Abn logo
May 3 2021 @ 00:54AM

మేరా భారత్‌ యమహాన్‌

ఆసేతు శీతాచలం

అరుకాషుని పడగనీడ!

తలపులపై విషం చిమ్ము

విద్వేషపు విలయక్రీడ!


జింకల నెత్తురు ఓడే

పులి కోరకు జేజేలు!

శవ నేత్రపుటద్దాల్లో

ప్రభువర్గం సోకులు!


నియంత నట విన్యాసమే

జనస్వామ్యపు సార్థక్యం!

తన్నిన కాలిని ముద్దిడు

పరవశమే స్వాతంత్య్రం!


అగ్రాసనాలు, రాజ్యాంగాలు..

రాజదండానికి సాష్టాంగాలు!

పరాధీన శిరసులపై

‘చిలకలపూడి’ కిరీటాలు!


పూలంటే చులకన..

ముళ్లంటే ఆరాధన!

వెలుతురన్న వెగటు..

చీకటిపై వలపు!


సత్యాన్నీ, సైన్సునూ

చిన్నబుచ్చు జాడ్యము!

పురాణమే ప్రమాణమని

బల్లగుద్దు మౌఢ్యము!


కాలపు పొరలు విప్పే  

గుట్టు కాదు చరిత!

పాలక దొరలు చెప్పే

కట్టుకతలకు అది వంత!


దేశమంటే జనం కాదు..

దేశమంటే దుర్జనం!

దేవుని మాటున దగా..

దేశభక్తికి నిదర్శనం!


రొచ్చును రొచ్చనరాదు..

దొంగను దొంగనరాదు..

ముసుగును ముసుగనరాదు..

ఆ నేరాలకు తథ్యం ఖైదు!


‘పశు’ద్ధం పరమ పవిత్రం..

అమృతధార ఆ మూత్రం!

తోటి మనిషంటే రోత పడే

కశ్మల జీవన సూత్రం!  


ఆకొన్న సిరి రాకాసులకు

నవరత్నగర్భ వడ్డన!

అందరికీ అదే విందని  

నరేంద్రజాల ప్రదర్శన!


వ్యాధిక్రిమిలో వరాన్ని చూసే

కుతంత్ర విద్యా ప్రావీణ్యం!

అడ్డుగోడలతో గద్దెలు కట్టే

కుటిల వ్యూహ చాతుర్యం!


సున్నకి సున్న కలిపితే

నూరని నమ్మించే వంచన!

అదే అసలు గణితం అని

భజన మేధావుల వాదన!


బాహుబలుల సమాధులు..

దుర్భేద్య దుర్గ శిథిలాలు..

కాలపు వికటాట్టహాసాలు..

కనని, వినని నవ     సమ్రాట్టులు!

‘వి-రాగి’

96766 35017


Advertisement
Advertisement
Advertisement