Abn logo
Apr 19 2021 @ 21:53PM

ఆగిన మధ్యాహ్న భోజన పథకం

విద్యార్థులు పస్తులతో విద్యాభ్యాసం

వరికుంటపాడు, ఏప్రిల్‌ 19: మండల కేంద్రానికి శివారు గ్రామమైన నల్లబోతులవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో రోజుల తరబడి మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయినప్పటికీ అధికారులు తమకేమీ తెలియదని చెప్పడం వారి నిర్లక్ష్యవైఖరికి నిదర్శనం. ఆ పాఠశాల భోజన నిర్వాహకురాలు అరుణ మెనూ ప్రకారం వంటలు చేస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు, కొంతమంది గ్రామస్థులు ఇబ్బందులకు గురిస్తున్నారంటూ గత నెల 20వ తేదీ నుంచి  వంట చేయడం మానేసింది. అప్పటి నుంచి ప్రధానోపాధ్యాయుడు నారాయణరావు విద్యార్థులకు కేవలం వేరుశనగ చిక్కీలు, కోడిగుడ్లను ఇచ్చి ఇళ్లకు పంపుతున్నారు. దీంతో  విద్యార్థులు రోజుల తరబడి పస్తులతోనే నివాసాలకు పరుగులు తీస్తున్నారు. 18 రోజులు మధ్యాహ్న భోజనం నిలిచిపోయినప్పటికీ ఎంఈవో తనకు సమాచారం తెలియదని చెప్పడం గమనర్హం.

ఫలించని బుజ్జగింపులు

ఎలాగోలా విషయం తెలుసుకున్న ఎంఈవో షేక్‌ షావుద్ధీన్‌ పాఠశాలకు చేరుకుని మధ్యాహ్న భోజన నిర్వాహకురాలితోపాటు హెచ్‌ఎంను విచారించారు. ఇకపై ఎలాంటి పొరపాట్లు లేకుండా చూస్తానని హామీ ఇచ్చినప్పటికీ వంట చేసేందుకు నిర్వాహకురాలు ససేమిరా అన్నారు. ఎంతసేపు బుజ్జగింపులు చేసినా ఫలితం లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక త్వరలో పీఎంసీ సమావేశం నిర్వహించి నూతన నిర్వాహకురాలిని నియమించుకోవాలని ఆయన సూచించారు. అలాగే నల్లబోతులవారిపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాడు-నేడు పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం రిజిస్టర్లు పరిశీలించి సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement