగికి డౌటొచ్చి..

ABN , First Publish Date - 2020-02-21T22:14:46+05:30 IST

రోగులకు మందులు సూచించిన మెంటల్ డాక్టర్

మందుల చీటీతో బయటపడ్డ ‘డాక్టర్’ యవ్వారం! మెడికల్ షాపు‌లోని ఉద్యోగికి డౌటొచ్చి..

భోపాల్: అది ఓ ఆసుపత్రి. అందులోనే ఓ మెడికల్ షాపు ఉంది. ఓ రోజున షాపుకి కొందరు రోగులు వచ్చారు. డాక్టర్ రాసిచ్చిన చీటీని అక్కడున్న ఉద్యోగి చేతిలో పెట్టి.. మందులు ఇమ్మన్నారు.  అతడు అల్మారాలోంచి మందులు తీసి ఇస్తూ.. కౌంటర్ వద్ద ఉన్న వారితో సంభాషణ ప్రారంభించాడు. అప్పుడే అతడికి రోగులకున్న అనారోగ్య సమస్యల గురించి తెలిసింది. మందుల చీటీలో మాత్రం వేరే మందుల పేర్లు రాసి ఉన్నాయి. రోగుల సమస్యలకు.. డాక్టర్ సూచించిన మందులకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. దీంతో అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. గతంలో ఎప్పుడూ ఇలా జరగకపోవడంతో అతడు అయోమయంలో పడిపోయాడు. 


అసలేం జరిగిందో తెలుసుకునేందుకు అతడు పరుగు పరుగున డాక్టర్ గదికి వెళ్లాడు. అక్కడ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూసి మరోసారి షాకయ్యాడు. రోగులను పరీక్షిస్తున్నది...తనకు తెలిసిన డా. హిమాంషూ కాదు. అతడెవరో కూడా తెలియదు. వెంటనే ఆసుపత్రిని సెక్యురిటీని అప్రమత్తం చేశాడు. ఆ తరువాత బయటపడింది అసలు విషయం. అక్కడ రోగులకు తెగ వైద్యం చేసింది డా. హిమాంషూ కాదని, మతిస్థిమితం లేని ఓ రోగి అనే విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ బయటకు వెళ్లగా చూసి మతిస్థిమితం లేని వ్యక్తి.. రంగంలోకి దిగాడని తెలిసి ఆసుపత్రి సిబ్బంది అవాక్కయ్యారు. జరిగిన విషయాన్ని రోగులకు చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.  అచ్చు సినిమా ఘటనలను పోలిన ఈ ఉదంతం..మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్ జిల్లాలో ఇటీవల జరిగింది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. తాను ప్రఖ్యాత ఎయిమ్స్‌లో పనిచేస్తున్నానని, రోగుల వెతలు తీర్చేందుకు వైద్యం చేస్తున్నాని ఆ మతి స్థితిమితం లేని వ్యక్తి చెప్పడం ఈ మొత్తం ఉదంతంలో కొసమెరుపు.  



Updated Date - 2020-02-21T22:14:46+05:30 IST